స్పాట్ ఫిక్సింగ్ చేస్తున్న జెంటిల్ మెన్

 

మన దేశంలో క్రికెట్ ఆటని ఒక మతంగా భావించేవారు, దానిని వెర్రిగా ఆరాధించేవారు కోట్ల మంది ఉన్నారు. అక్కడ గ్రౌండు లో సచిన్ కాలుకి దెబ్బ తగిలితే ఇక్కడ బాధతో విలవిలాడిపోయే వారున్నారు. ధోనీ సిక్సర్ కొడితే కేరింతలు కొట్టేవాళ్ళున్నారు. అక్కడ మన టీం గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచుకొని ఆనందపడేవాళ్ళు, వాళ్ళక్కడ ఓడిపోతే, తమ జీవితంలో సర్వస్వం కోల్పోయామని ఇక్కడ ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. క్రికెట్ ఆటగాళ్ళంటే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవదూతలని భావించేవారు మన దేశంలో కోట్లమందున్నారు. వారి గెలుపుని దేశానికి గెలుపుగా, వారి ఓటమి యావత్ దేశ ఓటమిగా నేడు అభివర్ణించబడుతోందంటే క్రికెట్ ఆటకి మన దేశంలో ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అర్ధం అవుతోంది.

 

మరి ఆ క్రికెట్ ఆట ఆడే పెద్దమనుషులు కాస్తా, ఐపీయల్ మ్యాచుల పుణ్యామాని సంతలో పశువుల్లా అమ్ముడుపోతుంటే, తన అభిమాన దేవుళ్ళకి వేలం పాటల్లో పలుకుతున్న గొప్పరేటు చూసి ఆనందించాలో లేక ఆవిధంగా వారిని సంతలో పశువుల్లాగా నిలబెట్టి కొనుకొంటున్నందుకు (అమ్ముడుపోతున్నందుకు) బాధపడాలో అర్ధం కాని పరిస్థితి సగటు క్రికెట్ అభిమానిది. అయినప్పటికీ, ఏ ఒక్క అభిమాని కూడా తన మతం మార్చుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. ‘ఏవిధంగానయితేనేమి, క్రికెట్ ఆట కొనసాగుతోంది కదా! అంతే చాలు’ అని తనకు తానూ సర్దిచెప్పుకొంటూ ఏఏ టీములో తన అభిమాన దేవుళ్ళున్నారో అని భూతద్దం వేసుకొని మరీ వెతుకొని వారిని, వారి ఆటని చూసి పొంగిపోతున్నాడు.

 

వారు గ్రౌండులో వేసే బంతులు, కొట్టే షాట్స్, చేసే పరుగులను చూసి, ఆకాశంలో చందమామను తనదేననుకొని ఆనందపడే పసిపాపాయిలా, వారి ఆట కూడా అంతా తమకోసమే అని వెర్రి భ్రమలో ఇంత కాలం అభిమానులు ఆనందపడుతూ వచ్చారు. కానీ, వారు ఆడే ఆ ఆటని వారుకాక వెనుక నుండి మరెవరో ఆడిస్తున్నారని తెలిసినప్పుడు సగటు అభిమాని గుండె బ్రద్దలయి బాధతో విలవిలలాడాడు.

 

క్రికెట్ ఆటలో ప్రాధమిక సూత్రాల గురించి మాత్రమే ఎరిగున్న అభిమానులకి, వాటి వెనుకున్నఈ కొత్త స్పాట్ ఫిక్సింగ్ సూత్రాల గురించి మాత్రం బొత్తిగా అవగాహన లేకపోవడంతో, తమ ఆరాధ్య దేవుళ్ళే తమని మోసం చేస్తున్నారని వాపోతున్నారిప్పుడు. తమ క్రికెట్ దేవుళ్ళని ఫ్రాంచైసీలు కోట్లు పోసి వేలం పాటలో కొనుకొన్నతరువాత కూడా, ఇంకా చిల్లర డబ్బుల కోసం తెర వెనుక ఈ కక్కుర్తి ఫిక్సింగ్ భాగోతాలెందుకని వారి ప్రశ్న.

 

గ్రౌండులో ఆట సరిగా ఆడలేకపోతున్నా, ఒక వైపు టీవీ ప్రకటనలలో నటిస్తూ, మరో వైపు వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కోట్ల రూపాయలు పోగేసుకొంటూ, ప్రభుత్వోద్యోగాలు దక్కించుకొని, ఏనాడు కూడా ఆఫీసు మొహం చూడకపోయినా నెలనెలా టంచనుగా జీత భత్యాలు అందుకొంటూ, సగటు అభిమానికి అందనంత ఎత్తులో విలాసవంతమయిన జీవితాలు గడుపుతున్న ఈ క్రికెట్ దేవుళ్ళకి, ఇప్పుడు ఆట తప్ప మిగిలినవన్నీ బాగా అబ్బాయని అభిమానులు బాధపడుతున్నారు.

 

వారు ఆడరు. ఆడలేరు. అయినా తప్పుకొని కొత్త తరానికి అవకాశం ఈయరు అని తెలిసినప్పటికీ, గుడ్డిభక్తితో వారినే ఆరాధిస్తుంటే, ఇప్పుడు వారిలో కొందరు మరింత బరి తెగించి స్పాట్ ఫిక్సింగ్ లకి పాల్పడటం అభిమానుల గుండెలకు గాయం చేసింది.

 

గ్రౌండులో పొరపాట్లు జరుగకుండా ఆటను సక్రమంగా నిర్వహించవలసిన ఎంపైర్ (పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్) మొదలుకొని, ఆట ఆడే శ్రీశాంత్, అజయ్,అంకిత్ నుండి క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడయిన యన్.శ్రీనివాస్ అల్లుడు గురునాథ్ మెయిప్పన్ వరకు అందరూ కూడా ఈ ఫిక్సింగ్ భాగోతంలో పాత్రదారులే అని తెలిసిన తరువాత, ఇప్పుడు తమ కళ్ళ ముందు జరుగున్న ఆట నిజమయినదో లేక ముందే ఎవరో నిర్దేశించబడినట్లు ఆడబడుతోందో కూడా తెలీని పరిస్థితిలో ఆటను చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.

 

ఇది వారి అభిమానాన్ని వమ్ము చేయడమా? లేక సొమ్ము చేసుకోవడమా? క్రికెట్ ఆడుతున్న సదరు జెంటిల్ మెన్ మరియు వారిని ఆడిస్తున్న బీసీసీఐ తేల్చి చెప్పాల్సి ఉంది.