అందరూ ఆయన వెనుక ఎందుకు నడవాలిట?

 

రేపటి నుండి రుణమాఫీ అంశంపై వైకాపా తలపెట్టిన మూడురోజుల ఆందోళన కార్యక్రమాలలో వామపక్షాలను , ప్రజలను, మీడియాను తనతో కలిసిరావాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కోరారు. అయితే తనకు నిత్యం బాకా ఊదుతూ, నీడలా వెన్నంటి ఉంటూ, తను మాట్లాడే ప్రతీ మాటను, కార్యక్రమాన్ని గొప్ప ఘనకార్యంలా చాటి చెప్పే సాక్షి మీడియాను, ఎన్నికలలో ఓడిపోవడానికి అదే కారణమని వైకాప నేతలే స్వయంగా నిందిస్తున్నపుడు, ఇతర మీడియా ఛానళ్ళు ఆయన వెనుక ఎందుకు నడుస్తాయి? కొన్ని న్యూస్ పేపర్లు, మీడియా ఛాన్నళ్ళు తమ శత్రువులని జగన్మోహన్ రెడ్డి స్వయంగా అభివర్ణించిన తరువాత వాటిని తన రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి చేస్తున్న ఈ ఆందోళనా కార్యక్రమాలకు మద్దతు ఇమ్మని జగన్ కోరడం హాస్యాస్పదం. అవి తనతో కలిసి రాకపోతే ప్రజా సమస్యలపై పోరాడేందుకు వాటికి ఆసక్తి లేదని నిందించవచ్చును. వచ్చినట్లయితే వాటి వలన తన కార్యక్రమాలకు మరింత మంచి కవరేజి దొరుకుతుందని జగన్ అత్యాశ కావచ్చును.

 

గతంలో జగన్ ఒట్టొట్టి సమైక్యాంధ్ర ఉద్యమాలు నడుపుతున్నపుడు కూడా తెదేపాతో సహా ప్రతిపక్షాలు, ఎన్జీవోలని కూడా తన వెంట నడవాలని హుకూం జారీ చేసారు. అలా నడవకపోతే ప్రజలను మోసం చేసినట్లేనని ఒక సిద్ధాంతం కనిపెట్టారు. కానీ ఆయన రాజకీయంగా ఎదగడానికీ, ఆయన రాజకీయ మైలేజీ పెరగడం కోసం చేస్తున్న ఆ ఉద్యమాలకి తెదేపా, మీడియా, యన్జీవోలు ఎందుకు మద్దతు ఇస్తారు? అని జగన్ ఎన్నడూ ఆలోచించినట్లు లేదు. ప్రభుత్వం రుణమాఫీలు చేస్తూ అధికారికంగా క్యాబినెట్ చేత ఆమోద ముద్ర వేసిన తరువాత కూడా రుణమాఫీ అంశం ద్వారా రాజకీయ మైలేజీ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న తన వెనుక అందరూ నడవాలని జగన్ ఆశించడం హాస్యాస్పదం. దాదాపు తెలుగు మీడియా మొత్తం ఆయనను ఎందుకు దూరంగా పెడుతోందో ఇంతవరకు గ్రహించలేకపోయారు. రాజకీయ పార్టీలేవీ ఆయనను ఎందుకు విశ్వసించడంలేదో తెలుసుకోలేకపోతున్నారు. కానీ తను వ్యతిరేఖిస్తున్నవారు, తనను వ్యతిరేఖిస్తున్నారు కూడా తన వెనుక నడిచి తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాలని జగన్మోహన్ రెడ్డి ఆశించడం హాస్యాస్పదం.అయినా ఆయనకు తన రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి మెరుపులాంటి ఆలోచన వస్తే, అందుకు స్వంత పార్టీని, మీడియాని ఉపయోగించుకోవచ్చును కానీ ఇతర పార్టీలను ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయని ఆయన ఆరోపిస్తున్న మీడియాను కూడా వాడేసుకొందామంటే ఎవరు అంగీకరిస్తారు?