రుణాలమాఫీపై ధర్నాలు చేస్తే రాజకీయ మైలేజీ వస్తుందా?

 

బహుశః వారం రోజుల క్రితమే వైకాపా అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రుణాలతో సహా మొత్తం అన్ని రుణాలను తీర్చడానికి తాను ప్రభుత్వానికి దానిని నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరో నెల రోజులు గడువు ఇస్తున్నానని, ఆ తరువాత ప్రజలతో కలిసి తమ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కానీ మంత్రివర్గం అన్ని రకాల రుణాలను మాఫీ చేయడానికి ఆమోదముద్ర వేసిన తరువాత కూడా జగన్ ఇంత హటాత్తుగా ఎందుకు ధర్నాలు, ర్యాలీలకు సిద్దం అవడం చూస్తుంటే, మరో నెల రోజులు ఆగలేకనో లేక ఆగినట్లయితే ఈలోగానే రిజర్వు బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ చేసి, రైతులకు మళ్ళీ కొత్త రుణాలు మంజూరు చేసినట్లయితే తనకు ఈ అంశంపై ఉద్యమించి మైలేజీ పొందే అవకాశం లేకుండా పోతుందనే భయం చేతనో, తను విదించిన నెలరోజుల గడువును పక్కనబెట్టి, రేపటి నుండే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేప్పట్టాలని తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు పిలుపు ఇచ్చారు.

 

ఈ మూడు రోజుల కార్యక్రమంలో ‘నరకాసుర వధ’ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపినిచ్చారు. భూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తెదేపా ఇప్పుడు అధికారం చెప్పట్టాక పంట రుణాల మాఫీ గురించి తేల్చకుండా రోజులు దొర్లించేస్తోందని, దానికి నిరసనగా మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేప్పట్టేందుకు తనతో వామపక్ష పార్టీలు, ప్రజలు, మీడియా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. తెలంగాణాలో రైతులు ఏవిధంగా ఉద్యమించి అక్కడి ప్రభుత్వాన్ని మెడలు వంచి రుణాలు మాఫీ చేయించుకొన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ధర్నాలు ర్యాలీలు చేసి ప్రభుత్వం మెడలువంచి రుణమాఫీ చేయించుకొందామని జగన్ హితబోధ చేసారు.

 

తెలంగాణాలో రైతుల రుణమాఫీ గురించి జగన్ మాట్లాడటం బహుశః ఇదే మొదటిసారి కావచ్చును. కానీ ఆంద్రప్రదేశ్ రైతుల రుణమాఫీ గురించి మాత్రం చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుండే జగన్ మాట్లాడుతున్నారు. ఇదంతా రైతుల సంక్షేమం కోసమే అయితే వారు కూడా చాలా సంతోషించేవారు. కానీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన తరువాత కూడా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, ముఖ్యంగా తనకు అధికారం దక్కకుండా చేసిన తన శత్రువు చంద్రబాబు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం అన్నీ రాజకీయ మైలేజీ కోసం జగన్ పడుతున్న తిప్పలే తప్ప మరొకటి కావు.

 

మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు అంటే మరొక ఐదేళ్ళ పాటు పార్టీపై పట్టు జారిపోకుండా చూసుకోవడానికి, పార్టీలో నేతలు చెయ్యి జారి పోకుండా చూసుకోవడానికీ, తమ భవిష్యత్ ఏమిటో తెలియక స్తబ్దుగా ఉన్న పార్టీ నేతలనీ, కార్యకర్తలనీ బిజీగా ఉంచడానికీ ఈ మాత్రం హడావుడి తప్పదు మరి.