రాజకీయ పార్టీలకి ఇది దీక్షా సమయం

 

మరో ఏడెనిమిది నెలలలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉన్నందున, రాజకీయ పార్టీలు, నేతలు ఈ సమైక్యరేసులోతమ రాజకీయ శత్రువుల కంటే ముందుండాలనే ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతూ, పైకి మాత్రం ప్రజాభీష్టం మేరకే రాజీనామాలు చేసి ఉద్యమాలలో పాల్గొంటున్నామని, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే దీక్షలు చేస్తున్నామని చెప్పుకొంటున్నారు. ఒకప్పుడు ఒక గొప్ప లక్ష్యం సాధించేందుకు బ్రహ్మాస్త్రంలా వాడబడిన ఆమరణ నిరాహారదీక్షలు, నేడు మన రాజకీయపార్టీల పుణ్యామాని వాటి విలువ కోల్పోయాయి. షుగర్, బీపీ వంటి అనారోగ్య సమస్యలున్న నేతలు సైతం ఏదో ఒక డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్షలకి కూర్చోవడం వారిని చూసి వారి రాజకీయ శత్రువులు కూడా దీక్షలకి కూర్చోవడం నేడు సర్వసాధారణ విషయమయిపోయింది. నాలుగయిదు రోజుల తరువాత, ఎటూ పోలీసులు తమ దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలిస్తారనే ధీమా ఉన్నందున నేతలు ధైర్యంగా ఈ ‘ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్షలకు’ కూర్చోనగలుగుతున్నారు.

 

నిన్న మొన్నటి వరకు ఒక మంత్రి గారి భార్యామణి చేసిన ఈ ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్ష షరా మామూలుగానే ముగిసిపోయింది. కొద్ది నెలల క్రితం కరెంటు చార్జీలు తగ్గించాలంటూ ఐదురోజులు నిరాహార దీక్ష చేసిన వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మళ్ళీ సమైక్యాంధ్ర కోరుతూ నేటి నుండి గుంటూరులోఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు.

 

ఇక, ఆమెకు పోటీగా తెదేపా  శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ తదితరులు కూడా సోమవారం నుండి గుంటూరులో నిరవధిక దీక్ష చేపట్టనున్నారు.తెదేపా నేత దేవినేని ఉమ కూడా త్వరలో విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షల పోటీలో పాల్గొనున్నట్లు సమాచారం. అయితే, ఇటువంటి ఎత్తుగడలతో రాజకీయ చైతన్యవంతులయిన ప్రజలను ఆకట్టుకోవచ్చునని, వారిని భ్రమింప జేయవచ్చునని రాజకీయపార్టీలు భావించడం అవివేకమే.