వైకాపాకు జగనే శత్రువా?

 

ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నకారణంగా ఎప్పటికప్పుడు పార్టీ అనుసరించవలసిన రాజకీయ వ్యూహాలను చర్చించే వీలుండేది కాదు. పార్టీలో మైసూర, అంబటి, కొణతాల, పిల్లి సుభాష్, వాసిరెడ్డి వంటి రాజకీయ ఉద్దండులు చాలా మందే ఉన్నపటికీ వారు పార్టీకి దిశానిర్దేశం చేసే అంతటి అధికారం, స్వేచ్చ లేనందున వారి రాజకీయ అనుభవమంతా కేవలం తెదేపా, కాంగ్రెస్ పార్టీలను, ప్రభుత్వాన్నిదుయ్యబట్టేందుకే పరిమితమయింది. జగన్ అందరిపై చలాయించే కర్ర పెత్తనమే అందుకు కారణమని చెప్పవచ్చును.

 

అందువల్ల జగన్ జైలులో ఉన్నంత కాలం, వైకాపా గుడ్డిగా తెదేపా వ్యూహలనే అనుసరించక తప్పలేదు. తెదేపా విద్యుత్ సమస్యలపై చేసిన ధర్నాలు, రైతుల సమస్యలపై పోరాటాలు, నిరాహార దీక్షలను వైకాపా కూడా నీటుగా ఫాలో అయిపోయింది. చివరికి చంద్రబాబు పాదయాత్ర చేస్తే, పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తే బస్సు యాత్రలు చేస్తూ వైకాపా ఎలాగో భారంగా రోజులు దొర్లించేసింది.

 

జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయితే ఈ పరిస్థితుల్లో మార్పువస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ నేటికీ ఆ పరిస్థితిలో మార్పులేదు. కారణం జగన్ జైల్లో ఉన్నా, బయట ఉన్నాతన కర్ర పెత్తనం అలవాటును మానుకోకపోవడమే.

 

ఇటీవల అతను హైదరాబాదులో నిర్వహించిన సమైక్య శంఖారావమే ఒక చక్కటి ఉదాహరణ. జోరుగా కురుస్తున్న జడివానల మధ్య సభ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా అతను సభ నిర్వహించాలనుకోవడమే అతని కర్ర పెత్తనానికి ఒక ఉదాహరణ. కానీ అదృష్టవశాత్తు ఆరోజు భారీ వర్షాలు పడలేదు. పడిఉంటే సభ పరిస్థితి ఏమిటో అతనికే తెలియాలి.

 

సమైక్య రాష్ట్రం కోరుతూ పూరించిన సమైక్యశంఖారవం సభలో వేలాది ప్రజల సమక్షంలో తనకి ముప్పై లోక్ సభ స్థానాలు వస్తే డిల్లీలో చక్రం తిప్పుతానని ప్రకటించడం అతని దురాలోచనలకి అద్దం పడితే, అతను రాష్ట్ర విభజన అనివార్యమని అప్పటికే బలంగా నమ్ముతున్నందునే, కేవలం సీమాంధ్రలో సీట్ల గురించి మాట్లాడినట్లు స్పష్టం అయింది.

 

జగన్ తనకి తగిన రాజకీయ అనుభవము లేనప్పుడు కనీసం పార్టీలో సీనియర్స్ సలహా సంప్రదింపులు చేసినా ఇటువంటి పరిస్థితి దాపురించేది కాదు. కానీ, ఒక హీరోకి ‘దూకుడు’ గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెడితే ఆ దూకుడే వైకాపా కొంప ముంచుతోంది.

 

పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా, తెదేపాను చూసి జగన్ కూడా రాష్ట్ర విభజనకు లేఖ అయితే ఇచ్చేశారు. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు జగన్ రాజకీయ అపరికత్వతని,దుందుడుకు స్వభావాన్ని ప్రస్పుటంగా పట్టి చూపాయి.

 

అందరి కంటే ముందే సమైక్యరాగం ఆలపించేసి, సమైక్య చాంపియన్ అయిపోదామని రాత్రికి రాత్రే తెలంగాణాలో దుఖాణo బంద్ చేసేసుకొని సీమాంధ్రలోకి దూకేసిన తరువాత, తెదేపా నేటికీ తన లేఖకే కట్టుబడి ఉండటం, తెలంగాణాలో కూడా పార్టీని యధాతధంగా నిలబెట్టుకొని ఉండటం చూసి కంగు తిన్నారు. అందుకే మళ్ళీ తెలంగాణా నేతలని మంచి చేసుకొనే ప్రయత్నాలు ఆరంభించారు.

 

అయితే దానివల్ల అతనికి తెలంగాణా ప్రజల నుండి అవమానాలు, చీదరింపులే మిగిలాయి చివరికి. అది స్వయంకృతాపరాధమే కనుక పార్టీలో ఎవరినీ నిందించవలసిన పనిలేదు.

 

ఇక నిత్యం కాంగ్రెస్, తెదేపాలను తిట్టిపోసే జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఆ పార్టీల అడుగుజాడలలోనే తన రాజకీయ జీవితం నిర్మించుకోబూనడం విచిత్రం. పార్టీ రాజకీయ కార్యక్రమాలకు తెదేపాను అనుసరించే జగన్, పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కాంగ్రెస్ విభజన రాజకీయాలను చక్కగా అనుసరిస్తున్నారు. కనీసం ఇప్పటికయినా తన పద్దతులు మార్చుకొని పార్టీలో సీనియర్స్ సలహా సంప్రదింపులు చేసి ఉంటే, నేడు తెదేపా చేపడుతున్న’ఇంటింటికీ తెదేపా’వంటి కార్యక్రమాలను గుడ్డిగా అనుసరించవలసిన దుస్థితి ఉండేది కాదు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu