అంతర్జాతీయ నాటక దినోత్సవం

 

1.ఈ రోజు ఇంటర్నేషనల్ ధియేటర్ డే. ఇప్పటిలా సినిమాలు , వీడియో లు లేని  రోజుల్లో జనాలని తన ప్రతిభతో ఒక ఊపు ఊపేది ఈ నాటకం. రాజుల కాలక్షేపానికి, వినోదానికి ప్రదర్శించబడ్డ ఈ నాటకాలు కాలక్రమేణా ఎక్కడ జాతరలు జరిగినా లేదా  ఉత్సవాలు జరిగినా అక్కడ ప్రదర్శించబడటం ప్రారంభించారు.

 

2. మన దేశంలో సుమారు 1800 సంవత్సర కాలంలో ముఖానికి రంగులు వేసుకోవటం అనేది మొదలయ్యింది. 1800 కాలం ముందే ఈ రంగుల (కాస్మెటిక్స్) వాడకం ప్రజల్లోకి వచ్చినా, నాటకాలలో వాడడం మాత్రం ఇంగ్లీషు వారే మొదలు పెట్టారు. ముఖ్యంగా షేక్స్పియర్ నాటకాలతో రంగుల ప్రాభవం మరింత పెరిగింది. వివిధ రకాల పాత్రల్నీ ప్రస్ఫుటంగా స్టేజి మీద కనిపించేలా చేయడానికి ఈ రంగులు చాలా వరకూ దోహదం చేసేవి.

 

3. కాళిదాసు మహాకవిని నాటక పితామహుడిగా చెప్పుకోవచ్చు. అయితే ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ఆరంభంకాగా నాటక ప్రదర్శన మాత్రం 1880 లో ప్రారంభమయ్యింది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం" మంజరి మధుకరీయము" . దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి 1860 ప్రాంతాల్లో రచించాడు.

 

 

4. ఆధునిక నాటక రచనకు ఆద్యులు ఆయనైతే  ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుభొట్ల సుభ్రమణ్యశాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమకవి వడ్డాది సుబ్బరాయుడుగార్లు రూపకర్తలు. వీరేశలింగం సంభాషణ రూపాన 'బ్రాహ్మ వివాహము' అనే కామిక్ ని తన "హాస్య సంజీవని" అనే  మ్యాగజిన్లో రచించారు.ఆ తరువాత 'వ్యవహార ధర్మబోధిని' అనే నాటకాన్నిప్రచురించారు . ఇది వ్యావహారిక భాషలో రాయబడింది. వ్యావహారిక భాషలో మొత్తం రచన సాగించడం ఆ రోజుల్లో  ఒక సాహసం. పైగా ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకం కూడా ఇదే.  

 

5.ఆ తరువాతి కాలంలో అంటే 1880 లో వీరేశలింగం నాటక సమాజాన్ని స్థాపించి 'రత్నావళి', 'చమత్కార రత్నావళి' అనే  రెండు నాటకాలను ప్రదర్శించారు. తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత వీరేశలింగం గారిదే.

 

 

6.. అలాగే రామకృష్ణమాచార్యులు అనబడే ఆయన 30 నాటకాలు రచించారు. అన్నీ స్వతంత్ర రచనలే. ఈయన తన నాటకాలలో పాటలు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా పద్యాలను రాగయుక్తంగా పాడడం కూడా ప్రవేశపెట్టారు. ఈయన చేసిన 'సారంగధర' తెలుగులోని మొదటి స్వతంత్ర విషాద రూపకం. ఈయనకి ముందు తెలుగు నాటక రచనకు సుప్రసిద్ధమైన మార్గం లేదు. అందుకే వీరిని "ఆంధ్ర నాటక పితామహ" అని బిరుదునిచ్చి సత్కరించారు.

 


7. 1887లోప్రాచుర్యంలోకి వచ్చిన గురజాడ అప్పారావుగారి 'కన్యాశుల్కం' వ్యావహారిక భాషలో రచించబడ్డ అత్యుత్తమైన నాటకం. ఆ తరువాతి కాలంలో సురభి నాటకాల జోరు బాగా పెరిపోయింది. ఎక్కడ సురభి నాటకాలు ప్రదర్శిస్తే అక్కడికి జనాలు బండీలు కట్టించుకుని వచ్చి మరీ చూసేవారు. సినిమాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా రకరకాల సెట్టింగ్స్ వేసి ఈ నాటకాలు ప్రదర్శించేవారు. నాటకం ఏంతో మందిని బతికించి కడుపునిండా అన్నం పెట్టింది. అలాగే కొన్ని తరాలని రంజింప చేసింది . ఇప్పటికి దానినే నమ్ముకుని బ్రతికేవారు లేకపోలేదు.

 

8.అయితే కాలక్రమేణా సినిమాల ఆవిర్భావంతో నాటకాలకి తెరపడటం మొదలయింది. చాలా కాలం వరకు ఒక పక్క సినిమాలు విడుదలవుతున్నా నాటకాలకున్న క్రేజ్ అలానే ఉంటూ ఉండేది. రానురాను నాటకాల కన్నా సినిమా చూడటానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడడంతో  ఇక గెలవలేని నాటక ప్రపంచం చతికిలపడాల్సి వచ్చింది. టివీల జోరు పెరిగాక నాటక ప్రపంచం దాదాపు కనుమరుగు అయిపొయింది.


9. అయితే కొన్ని చోట్ల ధియేటర్ ఆర్ట్స్ పేరుతో ఇప్పటికి కూడా నాటక ప్రదర్సనలు జరుగుతూనే ఉన్నాయి. నాటకాల పట్ల ఆసక్తి ఉన్నవారు వెళ్లి చూస్తూనే ఉన్నారు.  నాటకం ప్రజల జీవితాన్ని ప్రతిబంబిస్తుంది , వారి ఆలోచనలని ప్రస్పుట పరుస్తుంది , వారిని ఉత్తేజ పరుస్తుంది . అందుకే నాటక కళ ని  సజీవం గా ఉంచుకోవలసిన అవసరం ఎంతో వుంది .

 

....కళ్యాణి