పుట్టిన ఏడాదిని బట్టి ఫ్లూ జ్వరాలు

 

ఇంకొన్నాళ్ల తరువాత ఫ్లూ జ్వరంతో బాధపడుతూ డాక్టర్‌ దగ్గరకి వెళ్తే.... ‘మీరు పుట్టిన సంవత్సరం చెప్పండి. త్వరగా నయం అవుతుందో లేదో చెబుతాను,’ అనే రోజులు వస్తాయేమో. ఎందుకంటే మనం పుట్టిన సంవత్సరానికీ, ఫ్లూ జ్వరాలకీ మధ్య అవినాభావ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు.

 

టైప్‌1, టైప్ 2...

సాధారణంగా ఫ్లూ జ్వరాలు ఒకరికో ఇద్దరికో వచ్చి ఊరుకోవు. ఇవి ఓ ఉపద్రవంలా ప్రపంచాన్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఫ్లూని కలిగించే వైరస్‌ని బట్టి అందులో చాలా రకాలే ఉన్నాయి. కాకపోతే వాటన్నింటినీ రెండు రకాలుగా విభజించి టైప్ 1, టైప్ 2 ఇన్‌ఫ్లూయెంజాగా (ఫ్లూ) పేర్కొంటున్నారు. ఈ విభజన ఆధారంగా అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, 1918 నుంచి ఏ ఏడాది ఎలాంటి ఫ్లూ జ్వరాలు వ్యాపించాయో గమనించారు.

 

వందేళ్ల గణాంకాలు

1918 నుంచి 1968 వరకు టైప్ 1 ఫ్లూతో ప్రజలు బాధపడినట్లు తేలింది. ఇక 1968 నుంచి 1979 వరకూ టైప్ 2 ఫ్లూ జనాల మీద దాడి చేసింది. ఆ తరువాత నుంచి విడతల వారీగా ఫ్లూలోని రెండు రకాలూ ప్రపంచాన్ని పీడిస్తున్నాయి. ఒక సంవత్సరం టైప్‌ 1ది ఆధిక్యంగా ఉంటే మరుసటి ఏడు టైప్‌ 2ది పై చేయి అవుతోంది. ఇలా ఏ ఏడాది ఎలాంటి ఫ్లూ వైరస్ ప్రబలిందో అంచనా వేశారు పరిశోధకులు.

 

తవ్వుకుంటే లాభం!

చిన్నప్పుడు ఎవరికన్నా ఫ్లూ జ్వరం వచ్చి తగ్గిపోయిందనుకోండీ! వారిలో సదరు వైరస్‌ని ఎదుర్కొనేందుకు తగిన రక్షణవ్యవస్థ ఏర్పడి ఉంటుంది. ఉదాహరణకు టైప్ 1 ఫ్లూ బారిని పడి కోలుకున్నవారు, తరువాతకాలంలో అలాంటి వైరస్ తమ మీద దాడి చేసినా ఎదుర్కోగలుగుతారు. సాధారణంగా పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు ఫ్లూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1975 వరకు మనం పుట్టిన ఏడాదిని బట్టి ఏ తరహా ఫ్లూతో బాధపడి ఉంటామో వైద్యులు అంచనా వేయగలుగుతారు. ఇక 1979 తరువాత నుంచి ఏ ఏడాది అయితే మనకి ఫ్లూ జ్వరం వచ్చిందో ఆ సంవత్సరం ప్రబలంగా ఉన్న వైరస్‌ మనకి సోకి ఉంటుందని అంచనా వేస్తారు.

 

అంచనాలతో ఉపయోగం ఏంటి?

ఒకసారి ఏదన్నా ఫ్లూ వచ్చినవారికి అదే తరహా ఫ్లూ వస్తే వారు కోలుకునే అవకాశం 75 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక సదరు ఫ్లూ కారణంగా మరణం సంభవించే అవకాశం ఏకంగా 80 శాతం తక్కువగా ఉంటుంది. అది కాకుండా వేరే ఫ్లూ వైరస్ కనుక రోగి మీద దాడి చేస్తే అతనికి మరింత జాగ్రత్తగా వైద్యం అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులలో రోగనిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఫ్లూ కూడా ప్రాణాంతకంగా మారిపోతుంది. అలాగే ఈమధ్యకాలం తరచూ బర్డ్‌ ఫ్లూ వ్యాధులు ప్రబలడం చూస్తున్నాం. ఈ బర్డ్‌ ఫ్లూ వ్యాధిని కలిగించే వైరస్‌లు కూడా సాధారణ ఫ్లూ వైరస్‌కు దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకు H5N1 వైరస్ టైప్‌ 1 ఫ్లూకి దగ్గరగా ఉంటే... H7N9 తరహా బర్డ్‌ ఫ్లూ, టైప్‌ 2కి దగ్గరగా ఉంటుంది. ఇలా బర్డ్‌ ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలినప్పుడు కూడా ఎవరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చికిత్స విషయంలో అశ్రద్ధ చేయకూడదు అన్న విషయాలు తమ పుట్టినసంవత్సరం ఆధారంగానో, ఫ్లూ వచ్చిన ఏడాదిని బట్టో నిర్ణయించవచ్చు.

 

- నిర్జర.