కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న టెక్నాలజీ

 

బాబు వయసు ఏడాదిన్నర పైనే చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని, వాడే వాడికిష్టమైన రైమ్స్, పవన్ కళ్యాణ్ పాటలు పెట్టుకుని వింటు మురిసిపోతున్నాడు. తల్లి ఆమెకిష్టమయిన సీరియల్ చూస్తున్నది, తండ్రి కంప్యూటర్ లో ఆఫీస్ పనే చేసుకుంటున్నాడో, లేక ఇంటర్నెట్ లో తనకిష్టమైన సమాచారం చూసుకుంటున్నాడో మనకి తెలియదు. పెద్ద పాప టీనేజ్ ఆమె తన రూమ్ లో కూర్చుని ఫ్రెండ్స్ తో టెక్స్ టింగ్ చేసుకుంటున్నది. ఇది ఏ దేశంలో ఇలా వుందో అనుకోనక్కరలేదు, ఎక్కడ చూసినా ఇలాగే వుంటుంది పరిస్థితి. దీని వల్ల ఇప్పుడు పుడుతున్న పిల్లలకు తల్లి తండ్రుల మాటలు ఎక్కువ వినే అవకాశం లేక అదీ కాక పిల్లల పనులు త్వరగా చేసి సెల్ ఫోన్లతో, టి.వీలతో, కంప్యూటర్లతో బిజీగా వుండడంతో మాటలు త్వరగా రావటం లేదంటున్నారు శాస్త్రజ్ఞులు ఈ మధ్యన కొంతమంది పసి పిల్లలను, వారి తల్లి తండ్రులను గమనించిన తర్వాత బయట పెట్టిన విషయాల్లో ఇదొకటి. 2014 సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.75 బిలియన్లకు పెరిగిపోవడంతోపాటు దాన్ని వాడుకునే వారి కాల్స్ డ్రాప్ అవుట్ అయినట్టే జనాలు సంభాషణల నుండి, సంబంధాలనుండి వారి జీవితాలనుండి కూడా నిష్క్రమించే, డ్రాప్ అవుట్ అయ్యే రోజు వస్తుందని శాస్త్రజ్ఞులు 50 ఏళ్ళ క్రింద అస్సలు వూహించలేదని అంటున్నారు. ముఖ్యంగా కుటుంబాల్లో వస్తున్న మార్పులు కుటుంబ సభ్యుల మధ్య మాటా మంతులు తగ్గి పోవడం, దాని వల్ల వారి సంబంధాల పై ప్రభావం పడ్తుంది. తల్లి తండ్రులు సరిగ్గా పిల్లలతో వారి సమయం గడపకపోవడంతో దాన్ని "Distracted parenting," కలతతో కూడిన పెంపకం అని అంటున్నారు. వారి దృష్టి వేరే వాటిపై వుండడంతో పిల్లల పై మనసు సరిగ్గా పెట్టలేకపోతున్నారని అంటున్నారు.


ఈ మధ్యన పిల్లలు అమ్మా, నాన్నల ప్రేమకి తపించిపోతున్నారని ఎందుకంటే ఎప్పుడు చూసినా వారు టెక్స్ టింగ్ లో, నెట్ లో ఎవరితోనో చాటింగ్ లోనో వుంటారు పిల్లలు అక్కడే వున్నారని కూడా మర్చిపోయి. ఈ మధ్యన ఈ విషయం పై రిసర్చ్ చేయగా దాదాపు 75% తల్లి తండ్రులు పిల్లలు కారులో వారితో పాటు ప్రయాణం చేస్తుండగానే టెక్స్ టింగ్ లు, సెల్ ఫోన్ లో మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ పిల్లల్ని అంతగా పట్టించుకోవటం లేదని, వారితో సంభాషించటం బాగా తగ్గిపోతుందని తేలింది. జర్నల్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ మీడియాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం, రెండేళ్ళ పిల్లలు, వారి కన్నా తక్కువ వయసు చిన్న పిల్లలు ప్రతి రోజు ఐదున్నర గంటల పైనే బ్యాక్ గ్రౌండ్ టీ.వి ప్రభావం వారి పై పడుతుందని ఎందుకంటే తల్లులు చూసే సీరియల్స్ పై దృష్టి వుండడంతో పిల్లలతో ఎక్కువగా మాట్లాడకపోవడం, దాంతో వారికి తల్లి ఆటలాడిస్తూ, కథలు చెబ్తూ, పాటలు పాడుతూ ఇంట్లో పనులు చేసుకోవడం, పిల్లల పనులు చేసే వారు కాబట్టి పిల్లలకు త్వరగా మాటలు వచ్చేవి. ఇప్పుడు టీ.వి చూస్తూ మాట్లాడినా కొన్ని పదాలు మాత్రమే వారు వినగలుగుతున్నారు, కొత్త పదాలు వినడానికి మళ్ళీ చాలా సమయం పడుతుంది.

 
దాంతో పిల్లలకి మాట్లాడాలి అన్న ఆలోచన ఇంతకు ముందులా త్వరగా రావడం లేదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఈ మధ్యన చాలా మంది మావాడు టీ.వి పెడతాడు, ఆఫ్, చేస్తాడు, అలాగే కంప్యూటర్ కూడా, సెల్ ఫోన్లల్లో వారు వీడియో గేమ్స ఆడతారని, కంప్యూటర్ లో గేమ్స్ ఆడతారని అదీ అతి చిన్న వయసులోనే అని మురిసిపోతుంటారు. కానీ అంత చిన్న వయసులోనే పిల్లలు వీడియో గేమ్స్, కంప్యూటర్లు ఆపరేట్ చేయడం, టీ.వి షోస్ చూడడం, వీటికే చిన్నతనంలో అలవాటు పడిపోవడం వల్ల బాల్యానికి దూరం అవుతారు, మాటలు త్వరగా రాకపోవడంతో వారి మానసిక ఎదుగుదల కూడా మెల్లిగా జరుగుతుంది. దీని వల్ల పిల్లలు బయటకు వెళ్ళటం, బయట ఆడుకునే ఆటలు తగ్గిపోతున్నాయి. దీని వల్ల శరీరానికి సరైన వ్యాయామం లేక వూబకాయం, విటమిన్ -డి తగ్గిపోవడం, మనకి కావాల్సినంత సూర్య కాంతి నుండి లభిస్తుంది ఈ విటమిన్. పిల్లలను వీటి నుండి కాపాడుకోక పోతే దక్షిణ కొరియాలో పిల్లలకి జరిగినట్టుగా జరుగుతుంది. అక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా వైర్ లెస్, ఇంటర్నెట్ కనెక్షన్ వున్న దేశంగా గొప్పగా చెప్పుకునే వారు. కానీ వాటి వల్ల వచ్చే నష్టాల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఎక్కడ చూసినా ప్రతి సందులో ఇంటర్నెట్ పార్లర్లు తయారయ్యాయి. దాదాపు 70% ఇంటర్నెట్ వాడేవారందరూ ఆన్ లైన్ గేమ్స్ ఆడతారని తేలింది. 


ఇంట్లో ఇంటర్నెట్ గేమ్స్ గంటలు గంటలు ఆడడం, తల్లి తండ్రులు ఇద్దరు పని చేయడం వల్ల, స్కూల్ నుండి రాగానే ఎవ్వరూ వుండక పోవడంతో ఇంట్లో కంప్యూటర్లు వున్న పిల్లలు వారికిష్టమొచ్చినంత సేపు గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే ఈ ఇంటర్నెట్ పార్లర్స్ కి వెళ్ళి అక్కడ ఆడుతూ కూర్చోవడం బాగా అలవాటయి పోయింది. ఇది చూస్తు చూస్తుండగానే తల్లి తండ్రుల చేయి దాటి పోయింది. ఈ వ్యసనాన్ని Internet Addiction Disorder(IAD) అంటారు. వారిని ఆడవద్దని చెప్పినా, ఇంటర్నెట్ తీసేయడానికి ప్రయత్నించినా వారికి విత్ డ్రా లక్షణాలు కనిపించేవి. మత్తుపదార్ధాలకి అలవాటు పడిన వారినుండి అవి తీసేసుకుంటే ఎలా తట్టుకోలేక నరాలు పీక్కుపోవడం, విపరీతమైన కోపం రావడం, నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్ కి లోను కావడం ఇలాంటివన్నీ ఈ ఇంటర్నెట్ గేమ్స్ ఆడే పిల్లలకి కూడా వస్తున్నాయి. ఇలాంటి పిల్లలను సైకియాట్రిస్ట్ లు, సైకాలజిస్ట్ లు, పిడియాట్రిషియన్స్, శాస్త్రజ్ఞులు ఎన్నో రిసెర్చ్ లు చేసి వీరికి కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు. కొరియా ప్రభుత్వం అన్ని ఖర్చులు భరించి ఈ వ్యసనం నుండి పిల్లల్ని బాగు చేయడం అనే బాధ్యతని తీసుకున్నది. వీరితో గేమ్స్ మాన్పించడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకోలేదు వీరు. పిల్లలు కోల్పోతున్న బాల్యాన్నీ, వీరు ఒక ఎలక్ట్రానిక్, డిజిటల్ ప్రపంచంలో బ్రతుకుతున్న వారిని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకువచ్చి, ప్రకృతితో అనుబంధం లాంటి విషయాలు కూడా ప్రాక్టికల్ గా నేర్పిస్తారు వారిని చెట్లల్లో తిప్పడం, సెలయేళ్ళల్లో ఈత కొట్టడం, పక్షులు, జంతువులు వీటన్నిటిని పరిచయం చేసి వారు చూసే బొమ్మల ప్రపంచం కంటే నిజమైన ప్రపంచం మరింత అందమైనదని నేర్పిస్తారు.


ప్రస్తుతం అమెరికాలో దాదాపు 9 మిలియన్ల ఇంటర్నెట్ గేమ్స్ కి అడిక్ట్ అయినవారున్నారు కానీ కొరియాలో వున్నట్టు రిహాబిలిటేషన్ సెంటర్లు ఇక్కడ చాలా తక్కువ. ఇది కేవలం కొరియా, అమెరికాలోనే వుందనుకుంటే పొరపాటు. చైనా, జపాన్, తైవాన్, కొరియాలో చాలా ఎక్కువగా వుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ IAD సమస్య వున్నదేశాలు చాలానే తేల్తాయి. ఈ సంవత్సరం, 2014లో మిలాన్, ఇటలీలో మొట్ట మొదటి ఇంటర్నెట్ కాంగ్రెస్ ఆన్ ఇంటర్నెట్ అడిక్షన్ డిసార్డర్స్ (Internet Congress on Internet Addiction Disorders) జరిగింది అంటే ఈ సమస్య ఎంతగా వ్యాపించిపోయిందో ఆలోచించండి. ఈ ఇంటర్నెట్ అడిక్షన్ డిసార్డర్ కేవలం పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా వుంది. ఇందులో రక రకాలున్నాయి. కొంతమంది పని చేయడానికే పుట్టాము అనుకునే వారు ముఖ్యంగా కంప్యూటర్ పై పనిచేసేవారు ఇంటికి కూడా ఆఫీసు పని తెచ్చుకుని చేస్తూనే వుంటారు. వారికి ఇంట్లో ఏం జరిగినా పెద్దగా పట్టించుకోరు, భార్యలే పిల్లల చదువులు, స్పోర్ట్స్, మ్యూజిక్ లాంటి యాక్టివిటీస్ తో పాటు ఇంటిపనులు, బయటి పనులు అన్ని చక్క పెట్టుకుంటారు. ఒకోసారి వీరికి చాలా విసుగొచ్చి ఇంట్లో పని చేయడం తగ్గించుకోమని అన్నా పెద్దగా పట్టించుకోరు ఈ వర్క్ హాలిక్స్. దీనితో భార్యా, భర్త మధ్య విబేధాలు, తండ్రికి పిల్లలకు మధ్య ఎటువంటి అనుబంధం పెరగకపోవడం వల్ల కుటుంబంలో కలతలు, కన్నీళ్ళు చోటుచేసుకొని ఒకోసారి ఈ బంధాలు తెగిపోయే ప్రమాదం కూడా వుంటుంది. పెద్దవారయినా చిన్న పిల్లల్లా గేమ్స్ కి వ్యసనపరులైతే మరికొంత మంది ఇంట్లో భార్య వుండగానే కంప్యూటర్లో ఇతర అమ్మాయిలతో చాట్ చేస్తూ వారితో డేటింగ్ లు చేయడం వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా చేస్తారు. కంప్యూటర్లు, లాప్ టాప్లు, టాబ్లెట్స్, సెల్ ఫోన్లు, టీ.విలు లాంటి మెషిన్లు - మాట్లాడ్తూ, ప్రేమాభిమానాలను అందించే మానవులకంటే మెషిన్లు ప్రాముఖ్యతని సంపాదించుకోవడం ఈ శతాబ్దపు దురదృష్టకరమైన విషయమని చెప్పవచ్చు. వీటివల్ల చాలా లాభాలు, ఎంతో అభివృద్దిని సంపాదించవచ్చు కానీ వీటి వాడకాన్నిఅదుపు చేసుకోకపోతే ఇలాగే వుంటుంది.


ఈ ఇంటర్నెట్ అడిక్షన్ డిసార్డర్ లక్షణాలు ఏమిటి, పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలకు అలవాటు పడిపోకుండా వుండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పిల్లలు రోజు ఒక అరగంట కన్నా ఎక్కువగా కూర్చొని రెండు గంటలకంటే ఎక్కువగా గేమ్స్ ఆడడం కానీ, ఫ్రెండ్స్ తో ఆన్ లైన్ చాట్ చేస్తూ కూర్చోవడం కానీ చేస్తున్నారా గమనించండి. సెల్ ఫోన్ లు ఎమర్జన్సీల్లో వాడకానికి పిల్లలకి ఇవ్వాలి, లేదా ఇద్దరు తల్లి తండ్రి ఉద్యోగాలు చేస్తుంటే పిల్లలు స్కూలు నుండి వచ్చారా, తిన్నారా, హోం వర్క్ చేస్తున్నారా లేదా అనే విషయాలు తెలుస్తాయనే ఈ సెల్ ఫోన్లని పిల్లలకి ఇవ్వడం మొదలు పెట్టారు కానీ అది ఎప్పటికీ వారిదగ్గరే వుండడంతో పాటలు వినడం, చూడడం, గేమ్స్ ఆడుకోవడ్ం, ప్రెండ్స్ కి టెక్స్ టింగ్ లు చేసుకోవడం, ఒకోసారి వారు చూడకూడనివి నెట్ లో పోర్నోగ్రఫి లాంటివి చూడడానికి అలవాటు పడితే అది మానుకోవడం చాలా కష్టమవుతుంది. మీరు పిల్లలని ఇవన్నీ తగ్గించుకోమని చెపితే వారికి వెంటనే కోపం రావడం, మీ మాటకు ఎదురు చెప్పి, లేదా లెక్క చేయకుండా వారి మానాన వారు ఆడుకుంటూ వుంటే వారికి ఈ జబ్బు లక్షణాలున్నాయని తెలుసుకొండి. మీరు ఏ దేశంలో వున్నారో అక్కడ ఇలాంటి వారికి రిహాబిలిటేషన్ సెంటర్స్ వున్నాయేమో కనుక్కోవాలి, లేదా పిడియాట్రిషియన్ని కానీ పిల్లల సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ని కానీ సంప్రదించాలి. ఇలాంటి వ్యసనాలకి అలవాటు పడేవారు చెప్పే మాట ఒక్కటే వారు ఒంటరితనంతో బాధ పడటం వల్ల ఎవ్వరూ తమతో సరిగ్గా మాట్లాడేవారు, వారిని అర్ధం చేసుకునేవారు లేరని అని బాధపడేవారు, స్కూల్స్ లో ఇతర పిల్లలు వీరిని ఏడ్పించడం, వారితో కలవనీయక పోవడం, కఠినమైన మాటలు అని వారి హృదయాలను గాయపరిచితే వారు కూడా అందరిలానే అన్నీ చేయడం మొదలు పెడతారు. పెద్దవారు మొగవారు పోర్నోగ్రఫీ వీడియోలు చూడటం, వేరే అమ్మాయిలతో సీక్రెట్ గా చాట్ చేయడం, గేమ్స్ ఆడటం చేస్తారు. వీరిలో కొంత మందికి ఇంట్లో వారితో, బయట వారితో సరియైన సంబంధాలు లేకపోవడం వారు చేసేపనిలో వారికి సంతృప్తి లభించకపోవడంతో ఈ ప్రపంచం నుండి దూరంగా పారిపోవడానికి ఈ డిజిటల్ ప్రపంచంలో కనిపించే, వినిపించే, సంతోషానిచ్చే వాటికోసం ఇంటర్నెట్ వ్యసనపరులవుతారు.


స్త్రీలు ఎక్కువగా ఆన్ లైన్ ఫ్రెండ్షిప్ కోసం, భర్తలు పట్టించుకోని భార్యలు ఎప్పుడు తప్పులు ఎత్తి చూపించే భర్తల్లా కాకుండా వారిని ఏమి పట్టించుకోకుండా ప్రేమించే భాయ్ ఫ్రెండ్స్ కోసం చాట్ చేస్తారు, మరి కొంత మంది ఆన్ లైన్ షాపింగ్ కి అలవాటు పడిపోయి రోజు ఏదో ఒకటి ఆర్డర్ చేయకపోతే వారికి తోచదు. ఈ ఇంటర్నెట్ వ్యసనానికి లోనయ్యేవారిలో కొంతమంది అంతకుముందునుండే వారు ఏదో ఒక వ్యసనపరులై వుంటారు, మాదకద్రవ్యాలకి, త్రాగటానికో, సిగరెట్లు త్రాగడమో, విపరీతమైన సెక్స్ కి అలవాటు పడిన వారుంటారు. వీరిలో మానసిక సమస్యలున్న వారు, డిప్రెషన్ తో బాధ పడేవారు వుంటారు. వీరికి ట్రీట్మెంట్ అంటే ఇతర వ్యసనాలకంటే బిన్నంగా ఇవ్వాల్సి వుంటుంది. వీరికి ఇంటర్నెట్ ని లిమిట్ గా వాడుకోవడం నేర్పించాలి, ఇంటర్నెట్ అంటే అంతా మంచే కాదు, చెడు వుంటుంది ఏది మంచి, ఏది చెడు అన్నది నేర్పడం, వారికున్న ఇతర సమస్యలకు కూడా వైద్యం చేయడం ద్వారా వీరిని ఈ వ్యసనం నుండి బయటకు తీసుకు రాగలరు. టెక్నాలజీతో మానవ అభివృద్దికి ఎన్నో రకాలుగా ఉపయోగాలుంటాయి. వాటిని అంత వరకే వాడుకుని నెట్ లో వుండే గేమ్స్ కానీ, సమాచారం తీసుకోవడం కానీ ఏదైనా లిమిట్ గా వాడుకుంటేనే బావుంటుంది. ఏదైనా వంటకం బావుంటే దాన్ని మనకి ఎంత కావాలో అంత తింటేనే మనకి, మన శరీరానికి మంచిది కానీ ఆశకు మించి తినేస్తే లేనిపోని అనారోగ్యాల పాలవుతారు.


-కనకదుర్గ