పదవుల పోట్లాట... అహమే అడ్డుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నేతలు!

 

మహబూబాబాద్ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సీనియర్ లీడర్ రెడ్యా నాయక్. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన నేత. ఇదే జిల్లాకు చెందిన మరో కీలక నేత మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి సత్యవతి రాథోడ్. ఇద్దరి నేతలు ప్రస్తుతం టిఆర్ఎస్ లో ఉన్నారు. ఒకే సామాజిక వర్గం ఒకే నియోజక వర్గం కావడంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఓ లెవల్ లో సాగుతుంది. ఎమ్మెల్యే కూతురు కవిత కూడా ఎంపీ. పైకి చూస్తే నియోజకవర్గంలో అంతా బాగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ఇగో ఫీలింగ్ అసలు సమస్యగా మారింది. రాజకీయాల్లో తన జూనియర్ తన చేతిలో ఎమ్మెల్యేగా ఓడిన నేత మంత్రి గావడం ఆ సీనియర్ ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదు. తనకు మంత్రి పదవి రాకపోవడం పట్ల సన్నిహితులు, పార్టీ సీనియర్ల దగ్గర తన ఆవేదన పంచుకున్నారు. కానీ తన జూనియర్ కు మంత్రి పదవి ఇవ్వడంపై మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇటీవల కార్తీక పౌర్ణమి రోజున జరిగిన సంఘటన ఇందుకు ఉదాహారణ.. డోర్నకల్ నియోజకవర్గంలో ఇలాంటి సీన్లు ఇప్పుడు కామన్ గా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే ఒకరికొకరు ఎదురుపడినా కనీసం పలకరించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఇటీవలే జిల్లాలో కురవి మండలం కందికొండలో జాతర జరిగింది. కందగిరి పర్వతంపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఆంగోతు బిందు కలిసి స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. ప్రియదర్శనం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆయన కూతురు కవిత , మంత్రికి ఎదురుపడ్డారు కానీ మంత్రిని కనీసం పలుకరించకపోవడం విమర్శలకూ దారితీసింది. అలయంలో ఇలా జరిగితే బైట కూడా అదే సీన్ రిపీటైంది. మంత్రి మీడియా సమావేశానికి ఎమ్మెల్యే, ఎంపీ డుమ్మాకొట్టారు. అదే ప్లేస్ లో ఆ తర్వాత ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశమైంది. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు మంత్రి పదవి దక్కక పోవడం, సత్యవతికి మంత్రి పదవి ఇవ్వడంతో రెడ్యా నాయక్ ముఖం చాటేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వర్గపోరుతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు.