ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?

posted on: Jan 6, 2022 3:54PM

ఉత్తరప్రదేశ్, పంజాబ్  సహ ఐదు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది.రాజకీయ పార్టీలు ప్రచార జోరు సాగుతోంది. మరో వైపు కరోనా కొత్త, పాత వేరియంట్ల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో ఏ రోజుకు ఆరోజు రికార్డు స్థాయిలో కొత్త  కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు ఎన్నికస సంఘం అధికారులు- ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్ రాష్ట్రాల్లోని కొవిడ్ పరిస్థితులను ఆయన వివరించారు. 

నిజానికి, ఇప్పటికే డిసెంబరు 27న ఒకసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కరోనా పరిస్థితులను  సీఈసీకి రాజేశ్ భూషణ్ వివరించారు.ఆ సమయంలో... ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని సీఈసీ ఆదేశించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంమవుతున్నాయి.   అయితే,  జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్  షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించడం కోవిడ్ పరిస్ధితిని మరింత తీవ్రం చేస్తుందని జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తే కరోనా మరింత ప్రబలే ప్రమాదం ఉందని ఎన్నికల సంఘానికి జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ వీకే పౌల్ తెలిపారు. దీంతో వీటి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆయన సూచించారు.

మరోవైపు ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోల నిర్వహణపై రాజకీయపార్టీలు తమంతట తామే నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. తద్వారా తాము జోక్యం చేసుకోకముందే స్వచ్చంధంగా వీటిని కట్టడి చేయాలని సలహా ఇచ్చింది. పరిస్దితి విషమించిన తర్వాత ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదని చెప్పకనే చెప్పింది. ఇప్పటికే యూపీ సహా ఇతర ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ ర్యాలీలు, రోడ్ షోలు రద్దు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా యూపీలో తమ ర్యాలీలు రద్దు చేసుకోవడంతో పాటు బీజేపీ ర్యాలీలు రద్దు చేయాలని ఈసీని కోరుతోంది. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లలో రాజకీయ పార్టీలు వాస్తవ పరిస్దితుల ఆధారంగా సన్నద్ధం కావాలని, వ్యాక్సిన్లు వేచించుకోవాలని కూడా ఈసీ ఇప్పటికే కోరింది. కానీ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ ఈ సమయంలో ఎన్నికల నిర్వహణపై ఆందోళనలకు కారణమవుతోంది. పరిస్ధితి మరింత ముదిరితే ఎన్నికలు వాయిదా వేయడం మినహా ఈసీ కూడా చేయలగిదిందేమీ లేదనే వాదన వినిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...