ఒక్క గది కోసం!

 

తన తోటి కుర్రవాళ్లందరిలాగానే సమీర్ కూడా అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాడు. తన కలలను నిజం చేసుకునేందుకు ఎంతగానో శ్రమించాడు. రాయాల్సిన పరీక్షలన్నీ రాశాడు. చేసుకోవాల్సిన దరఖాస్తులన్నీ నింపాడు. చివరికి తను అనుకున్నది సాధించాడు. తన కలల ప్రపంచం అయిన అమెరికాలో అడుగుపెట్టాడు. ‘నా తండ్రి తన జీవితకాలమంతా కష్టపడి ఒక సింగిల్‌ బెడ్రూం ఫ్లాట్‌ను మాత్రమే సంపాదించగలిగాడు. మరి నేనో! ఇక మీదట ఏ లోటు రానంత సంపదను మిగుల్చుకుంటాను,’ అనుకున్నాడు.

 

సమీర్‌కు అమెరికాలో మంచి ఉద్యోగమే దొరికింది. కానీ అక్కడి వ్యయానికి జీతం బొటాబొటీగా సరిపోయేది. అయినా వీలైనంత పొదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఒకో డాలర్‌నీ దాచుకోవడం మొదలుపెట్టాడు. ఓ రెండేళ్లు గడిచాయి. మనసు మాటిమాటికీ మాతృదేశం మీదకి గాలిమళ్లేది. కానీ వెనక్కి వెళ్లిపోతే ఎలా? ఇప్పుడిప్పుడే తను ఉద్యోగంలో నిలదొక్కుకుంటున్నాడు. పైగా ఆర్థికపరిస్థితులు మున్ముందు ఉన్నంత సుముఖంగా లేవు. తనకీ ఒక తోడు దొరికితే ఇంత ఒంటరితనం ఉండదు కదా! అనుకున్నాడు. వెంటనే తల్లిందండ్రులకు కబురుపెట్టాడు. ‘నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకో మంచి సంబంధం వెతికి పెట్టండి’ అని. కొడుకు మాటలు విని తల్లిదండ్రులు సంబరపడ్డారు. తమ కొడుకుకి అంగరంగవైభవంగా పెళ్లిచేయాలని కలలు కన్నారు. వెంటనే అతని కోసం పెళ్లికూతురిని వెతకడం మొదలుపెట్టారు. చివరికి సమీర్‌కీ అతని తల్లిదండ్రులకీ నచ్చేలా ఓ సంబంధం దొరికింది.

 

‘పెళ్లి చకచకా జరిగిపోవాలి. నాకట్టే సెలవలు దొరకడం కష్టం! ఒక వారంలో తతంగం అంతా ముగిసిపోవాలి,’ అంటూ మరో సందేశం పంపాడు సమీర్‌. దాంతో పెళ్లి కారణంగా అయినా కొన్నాళ్లపాటు కొడుకు తమతో పాటుగా ఉంటాడని ఆశించిన తల్లిదండ్రులు భంగపడ్డారు. అయినా ‘పెళ్లయితే జరుగుతోందిగా, తన కొడుకు ఒక ఇంటివాడు అవుతున్నాడు కదా!’ అనుకుని మురిసిపోయారు. వాళ్లు అలా మురిసిపోతుండగానే కొడుకు ఇలా వచ్చి పెళ్లి చేసుకుని అలా వెళ్లిపోయాడు. అంతా ఓ కలలా జరిగిపోయింది.

 

సమీర్‌తో పాటుగా అమెరికాలో అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురుకి ఆ దేశం తెగ నచ్చేసింది. కానీ ఓ ఆర్నెళ్లు తిరిగేసరికి ఆమెకి కూడా పుట్టింటి మీదకి గాలి మళ్లింది. కానీ ఏం చేస్తుంది? రానూపోనూ ప్రయాణం ఖర్చులంటే మాటలా! అసలే ఒకరికిద్దరిని పోషించేందుకు సమీర్‌ జీతం సరిగ్గా సరిపోతోంది. భార్యలో రోజురోజుకీ పెరిగిపోతున్న దిగాలుని చూసి సమీర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ‘పిల్లల్ని కంటే అంతా సర్దుకుంటుంది,’ అంటూ ఎవరో సలహా ఇచ్చారు. ఆ మాట నిజమే కదా అనిపించింది సమీర్‌కి. వెంటనే వారు పిల్లల్ని కనేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఓ మూడేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లల్ని కన్నారు. పిల్లల్ని ఎలాగైనా తన దేశానికి తీసుకువెళ్లి తన తల్లిదండ్రులకు చూపిస్తే బాగుండు అనిపించింది సమీర్‌కి. కానీ ఏం చేస్తాడు! తనకా సెలవలు దొరకడం లేదు. పైగా పిల్లల రాకతో ఖర్చులూ పెరిగిపోయాయి. పోనీ భార్యనన్నా పంపిద్దామంటే, పెరిగిపోయిన సంసారానికి సాయపడేందుకు తను కూడా ఓ ఉద్యోగాన్ని వెతుక్కుందయ్యే!

 

కొన్నాళ్లకి సమీర్‌ తల్లిదండ్రులకి ఏదో ప్రమాదం జరిగిందన్న వార్త వచ్చింది. కానీ ఉన్నఫలంగా చేతిలోని పనిని వదిలి వెళ్లలేని పరిస్థితి. దాంతో తన భార్యాపిల్లలను ఇండియాకు పంపాడు. వాళ్లు కోలుకునే అవకాశం ఉంది కాబట్టి, తను నిదానంగా వెళ్లి పరామర్శించి రావచ్చు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు! ప్రమాదం జరిగిన మర్నాటికే అతని తల్లిదండ్రులు చనిపోయారు. సమీర్‌ పిల్లల్ని చూడకుండానే వాళ్లు కళ్లుమూశారు. చుట్టాలంతా కలిసి వాళ్ల అంత్యక్రియలను పూర్తిచేయాల్సి వచ్చింది. ఆ సంఘటన తరువాత సమీర్‌కు జీవితం మీదే విరక్తి పుట్టింది. ‘తల్లిదండ్రుల అంత్యక్రియలకు వెళ్లలేకపోతే ఎంత సాధించీ ఏం ఉపయోగం,’ అనుకున్నాడు. ఆ బాధలో ఆ ఆరునెలలు తెగ తాగాడు. సైకాలజిస్టుల దగ్గరకి వెళ్లి కౌన్సిలింగులూ గట్రా చేయించుకున్నాడు. తిరిగి ఉద్యోగ బాధ్యతలలో పడిపోయాడు!

 

సమీర్‌కి ఇప్పుడు యాభై ఏళ్ల వయసు వచ్చింది. పిల్లల చదువు కోసం తను సంపాదించినదంతా ఖర్చుపెట్టేశాడు. పైగా భార్యకి ఏదో మొండి జబ్బు రావడంతో మిగిలిన డబ్బులు ఆమె వైద్యానికి సరిపోయాయి. ఇప్పుడు పిల్లలు తన దగ్గర ఉండటం లేదు. భార్యా తనకి దక్కలేదు. ఇక ఇప్పటికైనా తన దేశానికి తిరిగివెళ్లిపోతే బాగుండు అనిపించింది సమీర్‌కి. ఇప్పుడు అతన్ని ఆపేందుకు ఉద్యోగం లేదు, సంసారమూ లేదు. చేతిలో కాసిన డబ్బులు మాత్రమే ఉన్నాయి. వాటితో ఇండియాలో ఓ మంచి ఇల్లు తీసుకుని స్థిరపడదామనుకున్నాడు. తీరా స్వదేశానికి చేరుకున్నాక తెలిసింది. తను పుట్టి పెరిగిన ఊళ్లో ఇంటి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని. దాంతో తను ఒకప్పుడు చవకగా అమ్మిపారేసిన నాన్నగారి సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌ గుర్తుకి వచ్చి మనస్సు చివుక్కుమంది. ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బుని లెక్కవేస్తే ఒక డబల్ బెడ్రూం ఫ్లాట్‌ వస్తుందని తేలింది. దాంతో అలాంటి ఫ్లాట్‌ ఒకటి తీసుకుని మిగిలిన కాసిన డబ్బులూ బ్యాంకులో వేసుకుని జీవితాన్ని నెట్టుకురాసాగాడు. ఆ ఫ్లాట్ గృహప్రవేశం చాలా నిరాడంబరంగా జరిగింది. పిల్లలు శుభాకాంక్షల సందేశాలు పంపి ఊరుకున్నారు.

 

గృహప్రవేశం జరిగిన రాత్రి సమీర్ పడుకుని ఉండగా ఒక్కసారిగా అతని జీవితం మొత్తం కళ్లముందు తిరిగింది. తన తండ్రి జీవితం, తన అమెరికా ప్రయాణం, అక్కడ తను నిలదొక్కునేందుకు పడిన కష్టం, పిల్లల చదువులు, భార్య మరణం అన్నీ గుర్తుకువచ్చాయి. ఇక్కడ ఉంటే తను జీవించలేకపోయేవాడా? పెళ్లి అయ్యేది కాదా? పిల్లల్ని పెంచలేకపోయేవాడా?... ఇన్నాళ్లు తన దేశానికీ, తల్లిదండ్రులకీ దూరంగా ఉండి అమెరికాలో ఉండి సాధించింది ఏమిటి? ఇంతాచేసి మరో బెడ్రూం ఎక్కువ ఉన్న ఫ్లాట్ తీసుకోవడమే తను సాధించిన విజయమా? అన్న ప్రశ్నలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎందుకనో అతని గుండెలో పోటు! మరి ఈసారి అతని పిల్లలు సమీర్‌ని చూసేందుకు వస్తారో లేదో!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.