యువతకి ఆదర్శం... ఈ రేవంత్‌

ఎల్‌.వి. రేవంత్‌... నిన్నటి దాకా ఈ పేరు వినని వారు కూడా ‘ఎవరా ఈ కుర్రవాడు’ అంటూ గూగుల్‌ చేస్తున్న పేరు. దేశంలోని ప్రతి పత్రికలోనూ ఇప్పుడు రేవంత్ ఒక న్యూస్‌ ఐటం. ఎందుకంటే తెలుగువారికి దుర్బేధ్యం అనుకునే ఇండియన్‌ ఐడిల్‌ కోటను తన పాటతో బద్దలుకొట్టిన విజేత రేవంత్‌. కేవలం తెలుగువాడన్న కారణంగా రేవంత్‌ను మనం అభిమానించడం లేదు.... అందుకు చాలా కారణాలే ఉన్నాయి.

 

ఊహించని నేపథ్యం
హీరో కడుపులో ఉండగానే తండ్రి చనిపోతాడు. మేనమామల ఆసరాతో అతను పెరుగుతాడు. ఎవరి మీదా ఆధారపకుండా విజయాలను సాధిస్తాడు. ఇదీ మనం తరచూ వినే సినిమా కథ. కానీ రేవంత్‌ జీవితంలో ఆ సినిమా కష్టాలే నిజమయ్యాయి! కాకపోతే అతని ఉమ్మడి కుటుంబం రక్షగా ఉండటం ఓ అనుకోని అదృష్టం.

 

ఎంతటి శ్రమకైనా సిద్ధం
రేవంత్‌కి చిన్నప్పటి నుంచే పాటలంటే ఇష్టం. పాటలపోటీల్లో పాల్గొని తనని తాను మెరుగుపర్చుకోవాలనీ, తనేమిటో నిరూపించుకోవాలనీ తపించేవాడు. కానీ అందుకోసం డబ్బులు ఖర్చవుతాయిగా! ఆ డబ్బుల కోసం రేవంత్‌ పగలు పేపర్‌బాయ్‌లా పనిచేశాడు, సాయంత్రం హోటల్‌ సర్వర్‌గా ఒళ్లు వంచాడు. అలా తన కాళ్ల మీద తనే పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.

 

అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు
రేవంత్‌ కోరుకున్నట్లుగా పాటల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన ప్రతిసారీ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. మాటీవీ ‘సూపర్‌ సింగర్స్’, ఈటీవీ ‘సప్తస్వరాలు’ లాంటి ప్రతి కార్యక్రమంలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే మర్యాదరామన్న సినిమాలో తొలిసారిగా పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇక తిరిగి చూసుకోలేదు. చేతికి అంది వస్తున్న ఒకో సినిమాతోనూ గాయకుడిగా స్థిరమైన స్థానం సాధించాడు. బాహుబలిలో పాడిన ‘మనోహరీ’ పాటతో ప్రేక్షకులని దాసోహం చేసుకున్నాడు.

 

ప్చ్‌ తృప్తి లేదు!
రేవంత్‌కు పాటంటే ఎంత ఇష్టమో... పాటల పోటీలంటే అంతే ఇష్టం. వాటిలో సోనీ టీవీ నిర్వహించే ‘ఇండియన్‌ ఐడిల్’ గురించి చెప్పేదేముంది! మన దేశంలోనే అది అత్యున్నత పోటీ. కొడితే ఆ కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు రేవంత్‌. అందుకోసం ముంబైకి మకాం మార్చాలి. ఇప్పుడిప్పుడే వస్తున్న అవకాశాలని కొన్నాళ్లు వదులుకోవాలి. కానీ తన కలను నెరవేర్చుకునేందుకు రేవంత్‌ ఎంతటి రిస్క్‌ అయినా తీసుకునేందుకు సిద్ధపడిపోయాడు.

 

బలహీనతలు ఉంటాయి, కానీ...
ఒకో మనిషికీ ఒకో బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఉంది కదా అని అసలు ప్రయత్నమే విరమించుకుంటే ఇక విజయం దక్కే అవకాశం ఏముంటుంది? రేవంత్‌కి హిందీ పెద్దగా రాదు. ఆ కారణంగానే ఇండియన్ ఐడిల్స్ పోటీలో తోటి అభ్యర్థుల అతణ్ని హేళన చేసేవారు. కానీ రేవంత్ వెనక్కి తగ్గలేదు. తనకు హిందీ రాదని నిజాయితీగా ఒప్పుకొంటూనే... సంగీతమే తన శ్వాస, భాష అని చెప్పుకొచ్చాడు. రేవంత్‌లోని ఆ నిజాయితీ న్యాయనిర్ణేతలని సైతం మెప్పించింది. చిట్టి చివరికి సింహాసనాన్ని దక్కించింది!!

 

రేవంత్‌కు అహం తక్కువని అతని స్నేహితులు చెబుతుంటారు. నిరంతరం శ్రమించే తత్వం ఎక్కువని అతని సన్నిహితులు పేర్కొంటారు. మొత్తానికి రేవంత్‌ పాటలకే కాదు యువతకు కూడా ఒక ఐడల్‌గా (ఆదర్శం) చెప్పుకోవచ్చన్నమాట!

 

- నిర్జర.