భారత్ పై ఇరాన్ వార్ ఎఫెక్ట్?
posted on: Mar 2, 2026 8:29AM

ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇండియాపై చూపే ప్రభావం ఏమిటి? ఎలాంటిది? ఈ యుద్ధం ఎఫెక్ట్ ఎంత మంది ఇండియన్స్ పై పడుతుంది. అసలీ యుద్ధం ద్వారా భారత్ కి వచ్చే కష్టనష్టాలేంటి? అంటే వార్ ఎఫెక్ట్ ఇండియాపై వివిధ రూపాల్లో ఉంటుంది. పైకి ప్రత్యక్షంగా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు కనిపించకపోయినా, ఇండయాపై ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఒక్క హార్మూజ్ జలసంధి మూసుకుపోవడం వల్లే.. భారత్ ఎంతో నష్టాన్ని చవి చూస్తుంది. మన చమురు దిగుమతి, సరకు ఎగుమతులు కూడా ఆలస్యం అంతుతాయి. దీని వల్ల భారీ నష్టాన్ని చవి చూడక తప్పదు. ఈ యుద్ధం వల్ల ఏర్పడే సందిగ్ధావస్థ కూడా మన ఆయిల్ ధరల హెచ్చు తగ్గులకు కారణమవుతుంది.
ఇక ఇరాన్ లో దాదాపు పది వేల మంది వరకూ ఇండియన్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్ధులు, వ్యాపారులు, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. మొత్తంగా మధ్య ప్రాచ్యంలో 90 లక్షల మంది భారతీయులున్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ వంటి దేశాల్లో కోటి మంది వరకూ ఇండియన్స్ ఉన్నారు. వీరిని తిరిగి స్వదేశానికి తీసుకురావడం భారత్ కి ఒక ఎవాక్యుయేషన్ ఛాలెంజ్ గా మారింది.
భారత్ ఇటీవల అంతర్జాతీయ ఆంక్షల కారణంగా.. మరీ ముఖ్యంగా యూఎస్ తో వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించేసింది. దీంతో భారత్ ఈ గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువ చమురు దిగుమతులు చేసుకుంటోంది. ఈ ఇంపోర్ట్స్ 80 శాతం. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 నుంచి 120 డాలర్లు దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఇండియాలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి. తద్వారా రవాణా చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు సుమారు వంద బిలియన్ డాలర్లకంటే ఎక్కువ మొత్తం భారత్ కి పంపుతారు. దీన్నె రెమిటెన్స్ అంటారు. ఈ యుద్ధం వల్ల వారి ఉపాధికి ఆటంకం ఏర్పడితే.. వారు పంపే డాలర్లు తగ్గుతాయి. ఆ రకంగా కూడా ఇండియాకు నష్టం వాటిల్లుతుంది. యుద్ధ వాతావరణం వల్ల షేర్ మార్కెట్లు దెబ్బ తింటాయి. దీంతో లక్షలాది మంది ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతారు. భారత్ అయితే ఇరాన్ లో కోట్లాది రూపాయలతో చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేస్తోంది. మధ్య ఆసియా దేశాలకు వెళ్లడానికి ఇది మనకు ఎంతో అవసరం. ఈ యుద్ధం వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయేలా ముప్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ఇక భారత్ నుంచి ఇరాన్‌కు వెళ్లే.. బాస్మతి బియ్యం, టీ పొడి, మందుల ఎగుమతులు నిలిచిపోతాయి. అలాగే బంగారం, వెండి ధరలు కూడా అమాంతం ఆకాశాన్ని అంటుతాయి. పెట్రోలు చెల్లింపులన్నీ డాలర్లలో జరుగుతాయి. పెట్రోలు ధరలు పెరిగినపుడు డాలర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇది రూపాయి మరింతగా పతనం కావడానికి దోహదపడుతుంది.






