హాజరు కోసమే సభకు జగన్!?
posted on: Feb 11, 2026 11:32AM

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ మంకుపట్టు పట్టి ఇంత కాలం అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన జగన్.. ఎట్టకేలకు తన పట్టు వీడి అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో ఆయన సభలో అధికారపక్షాన్ని ప్రజా సమస్యలపై నిలదీస్తారని అంతా భావించారు. అయితే పరిశీలకులు మాత్రం జగన్ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నది కేవలం హాజరు కోసమేననీ, హాజరు వేయించుకోవడం ద్వారా తన, తన పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వానికి ఎటువంటి ఇబ్బందీ కలగదన్న భావనతోనే ఆయన అసెంబ్లీకి హాజరవ్వడానికి నిర్ణయించుకున్నారని విశ్లేషించారు.
తీరా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున జగన్ అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు. తన పార్టీ సభ్యులతో కలిసి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్న జగన్.. అసెంబ్లీలో తన పార్టీ సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కో సభ్యుడికీ ఒక్కో నిముషం అన్నట్లుగా కేవలం 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఆ ఉన్న కాసేపూ కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దారుణం అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. తమ నినాదాలతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించారు. గవర్నర్ ప్రసంగానికి గౌరవమిచ్చి తమతమ స్థానాలలో కూర్చోవాలని తెలుగుదేశం కూటమి సభ్యులు పలుమార్లు కోరినా వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. వైసీపీ సభ్యుల నినాదాలను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం ఇంకా పూర్తి కాకుండానే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం, మెడికల్ కాలేజీల పీపీపీ అంశాలకు నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీకి చెందిన 11 మంది సభ్యులూ కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు మిత్రమే సభకు హాజరయ్యారని రాజకీయవర్గాలలో చర్చ మొదలైంది.
ఆరు నెలల గైర్హాజర్ నిబంధన పరిధిలోకి రాకుండా ఉండేందుకు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ చరిత్రలో తొలిసారి డిజిటల్ అటెండెన్స్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గతంలోలా అసెంబ్లీ అటెం డెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లియే అవకాశం , వైసీపీ సభ్యులకు లేకుండా పోయింది. ఇప్పుడిక ఆ అవకాశం లేదు. అది పక్కన పెడితే.. సభలోకి అడుగుపెట్టడానికి ముందు కూడా అసెంబ్లీ ప్రాంగ ణంలో జగన్ తో పాటు వైసీపీ సభ్యులంతా ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు.


.webp)
.webp)


