Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మౌనం.. అంగీకారమేనా! హరీష్ రావు ఏడ్చింది నిజమేనా?
posted on: Jun 4, 2021 4:25PM
గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పెద్ద బాంబే పేల్చారు. కేసీఆర్ తీరును ఎండగట్టిన రాజేందర్.. ప్రగతి భవన్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బానిసగా ఉండలేకే బయటికి వచ్చానన్నారు. కేసీఆర్ పై ఈటల చేసిన ఆరోపణల కంటే.. మంత్రి హరీష్ రావును ఈ వివాదంలోకి లాగడమే హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా హరీష్ రావును ఈటల రాజేందర్ ఇరికించారనే చర్చ జరుగుతోంది. గత ఐదేండ్లుగా తాను అవమానాలకు గురవుతున్నానని చెప్పిన ఈటల.. తానే కాదు హరీష్ రావు కూడా అవమానించబడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హరీష్ రావును కేసీఆర్ కుటుంబం వేధించిందని.. ఎన్నోసార్లు హరీష్ రావు తన ముందు ఏడ్చారని చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు సైలెంటుగా ఉన్నా.. అతని కుటుంబ సభ్యులకు జరిగిందంతా తెలుసన్నారు ఈటల రాజేందర్.
హరీష్ రావుపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రాజేస్తున్నాయి. జూన్ 4న హరీష్ రావు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజునే భలేగా ఇరికించారు రాజేందర్. ఇప్పుడు తనను ఉద్దేశించి రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈటలకు కౌంటర్ గా తెలంగాణ భవన్ లో మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు కూడా హరీష్ విషయంపై మాట్లాడలేదు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా... హరీష్ రావే స్పందిస్తారంటూ దాట వేశారు. ఈటల చేసిన అన్ని ఆరోపణలకు బదులిచ్చిన గులాబీ లీడర్లు.. హరీష్ రావు విషయంలో మాట్లాడేందుకు నిరాకరించడం మరింత అసక్తి రేపుతోంది.
ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించడం లేదు. తన పుట్టిన రోజు సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసంలో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటారు హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడినా.. ఈటల విషయం మాత్రం ఎత్తలేదు. దీంతో రాజేందర్ వ్యాఖ్యలపై హరీష్ రావు మౌనంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సహజంగా తమపై ఎవరైనా ఆరోపణలు చేస్తే రాజకీయ నేతలు వెంటనే రియాక్ట్ అవుతారు. చిన్నచిన్న విషయాలకు కూడా వెంటనే కౌంటరిస్తారు. కాని ఈటల రాజేందర్ తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా హరీష్ రావు మాట్లాడకపోవడం చర్చగా మారింది. మౌనంగా ఉన్నారంటే అర్ధాంగీకారమేనని కొందరు చెబుతున్నారు. ఈటల వ్యాఖ్యలను ఖండించలేదంటే.. వాటిని అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు. కేసీఆర్ కుటుంబం తనను అవమానించిందని హరీష్ రావు చెప్పకనే చెబుతున్నారని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న హరీష్ రావును కేసీఆర్ దూరం పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. హరీష్ రావు కొన్ని నెలల వరకు ప్రగతి భవన్ రాకపోవడం, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనపోవడం ఇందుకు బలాన్నిచ్చింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లోకి ఈటలతో హరీష్ రావును తీసుకోలేదు. దీంతో హరీష్ ను కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి. పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరిని హరీష్ తయారు చేశారనే అనుమానాలు గులాబీ బాస్ కు ఉన్నాయట. తనకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడంతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారని సదరు నేతకు సంబంధించిన నివేదికలు కేసీఆర్ దగ్గర ఉన్నాయంటున్నారు. అందుకే ఆ నేతను కేసీఆర్ దూరం పెడుతున్నారని కథనాలు వచ్చాయి. తర్వాత ఉద్యమ నేతలను దూరం పెట్టారని విమర్శలు పెరగడంతో అయిష్టంగానే మంత్రివర్గంలో చోటు కల్పించారని అంటున్నారు. మంత్రులుగా ఉన్నా... ఈ ఇద్దరు నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావును కేసీఆర్ కుటుంబం అవమానించిందంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించకపోతే.. రాజేందర్ చెప్పిందే నిజమని భావించక తప్పదు.
మరోవైపు ఈటలతో పాటు హరీష్ రావుపై రెండేండ్లుగా కేసీఆర్ నజర్ పెట్టారని అంటున్నారు. వాళ్లిద్దరిపై వేటు కోసం చూస్తున్న కేసీఆర్.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగియడం, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే యాక్షన్ మొదలు పెట్టారని అంటున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో ఏ ఎన్నికలు లేకపోవడంతో .. ఏం జరిగినా ఎన్నికల సమయానికి అంతా సర్ధుకుంటుందనే యోచనలో కేసీఆర్ ఉన్నారని భావిస్తున్నారు. ఈటల కథ ముగియడంతో తర్వాత టార్గెట్ హరీష్ రావే అనే చర్చ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.





