Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ ఓ విఫల నేత.. అధినేతను అడ్డంగా బుక్ చేసిన అంబటి?
posted on: Mar 16, 2026 5:56PM
.webp)
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ ను అడ్డంగా బుక్ చేశారా? అంబటి తన నోటి దూలతో జగన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ ఐటెమ్ గా మార్చేశారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. విషయం ఏంటంటే.. అంబటి రాంబాబు తాజాగా ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సొంత పార్టీ అధినేత జనగ్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని కుండబద్దలు కొట్టేశారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటర్వ్యూలో యాంకర్ తన చొక్కాపై ఉన్న లోగోను గురించి యాంకర్ ప్రశ్నిస్తే.. ఆ లోగో నవరత్నాలు పథకాలకు సంబంధించిన లోగో అని అంబటి గొప్పగా చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆ పథకాలే కాదు జగన్ నే విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో జగన్ నెటిజనులకు ట్రోలింగ్ ఐటెమ్ గా మారిపోయారు. అసలింతకీ అంబటి రాంబాబు ఉద్దేశమేంటంటే?.. పార్టీ పరాజయం పాలైనంత మాత్రాన జగన్ తమ నాయకుడు కాకుండా పోరనీ, పథకాలు విఫలమైనంత మాత్రాన నవరత్నాలు మంచి పథకాలు కాకుండా పోవనీ చెప్పడమే.
అంబటికి ఏ విషయాన్నైనా వ్యంగ్యవైభవం జోడించి చెప్పడం అలవాటు. అలాగే నోటి దురద కూడా కొంచం ఎక్కువే. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన జగన్ వైఫల్యం అంటూ చేసిన వ్యాఖ్య కూడా ఆ నోటి దురద కారణంగానే అని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే జగన్ వ్యతిరేకులకు ఆయుధంగా మారాయి. జగన్ ఫెయిల్యూర్ అని స్వయంగా అంబటి రాంబాబు ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలతో విపరీతమైన ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా జగన్ ను, వైసీపీనీ, ఆ పార్టీ క్యాడర్ ను ఇబ్బందుల్లో పడేసింది. డిఫెన్స్ లోకి నెట్టేసింది.
ఇటీవలి కాలంలో అంబటి రాంబాబు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ శ్రేణులు 'కాపు టైగర్' అంటూ అభివర్ణించగా, ఆయన కుమార్తె కూడా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు వైసీపీ మద్దతుదారుల దృష్టిని ఆకర్షించాయి.
ఈ క్రమంలో అంబటి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంబటి చేసిన వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల వరకు కూడా ప్రత్యర్థి పార్టీలు వార్తల్లో, చర్చల్లో ఉండేలా వాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. సొంత పార్టీ అధినేతనే నేతనే విఫలనేతగా అంబటి అభివర్ణించడంతో ఆయన రాజకీయ భవిష్యత్ పై కచ్చితంగా ప్రభావం పడుతుందని పరిశీలకులు అంటున్నారు.


.webp)



