ఆస్ట్రేలియా టూర్..భారత్ రికార్డులు

 

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రక పర్యటనను ఘనంగా ముగించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ కూడా గెలవని టీమిండియా... ఇప్పుడా లోటు తీర్చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా టూర్‌లో ఒక్క సిరీస్‌ కూడా కోల్పోకుండా టీమిండియా మరో రికార్డు నెలకొల్పింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.  టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దెబ్బకు ఆస్ట్రేలియా కుప్పకూలింది. చాహల్ బంతులను ఎదుర్కోలేక ఆసీస్ బ్యాట్స్‌మెన్లు వరుస పెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (58), షాన్ మార్ష్ (39), ఉస్మాన్ ఖావాజా (34) మాత్రమే కాస్తా ఫరవాలేదనిపించారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. పది ఓవర్లు వేసిన చాహల్ 42 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చి ఆసీస్ వెన్ను విరిచాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు వన్డేల్లో రాణించిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. సిడిల్‌ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లితో శిఖర్‌ ధావన్‌ జట్టు స్కోర్‌ను 50 పరుగులు దాటించాడు. ఈ తరుణంలో శిఖర్‌ (23), స్టోయినిస్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన ఎంఎస్‌ ధోని వచ్చిరావడంతోనే మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ మ్యాక్సీ జారవిడచడంతో ధోని ఊపిరి పీల్చుకున్నాడు.

ధోనితో కలిసి కోహ్లి ఆచితూచి ఆడుతూ.. మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. అనంతరం కోహ్లి(46) కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత ధోనీ, జాదవ్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో ధోని 74 బంతుల్లో 3 ఫోర్లతో కెరీర్‌లో 70వ అర్థ సెంచరీ సాధించాడు. ధోనీకి ఇది వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ. జాదవ్ కూడా  52 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్‌లో మూడో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ధోనీ 87 పరుగులతో జాదవ్ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.