చంద్రబాబు మేకప్ వేసుకొని, హీరోలా..

సోమవారం శాసనసభ సమావేశాల్లో పుష్కరాల తొక్కిసలాటలో చనిపోయిన మృతులకు సంతాప తీర్మానం సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాటలో మరణించినవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రధ్దాంజలి ఘటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విపక్ష నేత జగన్ అన్నారు. విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ కోసం పుష్కర ఘాట్ లో స్నానానికి వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మేకప్ చేసుకుని వచ్చారని , సినిమాలో హీరోలా కనిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కేటాయించిన ఘాట్ వద్దకు చంద్రబాబు వచ్చారని అన్నారు.

 

మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సంతాప సందేశం కాకుండా మొత్తం అంతా మాట్లాడి ,ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఫ్యాక్షన్ సందేశం ఇస్తున్నారని యనమల ఆరోపించారు. ఇది సంతాప సందేశంగా కనిపించడం లేదని, పరిమితంగానే మాట్లాడాలని, వేరే చర్చలో వీటిని మాట్లాడవచ్చని అన్నారు.

 

జగన్ మాట్లాడుతూ..మనిషిని పొడిచి, ఆ తర్వాత దండలు వేసినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.సభలో దీనిపై గందరగోళంగా మారింది. కోడెల మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, మొత్తం శాసనసభపై ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని అన్నారు.శాసనసభపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోడెల అన్నారు.తాను చంద్రబాబుపై ఆరోపణ చేస్తే శాసనసభపై ఆరోపణలు చేస్తున్నట్లు చెబుతున్నారని అన్నారు.