జగమంత యోగం

యోగా..ప్రపంచానికి భారతదేశం అందించిన వరం. మహర్షి పతంజలి అందించిన యోగ సూత్రాలు మానవజాతికి వరాలు. మహారణ్యాల్లోనో..హిమాలయాల్లోనో తపస్సు చేసుకుంటున్న రుషులు శరీర దారుడ్యం కోసం అనేక ఆసనాల్ని రూపొందించుకున్నారు. వాటిని సేకరించి..యోగాను పుస్తకరూపంలో అందించిన మహనీయుడు పతంజలి. ఆయన దృష్టిలో యోగా వ్యాయామం కాదు..ఆధ్యాత్మిక జీవనశైలిలో భాగం. పతంజలి అష్టాంగయోగంలోని..ఎనిమిది మెట్లూ మనోశక్తికి ఎనిమిది మార్గాలు. అలా అనాదిగా భారతీయుల జీవన విజ్ఞానంలో యోగా భాగమైంది.

 

అలాంటి యోగా ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. జలుబు నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగాతో చెక్‌ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అలాంటి యోగాకు మనదగ్గర ఆదరణ తగ్గుతుంది. కానీ యోగాలో మనకన్నా పాశ్చాత్యులు ముందున్నారు. హాట్ యోగా, కోల్డ్ యోగా, యోగా ప్లస్, యోగా లైట్..అలా యోగా వ్యాపారంగా మారిపోయింది. యోగాని ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియానే అంటే నమ్మని పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఉండేది. కానీ నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాకా యోగాకు గుర్తింపు తీసుకువచ్చారు.

 

ఆయన కృషి ఫలితంగా ప్రతి ఏడాది జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ రోజున ప్రపంచంలోని 192 దేశాలు భారత్‌కు యోగాభివాదం చేస్తాయి. ఇవాళ జూన్ 21 ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇస్లామిక్ దేశాలు సైతం ప్రపంచ యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుండటం విశేషం. భారత్‌లో ఈ పర్వదినానికి రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వం వహించనున్నారు. దేశవ్యాప్తంగా 57 పట్టణాల్లో కేంద్రమంత్రులు యోగా కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. రాష్ట్రపతి భవన్‌లో మొరార్జీ దేశాయ్‌ జాతీయ యోగా సంస్థ సహకారంతో నిర్వహించే సామూహిక యోగా ప్రదర్శనను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.

 

ఇక ఛండీగఢ్ వేదికగా ప్రధాని మోడీ యోగాసనాలు వేయనున్నారు. నగరంలోని క్యాపిటల్ కాంప్లెక్స్‌లో 30 వేల మందితో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. యోగాను మరింత ప్రోత్సహించేందుకు గానూ యోగాసనాల్లో ప్రతిభ చూపినవారికి బహుమతులు ఇవ్వాలని కేంద్రపాలిత ప్రాంత అధికార యంత్రాంగం నిర్ణయించింది. వారు యోగాసనాలు వేస్తున్న వీడియోను ఐవైడీసీహెచ్‌డీ 2016కు ఫేస్‌బుక్ గానీ ట్వీట్టర్ ద్వారా గానీ తమకు పంపాలని సూచించింది. అటు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి వినూత్నంగా స్వాగతం పలికింది. న్యూయార్క్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం గోడలపై వివిధ రకాల యోగాసనాలు వేస్తున్న మహిళ బొమ్మతో పాటు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే అక్షరాలను రంగురంగుల అక్షరాలతో ప్రదర్శించింది. సో ఇంకేందుకు ఆలస్యం బంచిక్ బంచిక్ చెయ్యి బాగా..ఒంటికి యోగా మంచిదేగా..అంటూ యోగా డే వేడుకల్లో మునిగిపోండి.