వైఎస్ జగన్ అక్రమాస్తులపై సీబీఐ మరో మూడు చార్జ్ షీట్లు

Publish Date:Sep 10, 2013

Advertisement

 

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో విచారణ ముగించేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చిన నాలుగు నెలల గడువు మొన్న 8వ తేదీతో ముగిసింది. అందువల్ల సీబీఐ తన విచారణ పూర్తి చేసి తుది చార్జ్ షీట్ దాఖలు చేస్తుందని అందరూ ఆశిస్తుంటే, సీబీఐ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంగళవారం నాడు మరో మూడు కొత్త చార్జ్ షీట్స్ దాఖలు చేసింది. దీనితో సీబీఐ ఇంత వరకు మొత్తం 8 చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లయింది. త్వరలో మరో రెండు దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.

 

ఇక సీబీఐ ఈ రోజు పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ మరియు భారతి సిమెంట్స్ పై వేర్వేరుగా దాఖలుచేసిన మూడు చార్జ్ షీట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ని ఏ1 నిందితుడిగా పేర్కొంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడు సిమెంట్ కంపెనీలకు కాగ్నానదీ జలాలను విరివిగా వాడుకోవడానికి అనుమతులు, అదేవిధంగా వివద జిల్లాలలో సున్నపురాయి గనులు, వాటిని తవ్వుకోవడానికి అనుమతులు మంజూరు చేసినందుకు ప్రతిగా, ఈ మూడు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి కి చెందిన జగతి పబ్లికేషన్స్ మరియు కార్మెల్ ఏసియా కంపెనీలలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడులను పెట్టడం లంచంమే అవుతుందని ఆరోపిస్తోంది.

 

ఇక ఈ రోజు సీబీఐ వేసిన చార్జ్ షీట్లలో భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యకి, మాజీ గనుల శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి సీబీఐ ఉచ్చుబిగిస్తుందని మీడియాలో వస్తున్న ఊహాగానాలకు విరుద్దంగా వారిద్దరి పేర్లను చార్జ్ షీట్ల నుండి మినహాయించడం వారిరువురికీ చాలా ఉపశమనం కలిగించింది.

 

ఇక సీబీఐ తన విచారణ పూర్తి చేసినా చేయకున్నా జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిలుకి దరఖాస్తు చేసుకోవచ్చునని నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టు చెప్పినందున అతను త్వరలో బెయిలుకు దరఖాస్తుకు చేసుకోవచ్చును. మూడు రోజుల క్రితమే కోర్టు ఆయన రిమాండ్ ఈ నెల 20వరకు పొడిగించింది. గనుక ఆ సమయానికి ఆయన తన బెయిలు దరఖాస్తును కోర్టుకి సమర్పించవచ్చును. అయితే, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అతనికి బెయిలు మంజూరు అవుతుందా లేదా అనేది ప్రశ్న.

 

ఒకవేళ అతను బెయిలుపొంది బయటకు రాగలగితే, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పెద్ద ఎత్తున మారవచ్చును. సమైక్యాంధ్ర నినాదంతో దూసుకుపోతున్న ఆయన పార్టీలోకి, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దూకే అవకాశం ఉంది.