ఇండియా... పాక్ కంటే హీనం! బంగ్లాదేశ్ కంటే దారుణమట!

నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్ ఫిన్ ల్యాండ్... ఇలాంటి దేశాలు మనకంటే సంతోషంగా వున్నాయంటే నమ్మొచ్చు! కాని, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్ కూడా ఇండియా కంటే హ్యాపీగా వున్నాయట! ఇదేం విడ్డూరం? కాని, తాజాగా రిలీజైన వాల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2017 ప్రకారం అదే నిజం! మొత్తం 155 దేశాల్లో మన భారత్ 122వ స్థానంలో నిలిచింది! అంటే, మరో 33 దేశాలు మాత్రమే మన దేశం కన్నా ఏడుపుగొట్టుగా వున్నాయన్నమాట!

 

మార్చ్ 20ని ప్రపంచ వ్యాప్తంగా హ్యాపీనెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు! ఆ విషయం కూడా తెలియని వారు మన దేశంలో బోలెడు మంది. అంతగా బాధల్లో, కన్నీళ్లలో మునిగిపోయారు ఇండియన్స్! మనకన్నా పూట గడవని ఆర్దికంగా చితికిపోయిన దేశాలు ఎక్కువ సంతోషంగా వున్నాయట. అలాగే, బాగా సంపన్నమైన యూరోపియన్, అమెరికన్ దేశాలు కూడా ఖుషీగానే వున్నాయట! ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించిన సర్వే ఫలితాల్లో ఈ ఆందోళనకర విషయం బయటపడింది!

 

ప్రస్తుత ప్రపంచ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా భారత్ ను మించి దూసుకుపోతున్న దేశం లేదు. గత సంవత్సరంలో మనం ఆర్దిక అభివృద్దిలో చైనాను కూడా వెనక్కి తోశాం. అయినా కూడా చైనాకు 79వ ర్యాంక్ వస్తే ఉగ్రవాదుల స్వర్గమైన పాకిస్తాన్ కు 80వ చోటు దక్కింది. ఇక చల్లటి హిమపర్వతాల నేపాల్ 99వ స్థానంతో సరిపెట్టుకుంది. అడ్డూ అదుపు లేని బంగ్లాదేశ్ 110వ ర్యాంక్ కొట్టేసింది. నిత్యం మానవ బాంబుల పేలుళ్లతో హృదయ విదారకంగా వుండే ఇరాక్ కూడా మనకన్నా బెటర్ గా 117వ ప్లేస్ లో వుండగా, శ్రీలంక 120 స్వంతం చేసుకుంది! వీటన్నటి తరువాత ఇండియా 122వ స్థానంలో ముఖం వేలాడేసుకుని నిలవాల్సి వచ్చింది! దీనికి కారణం ఏంటి? 

 

గతంలో చేసిన ఇంటర్నేషనల్ హ్యాపినెస్ సర్వే రిపోర్ట్ లో మనకు 118వ స్థానం దక్కింది. ఇప్పుడు నాలుగు స్థానాలు కోల్పోయి 122కు వచ్చాం. అయితే, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పతనానికి కారణం ఆర్దిక కోణం మాత్రమే కాదు. డబ్బులే సంతోషానికి మూలమైతే అమెరికా లాంటి దేశం నెంబర్ వన్ అవ్వాల్సింది. కాని, ఎక్కడో పద్నాలుగవ ర్యాంక్ తో టాప్ టెన్ లో కూడా కనిపించకుండా పోయింది! నార్వే, డెన్మార్క్ మొదలు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వరకూ అన్నీ మనం ఊహించని దేశాలే అత్యున్నత సంతోష స్థాయితో ముందున్నాయి. దీనికి కారణం అభివృద్ది చెందుతున్న దేశాల్లో సామాజిక సమస్యలు, భద్రత కూడా ఆందోళకరంగా వుండటమే. వేగంగా మార్పు జరుగుతున్నప్పుడు అనూహ్య పరిస్థితులు, పరిణామాలు సహజం. వాటి మూలంగా జనం అభద్రతకి లోనవటం, కొత్త సవాళ్లతో సతమతం అవ్వటం కూడా సహజమే. ఇక ఇండియా, చైనా లాంటి దేశాల్లో అభివృద్ధి కేవలం కొంత మందికే ఉపయోగపడుతూ పేద వార్ని మరింత పేదగా, గొప్ప వార్ని మరింత గొప్పగా మార్చేస్తుండటం... జనంలో సంతోషం క్షీణించటానికి కారణం! గతంలో కన్నా మనకు ఇప్పుడు బోలెడు భౌతిక సౌకర్యాలు, సుఖాలు అందుబాటులోకి వచ్చి వుండవచ్చు. అయినా అవేవీ ఆధునిక జీవనశైలి తెచ్చి పెడుతోన్న మానసిక రుగ్మతల్ని దూరం చేయలేకపోతున్నాయి!

 

నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాక్, ఇరాక్ లాంటి దేశాల్లో మనకన్నా ఆనందం స్థాయి ఎక్కువ వుండటం మరో విషయం కూడా స్పష్టం చేస్తుంది. సామాజిక స్థిరత్వాన్ని, కట్టుబాట్లని, అనుబంధాల్ని పణంగా పెట్టి అభివృద్ది సాధిస్తే దానికి మూల్యంగా సంతోషాన్ని చెల్లించాల్సి వస్తుంది. నిజానికి భారత్ కంటే మెరుగైన హ్యాపీనెస్ ఇండెక్స్ సాధించిన చాలా దేశాల్లో నిరుద్యోగం తీవ్రంగా వుంది. అయినా అక్కడి వారు సంతోషంగా వుంటున్నారని లెక్క తేలటం... మన దేశంలో ఉద్యోగ స్థానాల్లో ఎదురవుతోన్న ఒత్తిడికి సంకేతం! ఈసారి హ్యాపినెస్ సర్వే చేసిన వారు ఆధునిక మానవుడు ఎక్కువ కాలం గడిపేది వర్క్ ప్లేస్ లోనే కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారట! అలా చూసినప్పుడు కూడా ఇండియా, చైనా లాంటి దేశాల్లో ఆఫీసుల్లో సంతోషం కొరత తీవ్రంగా వుందట! జనం ఆనందంగా ఉద్యోగాలు చేయటం లేదు. తప్పనిసరై అసంతృప్తిగానే బండి నెట్టుకొస్తున్నారు!

 

155 దేశాల్లో పరిస్థితి గురించి ఒక సంస్థ తనకు దొరికిన కొద్దిపాటి డేటాతో ఓ రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని గుడ్డిగా నమ్మాలా? అస్సలు అక్కర్లేదు! నిజంగా మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఆనందంగా వుండొచ్చు. వుండకపోవచ్చు. కాని, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే! మనం సాధిస్తున్న ఆర్దిక ఫలాలు ఆనందపు ఘుమఘుమలతో మక్కుతున్నాయా లేదా అని! ఊరికే మందులు వేసి మక్కేలా చేసిన రంగురంగుల ఫలాల మాదిరిగా... పైకి కళకళలాడుతూ... లోన చప్పగా వుండిపోతున్నాయా? సమాధానం వెదుక్కోవాల్సింది మనమే!