కల్కి ఆశ్రమంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు... రూ.500 కోట్ల అక్రమాస్తులు!!

 

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం వద్ద ఉన్న కల్కి ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వెల్లస్ కోర్సుల పేరుతో కల్కి ఆశ్రమంలో భారీగా విరాళాలు సేకరించినట్టుగా అధికారులు గుర్తించారు. తాత్విక,ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎరవేశారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ 43.9 కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.అందులో పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన యూఎస్ డాలర్లు,ఇరవై ఆరు కోట్ల విలువైన ఎనభై ఎనిమిది కిలోల బంగారం,ఐదు కోట్ల విలువైన వజ్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా, అమెరికా,యూఏఈ,సింగపూర్ లో నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు అధికారులు.

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం,చెన్నై, హైదరాబాద్,బెంగళూరులో నలభై ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి.ఆంధ్రా,తమిళనాడులో భారీగా భూములు కొన్నట్టుగా అధికారులు గుర్తించారు.నలభై చోట్ల ఇప్పటికే సోదాలు నిర్వహించినటువంటి ఐటీ బృందాలు పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటూ ఆశ్రమంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే పసిగట్టిన పరిస్థితి కనిపిస్తోంది.ఈ నేపథ్యం లోనే దాదాపుగా ఇన్కం ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి యాక్ట్ కి సంబంధించినటువంటి దాడులు కొనసాగుతున్నాయని నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటన ప్రకారమే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల మేర అక్రమంగానే ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు.పెద్ద ఎత్తున తాత్విక,ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీయుల్ని ఆకర్షించడం,పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడం, విరాళాలు సేకరించడం లాంటి పనులు చేశారని అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ విరాళాలను అక్రమ మార్గంలో ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్టుగా స్పష్టంగానే ఇప్పటికే ఐటి శాఖ బృందాలు తేల్చి చెప్పాయి.మరోవైపు నాలుగో రోజు సోదాల్లో ప్రధానంగా  రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్ విభాగాల్లో పెద్ద ఎత్తున విదేశాల్లో కూడా పెట్టుబడులు ఆశ్రమ నిధులు అక్కడ పెట్టినట్లుగా గుర్తించిన అధికారులు వీటి లెక్కలను బయట పెట్టనున్నట్లు తెలియజేశారు.ఏ రకంగా నిధులను తప్పుదోవ మళ్ళించారన్న దానిపైనా కల్కి ఆశ్రమ నిర్వాహకులను అధికారులు  ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.