లెబనాన్‌లోకి చొచ్చుకుపోయిన ఇజ్రాయెల్ సైన్యం

posted on: Mar 4, 2026 3:49PM

 

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్‌ సైన్యం దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకుపోయి దాడులను ఉధృతం చేసింది. సరిహద్దు ప్రాంతం నుంచి సుమారు 6 కిలోమీటర్ల లోపలికి దళాలు ముందుకు సాగినట్లు సమాచారం. నిరంతర షెల్లింగ్‌తో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ సైనిక చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.

దక్షిణ లెబనాన్‌లోని 80కిపైగా గ్రామాలు, పట్టణాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి కనీసం ఒక కిలోమీటరు దూరం వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో ఉన్న హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది. వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 52 మంది మరణించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఇక మరోవైపు హెజ్బొల్లా కూడా ప్రతిదాడులకు దిగింది. డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్‌కు చెందిన మూడు సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలతో పాటు లెబనాన్‌లోని తమ కేంద్రాలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

అయితే లెబనాన్ నుంచి వచ్చిన రెండు డ్రోన్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా అనుబంధ టీవీ, రేడియో కేంద్రాలు ధ్వంసమైనట్లు సమాచారం. పరిస్థితి రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...