జగన్ దీక్షతో వైకాపాకు మీడియా కవరేజ్

 

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా చంచల్ గూడా జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను ఆసుపత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారని అతని తల్లి విజయమ్మ మీడియాకు తెలిపారు. అతని బీపీ, షుగర్ స్థాయి పడిపోవడం, కీటోన్స్ కూడా తగ్గడంతో ఇంకా దీక్ష కొనసాగించడం ప్రమాదమని చెప్పినప్పటికీ ఆయన దీక్ష విరమించేందుకు అంగీకరించట్లేదని ఆమె తెలిపారు.

 

అందువల్ల బలవంతంగానయినా వైద్యులు అతనికి గ్లూకోజ్ ఎక్కేంచే అవకాశముంది. జగన్ మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించబోతున్నారనే వార్తలు వినగానే షరా మామూలుగానే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణుల, నేతల హడావుడి మొదలయిపోయింది. నిన్నటి నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు చంచల్ గూడా జైలు, ఉస్మానియా ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున చేరుకొంటున్నారు. తమ నేత దీక్ష భగ్నం చేసినందుకు తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తమ నేతను చూసేందుకు పోలీసులు అనుమతించనందుకు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసారని మండిపడుతున్న సదరు నేతలు, కార్యకర్తలు మళ్ళీ అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందడం విడ్డూరం. అతని ఆరోగ్యపరిస్థితి రోజురోజుకి దిగజారుతున్నందున, అతని ఆరోగ్యం మరింత దెబ్బతినకూదడనే ఆలోచనతోనే పోలీసులు అతని దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అటువంటప్పుడు వైకాపా పోలీసులను నిందించడం అనుచితం. ఒకవేళ పోలీసులు అతనిని దీక్ష కొనసాగించనిచ్చినా రేపు అతని ఆరోగ్యం మరింత దెబ్బ తింటే, అప్పుడు కూడా వారు పోలీసులనే నిందిస్తారు.

 

నేడు  రాజకీయ నేతలుఏదో ఒక కారణంతో నిరాహార దీక్షలకు కూర్చోవడం, వారి దీక్షలను పోలీసులు భగ్నం చేస్తే, చేసారని నిందించడం, ఒకవేళ చేయకపోతే సదరు నేతల ఆరోగ్యం విషమిస్తున్నాకూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించడం పరిపాటయిపోయింది. దీక్షకు కూర్చొన్నప్రతీ ఒక్కరి డిమాండు ఏ ప్రభుత్వమయినా తీర్చగలదా? అనే ఆలోచన లేకుండా మీడియా కవరేజ్ కోసం, పార్టీకి ప్రజలలో గుర్తింపు తీసుకు రావడం కోసం ఈవిధంగా నిరాహార దీక్షల పేరుతో ప్రభుత్వాన్నిబ్లాక్ మెయిల్ చేయడం రాజకీయ నేతలకు పరిపాటయిపోయింది.

 

ఇంతకాలంగా జగన్ మోహన్ రెడ్డిని అతని పార్టీని వెలివేసిన మీడియా, అతను దీక్షకు దిగడంతో నేడు మళ్ళీ మంచి కవరేజ్ ఇస్తోంది. బహుశః జగన్ మోహన్ రెడ్డి అదే కోరుకొని దీక్షకు దిగి ఉండవచ్చును.

 

మొన్న విజయమ్మ నిరవధిక నిరాహార దీక్షకు దిగినప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి ఆమెకు ఫోన్ చేసి ఆమెను దీక్ష విరమించుకోమని కోరడం, మళ్ళీ నేడు అతని ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే విజయమ్మ అతనిని దీక్ష విరమించుకోమని కోరడం, అందుకు అతను నిరాకరించాడని ఆమె బయటకి వచ్చి మీడియాకు చెప్పడం అంతా నాటకీయంగా ఉంది.

 

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజల దృష్టిలో పెద్ద హీరోగా నిలబెట్టేందుకే వైకాపా ఈ డ్రామా నడిపిస్తోంది. సమైక్యాంధ్ర నినాదంతో సీమంధ్రలో పట్టు సాధించాలని తిప్పలు పడుతున్న వైకాపా, ప్రజలను ఆకట్టుకొనేందుకు వరుసపెట్టి ఇటువంటి తాత్కాలిక ఉపాయాలతో కధ నడిపిస్తోంది. పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ఆ పార్టీ ఇదే వ్యూహంతో ముందుకు సాగుతోంది తప్ప పార్టీని బలపరచుకొని ఎదిగే ప్రయత్నం చేయడం లేదు.