సుఖమా! సంతోషమా!

అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు. 


ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన సమయం ఎలా గడవబోతోందో తెగ ఊహించుకోసాగాడు ఉద్యోగి. అతని ఊహలతో పని లేకుండా ఆ రోజు రానే వచ్చింది. తనకున్న వాటిలో బాగున్న దుస్తులను వేసుకుని, తలని ఒకటికి పదిసార్లు దువ్వుకుని రాజభవనానికి బయల్దేరాడు ఉద్యోగి. ఉద్యోగి రాక గురించి వినగానే యువరాజుగారు నేరుగా అతణ్ని తన మందిరానికి పంపించమన్నారు. యువరాజుగారు పట్టుపరుపు మీద పడుకునో, అలంకరించుకుంటూనో ఉంటారనుకుంటూ బెరుకుగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఉద్యోగికి ఆయన కిటికీ దగ్గర నిల్చొని కనిపించారు.


‘యువరాజా! నేను మీ సంతకాల కోసం వచ్చాను’ అని ఉద్యోగి ఒకటికి రెండుసార్లు చెప్పినా యువరాజుగారు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఉద్యోగి ఆయనకు దగ్గరగా వెళ్లి చూస్తే ఏముంది… యువరాజుగారు తీక్షణంగా ఆ పళ్లు అమ్ముకునేవాడినే చూస్తున్నారు. ‘యువరాజా! అతనేమన్నా అపచారం చేశాడా? అంత తీక్షణంగా చూస్తున్నారు?’ అంటూ కాస్త చొరవగా అడిగాడు ఉద్యోగి. 


‘అపచారమా పాడా! అతణ్ని చూసినప్పుడల్లా నాకు మహా అసూయగా ఉంటుంది. హాయిగా ఏ రోజుకారోజు కాయకష్టం చేసకుంటూ, వచ్చినదానితో తృప్తిగా బతుకుతూ, భవిష్యత్తు గురించి ఎలాంటి బాధా లేకుండా ఉండే అతని జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! కావాలంటే దుకాణాన్ని తీసి ఉంచుతాడు, లేకపోతే మధ్యలోనే కట్టేసి తన భార్యాపిల్లలతో కలిసి షికారుకి వెళ్లిపోతాడు. అంత స్వేచ్ఛగా, సాదాసీదాగా జీవించడంలో ఉన్న ఆనందం బందిఖానాలాంటి ఈ రాజభవనంలో ఎక్కడ ఉంటుంది,’ అంటూ నిట్టూర్చారు యువరాజులవారు.


యువరాజులవారి మాటలు విన్న ఉద్యోగికి ఏదో కొత్త విషయం బోధపడింది. సుఖానికీ, సంతోషానికీ ఉన్న వ్యత్యాసం తెలిసి వచ్చింది. మరి అదే విషయం దుకాణదారుడుకి ఎప్పుడు తెలిసివస్తుందో!