జగన్ ను డీ కొనలేకనే వైకాపాతో దోస్తీకి కాంగ్రెస్ సిద్దపడుతోందా

 

నిన్న దిగ్విజయ్ సింగ్ జగన్, రాజశేఖర్ రెడ్డిల గురించి చేసిన వ్యాక్యలతో కలవరపడిన కాంగ్రెస్ నేతలు వాటి పరమార్ధం వెతికే పనిలోపడ్డారు. జగన్, రాజశేఖర్ రెడ్డిల ప్రభావం తెలంగాణా కంటే సీమంధ్రాలోనే అధికంగా ఉండటంతో సీమంధ్ర నేతలలో ఈ విషయంపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. తాము జగన్ మోహన్ రెడ్డిని, అతని పార్టీని తమ ప్రాంతంలో నిలవరించగలమని గట్టిగా చెప్పకపోవడం వలననే, దిగ్విజయ్ సింగ్ విధిలేని పరిస్థితుల్లో జగన్ పార్టీతో పొత్తులు తప్పవని హెచ్చరించారని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

 

సీమంధ్రా ప్రాంతంలో, జగన్ చేతిలో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని అధిష్టానం గుర్తించినందునే, అయిష్టంగానయినా అతని పార్టీతో పొత్తులకు సిద్దపడి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. తద్వారా కొంత మేరయినా పార్టీకి నష్టం తగ్గించాలని భావించినందునే, దిగ్విజయ్ సింగ్ ఆవిధంగా అని ఉండవచ్చునని కొందరు సీమంద్రా నేతలు అభిప్రాయ పడ్డారు.

 

ఇటువంటి నేపద్యంలో, తెలంగాణా అంశం మరింత కాలం సాగదీయడం వలన, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా మారుతుందనే ఆందోళనతోనే పార్టీ అధిష్టానం తెలంగాణా ఇచ్చేసేందుకు సిద్దపడుతోందని వారు భావిస్తున్నారు. తెలంగాణా ఈయకుంటే తెరాస చేతిలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని టీ-కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి గట్టిగా చెప్పినందునే తెలంగాణా ప్రకటనకి సరికొత్త గడువు ప్రకటించారని భావిస్తున్నారు. పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకొనేందుకు, అటు తెలంగాణా ప్రకటనకి, ఇటు జగన్ మోహన్ రెడ్డితో దోస్తీకి పార్టీ సిద్దం అవుతోందని వారు అబిప్రాయపడ్డారు.

 

దిగ్విజయ్ సింగ్ కేవలం పది రోజుల్లో రాష్ట్ర విభజనపై స్పష్టమయిన ప్రకటన చేస్తానని చెప్పడంతో, తాము ఈలోగానే జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొని పార్టీకి సీట్లు సాధించగలమని గట్టిగా చెప్పాలని సీమంధ్రా నేతలు ఆలోచిస్తున్నారు. లేకుంటే, ఈసారి కేంద్రం తెలంగాణా ప్రకటన చేసిన తరువాత మరిక వెనక్కి తగ్గే అవకాశం ఎంత మాత్రం ఉండదని వారు భావిస్తున్నారు. అందువల్ల మళ్ళీ వెంటనే మరో సమావేశమయ్యి జగన్ మోహన్ రెడ్డిని తాము ఏవిధంగా నిలువరించగలమో ఒక పధకం ఆలోచించుకొని డిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి వివరించి తెలంగాణాను, జగన్తో దోస్తీని ఎలాగయినా అడ్డుకోవాలని వారు నిశ్చయించుకొన్నట్లు సమాచారం.

 

క్రిందటి ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తే, ఈసారి జైల్లో ఉన్నపటికీ జగన్ మోహన్ రెడ్డి ఆపని చేయడం విశేషం.