జగన్ సర్కార్ కు మరో కొత్త తలనొప్పి.. వైవీ సుబ్బారెడ్డి పై మండిపడ్డ ఐవైఆర్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్య మతస్థులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తాజాగా చెప్పారు.

 

అయితే దీనికి సంబంధించి ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ "ఈ నిబంధన ఈనాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతున్న నిబంధన. విద్యార్థి దశలో తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు మాతోపాటు క్యూలో ఉన్న విదేశీయుడిని డిక్లరేషన్ సంతకం పెట్టిన తర్వాత దర్శనానికి అనుమతించారు". అంతేకాకుండా "సోనియా గాంధీ దర్శనానికి వచ్చినప్పుడు కూడా నాటి కార్యనిర్వహణాధికారి ఈ డిక్లరేషన్ కొరకు గట్టిగా పట్టుబట్టి కొందరు నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ఈనాడు ఉన్న ఫళంగా ఈ మార్పు తీసుకుని రావాల్సిన అవసరం ఏమి వచ్చిందో టీటీడీ అధ్యక్షులు సెలవిస్తే బాగుంటుంది" అని ఐవైఆర్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పై మండి పడ్డారు.

 

అంతేకాకుండా "రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదు. నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి కూడా నిర్వహించవచ్చు" అని ఐవైఆర్ కృష్ణారావు మరో కీలక వ్యాఖ్య చేసారు. ఇప్పటికే రాష్ట్రం లో నిత్యం హిందూ ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడులతో ఉక్కిరిబిక్కరి అవుతున్న జగన సర్కార్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజా నిర్ణయం మరో కొత్త తలనొప్పి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.