మరణ మృదంగం..

పసికూనల బోసినవ్వులు విరబూయాల్సిన చోట మరణ మృదంగం మోగుతోంది..పురిటి నొప్పుల బాధను ఇంకా మరచిపోని ఆ తల్లులకు తీరని వ్యధే మిగులుతోంది. భారత్‌లో శిశు మరణాల రేటు ఆందోళన కలిగిస్తోందని..ప్రతి రోజు కొన్ని వేల మంది చిన్నారులు మరణిస్తున్నారు. ఈ విషయం ఎవరో చెబుతోంది కాదు..సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి.. భారత్ సహా పలు వర్థమాన దేశాల్లో నిర్వహించిన సర్వే ఈ నిజాలను బట్టబయలు చేస్తోంది.

 

భారత్‌లో పుట్టిన వెయ్యిమంది పసికందుల్లో 60 మంది ఏడాదిలోపు చనిపోతుంటే, మిగిలిన వారిలో సగం పోషకాహార లోపంతో మృత్యువాత పడుతున్నారు. అలా..ఏటా 1.45 మిలియన్ల మంది పిల్లలు పుట్టిన రెండు మూడు సంవత్సరాలకే తనువు చాలిస్తున్నారని ఐరాస తెలిపింది. పేద పిల్లల సంక్షేమంపై దృష్టిపెట్టకపోతే ప్రపంచ వ్యాప్తంగా 2016-2030 మధ్య 6.9 కోట్ల శిశు మరణాలు సంభవిస్తాయని..అందులో సగానికి పైగా భారత్, నైజీరియా, పాకిస్థాన్, కాంగో, అంగోలాల్లోనే చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఒక్క భారత్‌లోనే ఇందులో 17 శాతం మరణాలు సంభవిస్తున్నాయని హెచ్చరించింది.

 

ప్రపంచ వ్యాప్తంగా "బాలల స్థితి వార్షిక నివేదిక"ను ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ "యూనిసెఫ్" విడుదల చేసింది. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 1990తో పోలిస్తే సగానికిపైగా తగ్గినట్లు యూనిసెఫ్ తెలిపింది. 129 దేశాల్లో బాల, బాలికలు సమాన సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలకు హాజరవుతున్నట్టు పేర్కొంది. పేదరికంలో మగ్గుతున్న చిన్నారుల శాతం సగానికి తగ్గినట్టు వెల్లడించింది. ధనిక వర్గాలతో పోలిస్తే..పేద పిల్లలు ఐదేళ్లలోపు మృత్యువాతపడటం, తీవ్ర పోషకాహార లోపాల బారినపడటం వంటి ముప్పు రెట్టింపు అయినట్లు తెలిపింది. పేద పిల్లల సంక్షేమంపై ప్రభుత్వాలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు దృష్టిపెట్టాలని పిలుపునిచ్చింది.

 

భారత్‌లో శిశుమరణాల రేటును తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ఏటా కోట్లు కేటాయిస్తున్నా, నిధులను సరిగా ఖర్చు చేయడంలో రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పునురుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద కేటాయిస్తున్న నిధుల్లో సింహభాగం సిబ్బంది జీతభత్యాలకు ఖర్చు చేస్తున్నారే తప్ప చిన్నారుల ఆరోగ్యం మెరుగుకు ప్రణాళికలేవీ రూపొందించడం లేదు. అయితే శిశు మరణాలపై ప్రజాసంఘాల వాదన మరోలా ఉంది. చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అవి ఆరోపిస్తున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేకపోవడంతో శిశుమరణాలు పెరిగిపోతున్నాయి.

 

వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం నిద్రపోతుండటంతో తల్లులకు కడుపు కోతే మిగులుతోంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో నిలోఫర్ ఆసుపత్రితో పాటు జీజీహెచ్, కేజీహెచ్ తదితర ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించకుంటే పురిటి నొప్పులతో విలవిల్లాడుతూ మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన తల్లిని మృతశిశువు వెక్కిరిస్తూనే ఉంటుంది.