జగన్ పై దాడి కేసు.. పుస్తకం రాసే అవకాశమివ్వండి!!

 

విచారణ పూర్తి కావడంతో జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు శుక్రవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఎన్‌ఐఏ అధికారులు ఇబ్బంది పెట్టారా అని శ్రీనివాసరావును జడ్జి ప్రశ్నించారు. ఇబ్బంది పెట్టలేదని శ్రీనివాసరావు సమాధానం ఇచ్చాడు. జైల్లో తాను రాసుకున్న 22 పేజీల లేఖను.. జైలు అధికారులు బలవంతంగా తీసుకున్నారని.. ఆ లేఖను తనకు ఇప్పించాలని శ్రీనివాసరావు కోరినట్లు తెలుస్తోంది. అదేవిధంగా శ్రీనివాసరావు ఓ అభ్యర్థనను న్యాయమూర్తి ముందు ఉంచాడట. తనకు పుస్తకం రాసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. తన భావాలను ప్రజలకు చెప్పుకునే అవకాశం కల్పించాలని విన్నవించుకున్నాడట. రాజకీయంగా ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని, తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలని న్యాయమూర్తితో నిందితుడు శ్రీనివాస్‌రావు అన్నట్లు సమాచారం.

అయితే శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలను ఎన్‌ఐఏ ఉల్లంఘించిందని నిందితుడి తరఫున న్యాయవాది మట్టా జయశంకర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు సమాచారం లేకుండా నిందితుడిని విచారించారని న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీనివాసరావును 30 గంటల పాటు ఎందుకు విచారించారని ఆయన వాదించారు. విజయవాడ కారాగారంలో నిందితుడికి ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. జైలులో తోటి ఖైదీలను కూడా నిందితుడి వద్దకు వెళ్లనీయవద్దని ఆయన కోరారు.

నిందితుడు శ్రీనివాసరావుని రాజమహేంద్రవరం జైలుకి తరలించాలని ఎన్ ఐ ఏ కోర్ట్ ఆదేశించింది. విజయవాడ జైల్లో భద్రత లేదని , ప్రాణహాని ఉందని అతని తరఫు న్యాయవాదుల వాదనను న్యాయస్థానం అంగీకరించింది. ప్రత్యేక భద్రత మధ్య రాజమహేంద్రవరం జైలుకి తరలించాలని ఆదేశించిన ఎన్ ఐ ఏ కోర్ట్, ఈ నెల 23 వరకూ రిమాండ్ విధించింది.