మోడీ కోసం తవ్విన గోతిలో పడ్డ కాంగ్రెస్

 

 

ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రత్యర్ధి పార్టీల కోసం త్రవ్విన గోతులో తరచూ తానే పడుతూ నవ్వుల పాలవుతోంది. బీజేపీ నరేంద్ర మోడీని ఇంకా తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక ముందే అప్రమత్తమయిన కాంగ్రెస్ పార్టీ, దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగించుకొంటూ ఆయనని జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టనీయకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

 

గుజరాత్ లో 2004లో జరిగిన ఒక ఎన్కౌంటర్ లో ఇష్రాద్ జాన్ అనే 19ఏళ్ల యువతితో బాటు మరో ముగ్గురు ముస్లిం యువకులు కూడా మరణించారు. ఇది జరిగి దాదాపు 10సం.ల తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ కేసును తిరగదోడి, దానిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అది భూటకపు ఎన్కౌంటరని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తునందునే సీబీఐ విచారణకి ఆదేశించామని కాంగ్రెస్ చెపుతుంటే, ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నమరో గూడఛార సంస్థ ఇంటలిజన్స్ బ్యూరో మాత్రం ఎన్కౌంటర్ లో మరణించిన వారు నలుగురు మోడీని హత్య చేసేందుకు బయలుదేరిన తీవ్రవాదులే అని, అందులో మరణించిన ఇష్రాద్ జాన్ అనే యువతి మానవబాంబుగా శిక్షణ పొందిందని, ఆ విషయాన్ని అమెరికాలో పట్టుబడ్డ డేవిడ్ హీడ్లీ స్పష్టంగా పేర్కొన్నాడని గట్టిగా వాదిస్తోంది.

 

కానీ, కేంద్రం ఆదేశంతో రివ్వుమని ఎగురుకొంటూ గుజరాత్ లో వాలిపోయిన సీబీఐ చిలుకలు, చాలా లోతుగా పరిశోధించిన తరువాత అక్కడ జరిగింది ముమ్మాటికి భూటకపు ఎన్కౌంటరేనని, ఈ కుట్రలో గుజరాత్ పోలీసు అధికారులతో బాటు ఇంటలిజన్స్ బ్యూరో అధికారులకి కూడా భాగం ఉందని పేర్కొంటూ, ఇంటలిజన్స్ బ్యూరోకి చెందిన రాజిందర్ కుమార్ అనే సీనియర్ అధికారితో బాటు,అతని క్రింద పనిచేసిన యం.కె.సిన్హా, పీ.మిట్టల్, రాజీవ్ వాన్కడే, అనే మరో ముగ్గురు అధికారుల పేర్లను కూడా తన చార్జ్ షీటులో చేర్చడంతో, కాంగ్రెస్ పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.

 

ఆ రెండు వ్యవస్థలు తన ఆధీనంలోనే పనిచేస్తున్నపుడు వాటిలో దేనిని ఇప్పుడు వెనకేసుకు వచ్చినా కేసు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతే గాక, అది బీజేపీకి తనను తప్పు పట్టేందుకు మరో చక్కటి అవకాశం ఇస్తుంది. అలాగని, ఆ రెండు సంస్థలను దేనిపని దానిని చేసుకోనిస్తే రెండూ తమ తమ వాదనలు రుజువు చేసుకొనేందుకు కోర్టులను ఆశ్రయిస్తే పోయేది కాంగ్రెస్ పరువే. పైగా వాటిలో ఏదో ఒక సంస్థ పరిశోధనలో తప్పు జరిగినట్లు రుజువయినప్పుడు కాంగ్రెస్ దురాలోచనలు బయటపడక మానవు.

 

ఇంటలిజన్స్ బ్యూరో అధికారులు తమ పని కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉగ్రవాదుల ప్రణాలికల గురించి హెచ్చరికలు జారీ చేయడం వరకే తప్ప వాటిపై ఆయా ప్రభుత్వాలు ఏవిధంగా ప్రతిస్పందించాయి, ఏవిధమయిన చర్యలు తీసుకొన్నాయి వంటి విషయాలతో తమకు ఎటువంటి సంబంధం లేదు గనుక సీబీఐ తమను దోషులుగా చూపాలనుకోవడం చాలా పొరపాటని హోం శాఖకు మోర పెట్టుకొంటోంది.

 

మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని ఇంటలిజన్స్ బ్యూరోకి వ్యతిరేఖంగా చార్జ్ షీట్ దాఖలు చేయకుండా ఆపుతుందా? లేక మోడీని ఈ కేసులో బిగించేందుకు ఇంటలిజన్స్ బ్యూరో అధికారులను బలి తీసుకొంటుందా? అనేది త్వరలో తేలవచ్చును. అయితే, కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బ తీయాలనే దురాలోచనతో వేసిన ఈ ఎత్తుకి తానే చిత్తయిపోవడం విడ్డూరం. కాంగ్రెస్ పార్టీ తను తీసిన గోతిలో తనే పడి ఇప్పుడు బయటకి రాలేక విలవిలలాడుతోంది. కానీ ఈ రాజకీయ చదరంగంలో అసలు చనిపోయినవారు నలుగురు అమాయకులేనా? లేక నిజంగానే ఉగ్రవాదులా? జరిగింది నిజమయిన ఎన్కౌంటరా లేక గుజరాత్ పోలీసులే ఈ భూటకపు ఎన్కౌంటర్ కి తెగబడ్డారా? సీబీఐ చెపుతున్న మాటలను విశ్వసించాలా? లేక ఇంటలిజన్స్ బ్యూరో మాటలను విశ్వసించాలా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఎవరూ చెప్పలేరు. రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న ఈ చదరంగం ఎప్పుడయినా అటకెక్కవచ్చును.