ఇవ్వడంలో ఉన్న తృప్తి


అది మధ్యాహ్నం సమయం. ఓ పెద్దాయన ఏవో సరుకులు తీసుకుందామని సూపర్‌మార్కెట్‌లో తిరుగుతున్నాడు. అదే సమయంలో ఓ ఆరేళ్ల చిన్నపిల్లవాడు షాపు యజమానితో ఏదో బతిమాలుతూ కనిపించాడు. ఆ పిల్లవాడిలో కనిపించిన దైన్యం చూసి పెద్దాయనకి జాలి వేసింది. వెంటనే పిల్లవాడి దగ్గరకు వెళ్లి ‘ఏంటి విషయం?’ అంటూ అడిగాడు. ‘మా చెల్లికి ఈ బొమ్మంటే చాలా ఇష్టం. అందుకే తన పుట్టినరోజుకి ఈ బొమ్మని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ నా దగ్గర ఉన్న డబ్బులు అందుకు సరిపోవంటున్నారు,’ అన్నాడు పిల్లవాడు దీనంగా.‘ఓ మీ చెల్లిని నీతోపాటు తీసుకురాలేదా!’ అని అడిగాడు పెద్దాయన.

 

‘లేదు ఇప్పుడు మా చెల్లి మాతో పాటు ఉండటం లేదు,’ అంటూ ఒక్క నిమిషం ఆగాడు పిల్లవాడు. ఆ తరువాత బాధగా... ‘మా చెల్లి దేవుడి దగ్గరకు వెళ్లిపోయిందట. మా అమ్మ కూడా తొందరలో దేవుడి దగ్గరకు వెళ్లిపోతుందట. అందుకనే ఈ బొమ్మని మా అమ్మకి ఇచ్చి చెల్లి దగ్గరకి పంపుదామని అనుకుంటున్నాను,’ అన్నాడు పిల్లవాడు. ఒకపక్క పిల్లవాడు ఆ విషయాన్ని చెబుతుండగానే అతని చెక్కలి మీదగా కన్నీరు ధారకట్టింది.

 

పిల్లవాడి మాటలు విని పెద్దాయన మనసు బద్దలైపోయింది. ‘ఏదీ నీ దగ్గర ఉన్న డబ్బుని ఇలా ఇవ్వు. దాంతో బొమ్మ వస్తుందేమో ఇంకోసారి అడిగి చూద్దాము,’ అంటూ అతని చేతిలో డబ్బుని తీసుకున్నాడు పెద్దాయన. ఆ పిల్లవాడు చూడకుండా తన జేబులో ఉన్న నోట్లని అందులో కలిపి షాపు యజమానికి అందించాడు. ‘అరే ఇందాక సరిగ్గా చూసుకున్నట్లు లేదు. నీ దగ్గర ఉన్న డబ్బులు బొమ్మ కొనేందుకు సరిపోతాయట. పైగా ఇంకో పదిరూపాయలు కూడా మిగిలింది,’ అంటూ మిగిలిన చిల్లరను పిల్లవాడి చేతిలో పెట్టాడు పెద్దాయన.

 

ఆ బొమ్మనీ, చేతిలో ఉన్న పదిరూపాయలనీ తృప్తి చూసుకున్నాడు పిల్లవాడు. ‘మా అమ్మకి తెల్లగులాబీలంటే చాలా ఇష్టం. ఈ పదిరూపాయలతో ఆమెకి తెల్లగులాబీలు తీసుకువెళ్తాను. అదిగో ఆ వీధి చివరగా కనిపిస్తున్న ఇల్లే మాది. మీరు ఎప్పుడు కావాలనుకున్నా మా ఇంటికి రావచ్చు,’ అంటూ తుర్రుమన్నాడు.

 

పిల్లవాడు పరుగులుతీసిన వైపే పెద్దాయన చూస్తూ ఉండిపోయాడు. ఆయనకి హఠాత్తుగా మొన్న పేపర్లో చదివిన ఓ వార్త గుర్తుకువచ్చింది. ఒక తల్లీకూతురూ రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఓ లారీ వాళ్లని గుద్దేసిందనీ... కూతురు అక్కడికక్కడే చనిపోగా, తల్లి మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందనీ. ‘బహుశా తను చదివిన వార్త ఈ కుటుంబానిదేనేమో’ అనిపించింది పెద్దాయనకి. ఒక మనిషి నిర్లక్ష్యంతో మరో కుటుంబం ఎలా చిన్నాభిన్నమైపోతుందో కదా! అనిపించి ఆయన కళ్లు చెమర్చాయి.

 

మర్నాడు ఆ పెద్దాయని ఎందుకో ఆ ఇంటికి వెళ్లి చూడాలనిపించింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో, తడబడే అడుగులతో ఆ ఇంటిని చేరుకున్నాడు పెద్దాయన. ఆ ఇంటి ముందు గుమికూడిన జనాన్ని చూసి ఆయన మనసు కీడు శంకించింది. ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పెద్దాయనకు అక్కడ ఓ శవపేటిక కనిపించింది. అందులో ఒక అందమైన యువతి. ఆ యువతి చేతిలో ఓ తెల్లగులాబీ, పక్కనే నిన్న తాను కొనిపెట్టిన బొమ్మా కనిపించాయి. ఇంతలో నిన్న కనిపించిన పిల్లవాడు పరుగులెత్తుకుంటూ ఆ పెద్దాయన దగ్గరకి వచ్చాడు.

 

‘మా అమ్మ దేవుడి దగ్గరకు వెళ్లేలోపే ఆమెకి ఇష్టమైన తెల్లగులాబీలు ఇచ్చాను. దేవుడి దగ్గర చెల్లి కనిపిస్తే బొమ్మని ఇవ్వమని కూడా చెప్పాను. అమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్లిపొతుందంటే చాలా బాధగా ఉంది. కానీ పాపం చెల్లి నాకంటే చిన్నది కదా! అందుకని అమ్మ చెల్లి దగ్గర ఉండటమే కరెక్ట్‌,’ అని గబగబా చెబుతున్నాడు పిల్లవాడు.

 

పిల్లవాడి మాటలకి పెద్దాయన కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆ పిల్లవాడిది చావుని అర్థం చేసుకునే వయసు కాదు! కానీ ఇవ్వడంలో ఉన్న తృప్తిని మాత్రం తెలుసుకున్నాడు. పిల్లవాడి మనసు ఇక్కడితో ఆగిపోతే బాగుండు అనిపించింది పెద్దాయనకి.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.