సభకు జగన్ గైర్హాజర్.. పలాయనమేనా?
posted on: Feb 25, 2026 9:20AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశంలో వైసీపీ డిఫెన్స్ లో పడింది. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు ముఖం చాటేయడం ద్వారా తమ వాదనలలో పస లేదని వైసీపీ అధినేత జగన్ అండ్ కో అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు ఈ అంశంపై తన వాదనను తెలుగుదేశం కూటమి అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ స్పష్టంగా వినిపించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జగన్ హయాంలో జరిగిందన్న విషయాన్ని ఆధార సహితంగా సభ ముందుంచింది.
అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తన వాదనను సభలో రికార్డు చేశారు. ఇక ఈ విషయంపై జగన్ మీడియా ప్రసంగాలు చేసి ఖండించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీడియా సమావేశం అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ డిబేట్ కు ఎంత మాత్రం సరిపోలదు. పైగా జగన్ ప్రెస్ మీట్ అంటే రాసుకొచ్చిన, లేదా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ చదివి వినిపించడమేనన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఆయన ప్రెస్ మీట్ లలో విలేకరులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టే సావకాశం ఉండదు. చరిత్ర అడక్కు చెప్పింది విను చందంగా ప్రెస్ మీట్ లో జగన్ ప్రసంగా సాగుతుందన్నది తెలిసిందే.
అదే జగన్ అసెంబ్లీకి వచ్చి తన వాదనను వినిపించి ఉంటే ఆయన వాదన కూడా రికార్డ్ అయ్యేది. దీంతో సభలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై చర్చకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడాన్ని పరిశీలకులు పలాయనంగానే విశ్లేషిస్తున్నారు. సభలో అధికారపక్షాన్ని ఎదుర్కోవడానికి భయపడిందన్న భావనే అందరిలో వ్యక్తం అవుతోంది. సభలో సంఖ్యా బలం లేదు.. నిజమే.. కానీ సభకు హాజరవ్వడం ద్వారా వైసీపీ కల్తీ నెయ్యి విషయంలో తమ వాదన పట్ల విశ్వాసంతో ఉందన్న విషయాన్ని చాటే అవకాశం ఉండేది. అలా కాకుండా సభకు గైర్హాజర్ అవ్వడం ద్వారా ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకుని వైసీపీ మరోసారి విశ్వసనీయతను కోల్పోయిందన్న చర్చ రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.



.webp)


