మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని అడ్డుకుంటున్నది అదృశ్య శక్తులా; చీకటి ఒప్పందాలా?

posted on: Jan 30, 2026 12:22PM

తెలుగువన్ వాస్తవ వేదిక పదో సంచికలో తెలుగువన్ ఎండి కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్  ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో నిందితుల నిగ్గు తేల్చడంలో జరుగుతున్న జాప్యంపై చర్చించారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నదని నిలదీశారు. దేశంలోనే అతి పెద్ద అవినీతి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించగా, ప్రజల ధనం, ఆరోగ్యంతో ఆటలాడిన ఈ కుంభకోణంలో నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవ్వడం కంటే దారుణం మరొకటి ఉండదని, అధిక ధరలకు చౌకబారు మద్యం అమ్మారనీ కంఠంనేని రవిశంకర్ అన్నారు.   దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల నగదు లావాదేవీలతో కూడిన భారీ స్కామ్ దర్యాప్తు జగన్ తాడేపల్లి ప్యాలెస్ గుమ్మం వద్దకు వెళ్లకుండా ఎందుకు ఆగిపోయిందని, ఎవరు ఆపుతున్నారనీ డోలేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ ను ప్రాథాన్యత ఇస్తుంటే, జగన్ హయాంలో ప్రభుత్వం మద్యం విక్రయాలను నగదు ద్వారా మాత్రమే జరపడం ద్వారా పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేత కూడా జరిగిందని ఆరోపించారు.

ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కేసును  సిట్ కేవలం మూడు వేల కోట్ల రూపాయల ముడుపులపై మాత్రమే దర్యాప్తు చేస్తున్నదన్న డోలేంద్ర ప్రసాద్ ఆ ముడుపుల సొమ్మును న్నికల ఖర్చులు, ఇతర అవసరాలకు తరలించారన్నారు. అన్నిటికీ మించి చౌకబారు మద్యాన్ని (ఛీప్ లిక్కర్) అధిక ధరలకు విక్రయించి ప్రజారోగ్యంపై విషం చిమ్మారనీ.. దీని వల్ల ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారనీ, మరెంతో మంది అనారోగ్యం పాలయ్యారనీ పేర్కొన్నారు. జగన్ హయాంలో నాణ్యత లేని మద్యాన్ని విక్రయించారన్న విషయాన్ని రఘురామకృష్ణం రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు అంతర్జాతీయ ల్యాబ్‌ టెస్ట్ ల ద్వారా ఆధారాలతో రుజువు చేశారని వివరించారు.  

మద్యం స్కామ్ గత ఎన్నికల్లో కూటమి విజయంలో  కీలక పాత్ర పోషించిందన్నారు. మద్యం కుంభకోణం కారణంగానే  జగన్ మోహన్ రెడ్డి  ఓట్ బ్యాంక్ అయిన పేద వర్గాల ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా కసితో ఓటేశారన్నారు. అటువంటిది ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం కేసులో సూత్రధారులను పట్టుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నదని నిలదీశారు.   ఇందుకు కారణం అదృశ్య శక్తులా,  రహస్య ఒప్పందాలా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.  

ఈ సంచిక వాస్తవ వేదిక పూర్తి పాఠాన్ని తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో ఈ లింక్ లో వీక్షించండి

google-ad-img
    Related Sigment News
    • Loading...