ఒక్క పిటిషను వేస్తే వంద పిటిషన్లు వేసినట్లే

 

అదేదో సినిమాలో హీరో నేను ఒక్కమారు చెపితే వంద సార్లు చెప్పినట్లే అన్నట్లు, కోర్టు ఒక పిటిషను తిరస్కరిస్తే వంద పిటిషన్లు వేసయినా సరే ఒప్పించుకోగల పట్టువదలని విక్రమార్కుడు జగన్మోహన్ రెడ్డి. దేశమంతటా తిరిగేందుకు అనుమతి కోరుతూ అతను వేసిన పిటిషనును నిన్న సీబీఐ కోర్టు తిరస్కరించగానే, వెంటనే మరో పిటిషను వేసారు. నేరుగా ‘నేషనల్ పర్మిట్’ అడిగితే కోర్టు ఈయదని గ్రహించిన అతను, ఈసారి కోల్ కతా, లక్నో నగరాలు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరుతూ మరో పిటిషను వేసారు. అతను ఊహించినట్లే ఆ రెండు నగరాలకి వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఈరోజు అనుమతి మంజూరు చేసింది. బహుశః ఈ రెండు చుట్టబెట్టి వచ్చిన తరువాత ఒరిస్సా మరియు బీహార్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ మరో పిటిషను వేస్తారేమో!

 

దేశంలో వివిధ కాంగ్రెసేతర పార్టీ నేతలను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు మద్దతు కోరేందుకు ఈ యాత్రలని అతను పైకి చెపుతున్నపటికీ, ఈ సాకుతో దేశంలో అన్ని పార్టీల నేతలతో పరిచయాలు పెంచుకొని, అందరి దృష్టిని ఆకర్షించడమే అతని లక్ష్యమని చెప్పవచ్చును. ఒకప్పుడు స్వర్గీయ యన్టీఆర్, చంద్రబాబు కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పేరో, తను కూడా ఆవిధంగానే తిప్పుదామని అతని ఉద్దేశ్యం కావచ్చును.

 

అంతే గాకుండా, ఈవిధంగా జాతీయ స్థాయి నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతున్నట్లయితే, కాంగ్రెస్ మళ్ళీ తనపై సీబీఐని కానీ ఈడీని గానీ ప్రయోగించే దుస్సాహసం చేయదనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.

 

కానీ ఈ ప్రయత్నంలో ఒకదానికి మరొకటి బద్దశతృవులయిన పార్టీలని జగన్ కలుస్తుండటం వలన, అతను వారి మద్దతు పొందడం సంగతి ఎలా ఉన్నపటికీ, ముందు అతనిపై అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. మొదట అతను లెఫ్ట్ పార్టీలని కలిసిన మరునాడే అవి తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీని కలిసి రహస్య మంతనాలు చేసి వచ్చారు. రేపు అతను లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖించే తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీని కలువబోతున్నారు. ఆ తరువాత బీజేపీకి బద్దశత్రువయిన సమాజ్ వాదీ పార్టీ నేతలని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ని కలవబోతున్నారు. ఇక వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువులేనని వేరే చెప్పనవసరం లేదు.

 

జగన్ ఎటువంటి సిద్ధాంతాలు చూడకుండా ఈవిధంగా దేశంలో ఉన్న కాంగ్రెసేతర రాజకీయ పార్టీలను కలవడం ద్వారా తను కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధినని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు గాక. ఈ యాత్రల వలన అతను ఆశిస్తున్న దొకటయితే, ఫలితాలు మాత్రం వేరేలా ఉండే అవకాశాలున్నాయి.

 

అతను ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహమే అతనికి పరాభవాలు మిగిల్చినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించినా ఆశ్చర్యం లేదు. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ మళ్ళీ తనను జైలుకి పంపే సాహసం చేయలేదని అతని అబిప్రాయం కావచ్చును.