ఎదిగిన మనిషి

 

అతను కోట్ల రూపాయల విలువ చేసే సంస్థకు అధిపతి. కానీ ఆ సంస్థను ఆయన తరువాత చేపట్టేందుకు పిల్లలు లేరు. అయినా ఆయన పెద్దగా బాధపడేవాడు కాదు. తన ఉద్యోగులలో సమర్థమైనవాడికే ఆ సంస్థ పగ్గాలు అందించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఆ రోజు రానేవచ్చింది. తనకు వారసుడిగా ఆ కంపెనీని ఎవరి చేతిలో ఉంచాలా అని నిశ్చయించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఒక పదిమంది ఉద్యోగులు హాజరయ్యారు.

 

‘‘సుదీర్ఘకాలంగా నా సంస్థలోని ఉద్యోగులందరినీ గమనించిన మీదట, వందలాది మంది ఉద్యోగులలలో మీరు అత్యంత సమర్థులు అని తేలింది. ఇక మీలో ఎవరో ఒకరికి నా కంపెనీ బాధ్యతలని అప్పచెప్పబోతున్నాను,’’ అన్నాడు యజమాని. యజమాని మాటలకి ఉద్యోగుల మనసులు సంతోషంతో గంతులు వేశాయి. కానీ ‘‘మీ అందరిలోకి ప్రతిభావంతుడు ఎవరా అని తేల్చేందుకు నేను ఒక పరీక్షను పెట్టాలనుకుంటున్నాను,’’ అని యజమాని చెప్పేసరికి అప్పటిదాకా సంతోషంతో ఎగిరిన వారి మనసులు కాస్తా బిక్కచచ్చిపోయాయి. ఈలోగా యజమాని తన ముందున్న ఒక పెట్టేలోంచి పది గింజలను బయటకు తీశాడు.

 

‘‘సంస్థ అనేది ఒక మొక్కలాంటిది. ఆ మొక్కను పెంచి పెద్దచేయాలంటే ఎంతో శ్రమ, మరెంతో పట్టుదల అవసరం. మీలో అలాంటి లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో తేల్చేందుకే ఈ పరీక్ష. నేను మీ అందరికీ తలా ఒక చిక్కుడు గింజను ఇస్తున్నాను. వాటిని మీరు ఒక రెండు నెలలపాటు పెంచి చూపించాలి,’’ అంటూ తలా ఓ గింజా చేతిలో ఉంచాడు.

 

ఆ గింజలను అందుకున్నవారంతా సంతోషంగా వాటిని ఇంటికి తీసుకువెళ్లారు. వాటికి రోజూ నీళ్లు పోయసాగారు. అసలు చిక్కుడు మొక్క అన్న పేరే విననివారు, దానిని ఎలా పెంచాలో తెలుసుకొనేందుకు ఇంటర్నెట్‌లో తెగ వెతకసాగారు. రోజూ తాము పెంచుతున్న చిక్కుడు మొక్క ఎంత అద్భుతంగా ఉందో ఎదుటివారితో గంటల తరబడి మాట్లాడటం మొదలుపెట్టారు.

 

ఇలా ఒక  రెండు నెలలు గడిచాయి. యజమాని ఇచ్చిన గడువు పూర్తయ్యింది. తలా ఒక కుండీని తీసుకుని యాజమాని ముందు చేరారు. ఒకొక్కరే తమ చేతిలోని కుండీని యజమానికి చూపుతూ సంబరపడిపోసాగారు. యజమాని చిరునవ్వుతో వాటిని చూస్తుండిపోయాడు. ఇంతలో ఒక ఉద్యోగి వెనకాలే ఉండిపోవడాన్ని యజమాని గుర్తించాడు.
‘‘అదేంటి నీ చేతిలో ఉన్న కుండీని చూపించకుండా అలా ఉండిపోయావేంటి?’’ అని అడిగాడు యజమాని. దానికి సదరు ఉద్యోగి వణికిపోతూ ముందుకువచ్చాడు. అతని చేతిలోని కుండీని చూసి ఉద్యోగులంతా ఒక్కసారి గొల్లున నవ్వారు. కారణం! అందులో అసలు మొక్కే లేదు.

 

‘‘సర్! క్షమించండి. మీరు ఇచ్చిన గింజని నేను చాలా శ్రద్ధగానే నాటాను. దానికి తగినంత మట్టి ఉండేలా చూసుకున్నాను. రోజూ నీళ్లు కూడా పోశాను. కానీ ఎందుకనో ఇన్నాళ్లు గడిచినా అది మొలక వేయనే లేదు. మీరు పెట్టిన పరీక్షలో నేను పరాజయం పొందాను,’’ అన్నాడు ఆ ఉద్యోగి సిగ్గుపడుతూ.

 

ఉద్యోగి చెప్పిన మాటలు విన్న యజమాని ఒక్క పెట్టున నవ్వాడు. ‘‘అదేం కాదు! పరీక్షలో నువ్వొక్కడివే నెగ్గావు. నిజానికి నేను మీ అందరికీ కాల్చి, ఉప్పునీటిలో ఉడకబెట్టిన గింజలను ఇచ్చాను. అవి మొక్కలుగా మారే సమస్యే లేదు. కానీ మీరంతా ఎలాగొలా పరీక్షని నెగ్గితీరాలన్న పంతంతో ఏపుగా పెరిగిన మరో మొక్కని తీసుకువచ్చి నాకు చూపించారు. మనిషి ఎదగాలంటే శ్రమ, పట్టుదల ఎంత అవసరమో నిజాయితీ కూడా అంతే అవసరం. అవి అతనిలో మాత్రమే ఉన్నాయి,’’ అని తేల్చాడు.

 

ఈ కథని మనం చాలాసార్లు చదివే ఉంటాము. కాకపోతే పాత్రలు మారి ఉండవచ్చు. పరీక్ష వేరుగా ఉండి ఉండవచ్చు. కానీ ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఒప్పుకోగలిగేవాడు విజయం సాధిస్తాడన్న నీతి మాత్రం మారదు. విజయం సాధించినా సాధించకపోయినా నిజాయితీ ఉన్నవాడు ఇతరులకంటే ఒక మెట్టు పైనే నిలబడగలడన్న సూత్రమూ మారదు.

 

- నిర్జర.