నారాయణ మూర్తి మళ్ళీ వచ్చారు

 

 

Infosys appoints Narayana Murthy as Executive Chairman, Infosys Narayana Murthy

 

 

ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా మరోసారి నారాయణ మూర్తి నియామకమయ్యారు. ఎగ్జిక్యూటీవ్ బోర్డులోని సభ్యులు ఆయన్ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. నారాయణ మూర్తి ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన కె.వి.కామత్ (65 ) తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.

 

2011లో ఇన్పోసిస్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు బాధ్యతల నుంచి నారాయణ మూర్తి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక నారాయణమూర్తి ఈ పదవీ కాలంలో కేవలం ఏడాదికి ఒక్క రూపాయి జీతంతోనే పనిచేస్తారు. జూన్ 1వ తేదీ నుంచి  నారాయణమూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది.1981లో ఇన్ఫోసిస్‌ ను నారాయణమూర్తి ప్రారంభించారు. 1981నుంచి 2002 వరకు ఆయన సిఇఒగా పనిచేశారు.



తిరిగి తనను బోర్డులకు ఆహ్వానించడంపై నారాయణ మూర్తి స్పందించారు. ఇది అకస్మాత్తుగా, అనూహ్యంగా, అసాధారణంగా జరిగిందని అన్నారు. ఇన్ఫోసిస్ తన మిడిల్ చైల్డ్ అని, దాంతో మిగతా ప్రణాళికలను పక్కన పెట్టి తాను బాధ్యతలను అంగీకరించానని ఆయన అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు చైర్మన్ కెవి కామత్‌కు బోర్డుకు, ప్రతి ఇన్ఫోసిసియన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. సవాల్‌తో కూడిన ప్రస్తుత తరుణంలో కంపెనీకి విలువ చేకూర్చే  విధంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.