Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ ఇమేజ్ డ్యామేజ్!?
posted on: Jun 13, 2025 12:37PM

వైసీపీ అధినేత జగన్ సమయం సందర్భం లేకుండా ప్రదర్శిస్తున్న దూకుడు విమర్శలపాలవుతోంది. వాస్తవానికి పార్టీ ఓటమి తర్వాత జగన్ ప్రజల్లోకి రావడమే అరుదైపోయింది. ఇటీవల తెనాలిలో దళిత యువకుల పరామర్శ పేరుతో బయటకు వచ్చి వైసీపీని మరింత డ్యామేజ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే తన సొంత మీడియాలో అమరావతి మహిళలపై కొమ్మినేని, కృష్ణంరాజులు చేసిన చర్చపై జగన్ స్పందించిన తీరు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారిందని వైసీపీ శ్రేణులే వాపోతున్నాయంట.
గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్లంతా గంజాయి బ్యాచ్ అనీ, ఆ మత్తులో కానిస్టేబుల్‌పై దాడి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. అందుకనే పోలీసులు ఆ విధంగా దండించాల్సి వచ్చిందని స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే వాళ్లు దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులనీ, దేశంలో చట్టం ఉండగా ఇలా పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదని వైసీపీ విమర్శిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ హుటాహుటిన ఆ యువకుల పరామర్శ పేరుతో తెనాలి వెళ్లారు. అయితే అసలు ఆ ఘటనలో నిజానిజాలు ఏంటో తేలకుండా ఎందుకు అంత హడావుడిగా వెళ్లారనేది అంతుపట్టకుండా తయారైంది. పైగా వెంటనే టిడిపి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో డాక్టర్ సుధాకర్ అంశం తెరపైకి వచ్చింది. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయనకు పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేదాకా పరిస్థితి తీసుకొచ్చారని అప్పటి జగన్ ప్రభుత్వంపై దాడి మొదలైంది.
మరో వైపు తెనాలిలో జగన్ చేసిన ప్రసంగంలో కూడా స్పష్టత లేకుండా పోయింది. నిజానికి ఇలాంటి అంశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముందుగా ఒక బృందాన్ని పంపించడమో.. నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయడమో రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోంది. పోలీసులపై చట్టపరమైన చర్యలు, ఆ యువకులపై ఉన్న కేసులు విషయం పక్కన పెడితే .. ఆ ముగ్గురి విషయమై స్థానికులు నెగిటివ్ గానే చెప్తున్నారు. ఆ క్రమంలో తెనాలి పర్యటన జగన్‌కు కానీ, వైసిపికి కానీ రాజకీయంగా ఏ విధంగానూ లాభించక పోగా నెగిటివ్ అయిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయంట.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కూటమి గెలిచిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలకు జగన్ పిలుపు ఇచ్చారు. పార్టీ శ్రేణులన్నీ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఆయన మాటతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజున కీలక నేతలు అందరూ వైసీపీ శ్రేణులతో కలిసి నిరసనలు జరిపారు . బొత్స లాంటి సీనియర్ నేత కూడా నిరసన చేస్తూ ఎండ వేడి తట్టుకోలేక నిరసన కార్యక్రమంలోనే సొమ్మసిల్లారు. 2024 ఎన్నికల తర్వాత ఏడాది కాలం లో వైసీపీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.
వైసీపీ కార్యకర్తలు, అభిమానులు నెన్నుపోటు దినం నిరసనల్లో పాల్గొన్నారు. కానీ విచిత్రంగా ఈ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన జగన్ మాత్రం బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి ముందుగా షాక్ తిన్నది వైసిపి శ్రేణులే. బహిరంగంగా వాళ్ళు చెప్పకపోయినా పార్టీ పరంగా నిర్వహించిన అంత ముఖ్యమైన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పొల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోవడం పట్ల వైసీపీ వర్గాలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయంట. అలా మళ్లీ జగన్ జనంలో నెగిటివ్ అయ్యారంటున్నారు.
ఇక లేటెస్ట్ కాంట్రవర్సీ రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదంటూ రాయలేని భాషలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఆ షోకి యాంకర్ గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మద్దతు ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అది ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది. ఆల్రెడీ కొమ్మినేనిని, కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు.
మొదటినుంచి మూడు రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగన్ అన్నట్లు అమరావతి ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నెమ్మదిగా రాజధాని ప్రాంతంలో బలం పెంచుకోవడానికి వైసిపి ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి వివాదం కచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. అయితే వైసీపీ నేతలు మాత్రం సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అటు ఛానల్ పైన ఇటు ఆ జర్నలిస్టుపైనా అందరూ విరుచుకుపడుతున్నారు.
మహిళలకు క్షమాపణ చెప్పడం మాని కొమ్మినేని అరెస్టును జగన్ తప్పుపడుతున్నారు. ఇక జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వైసీపీలో నెంబర్ టూగా ఫోకస్ అవున్న సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నిరసన వ్యక్తం చేస్తున్న అమరావతి మహిళలను మళ్లీ టార్గెట్ చేస్తున్నారు. కొమ్మినేని, కృష్ణంరాజుల డిస్కషన్‌పై నిరసనలు తెలిపిన మహిళలను ఉద్దేశించి సజ్జల సంకర జాతి, పిశాచాలు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సంకర జాతి వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన మహిళల త్యాగాలను తక్కువ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ రాజకీయ కోణం అందరికీ తెలిసిందే కానీ .. ఆ అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసిపి ముఖ్యులు దారుణంగా ఫెయిల్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి జగన్ అనాలోచితంగా ప్రదర్శిస్తున్న దూకుడు పార్టీ ప్రతిష్టాను మరింత దిగజార్చుతోందని ఆ పార్టీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.


.webp)



