కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసినట్లేనా?
posted on Oct 16, 2025 3:01PM

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసిందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కు మరో మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డితో మేడారం జాతర పనుల వ్యవహారంలో తలెత్తిన విభేదాలు చినికిచినికి గాలివానగా మారిన చందంగా ముదిరిపాకాన పడ్డాయి. ఈ విషయంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఒకింత దూకుడుగా వ్యవహరించడం సమస్యను మరింత పెద్దది చేసింది. ఇక కొండా సురేఖ ఓఎస్డీ తీరు కూడా వివాదాస్పదంగా మారింది.
పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తొలగించింది. ఆయన వసూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. తుపాకి గురి పెట్టి మరీ మామూళ్ల కోసం బెదరించేవారన్న ఆరోపణలు, ఫిర్యాదులపై ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా కొండా సురేఖ అడ్డుకోవడమే కాకుండా తన నివాసంలో ఆశ్రయం ఇవ్వడం, ఆమె నివాసానికి వచ్చిన పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్వాదానికి దిగడమే కాకుండా, మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితి చేయిదాటిపోవడానికి కారణమైంది. ఇక ఆమె కేబినట్ పదవికి సీఎం ఉద్వాసన పలకడమో, లేక ఆమే రాజీనామా చేయడమో వినా మరో మార్గం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎంపై అపారమైన విశ్వాసం ఉందంటూ కొండా సురేఖ భర్త కొండా మురళి ఓ ప్రకటనలో పేర్కొని పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సీఎంపైన కొండా దంపతుల కుమార్తె చేసిన విమర్శలు అన్ని హద్దులనూ దాటేశాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి కొండా సురేఖకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తనను కలవాల్సిందిగా మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు ఫోన్ చేసి ఆదేశించినట్లు సమాచారం. ఈ భేటీ తరువాత కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమేంటనేది తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.