భారత్-చైనాల మధ్య సత్సంబంధాలు సాధ్యమయ్యే పనేనా?

 

మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు భారత్ ఘనస్వాగతం పలికింది. సాధారణంగా ఇటువంటి విదేశీ అతిధులను భారత ప్రభుత్వం డిల్లీకే ఆహ్వానించి అక్కడే వారికి స్వాగత సత్కారాలు చేస్తుంది. కానీ చైనాతో మరింత బలమయిన సంబంధాలు నెలకొల్పుకోవాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఆచారాన్ని పక్కనబెట్టి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను అహ్మదాబాదుకు ఆహ్వానించి, అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ డిల్లీ చేరుకొని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలుస్తారు. అక్కడ కూడా ఆయనకు యదోచిత మర్యాదలు జరుగుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన భారత్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య మూడు ఒప్పంద పత్రాలు సంతకాలు చేశారు. ఈరోజు మరి కొన్ని చేయవచ్చును.

 

రెండు దేశాల అభివృద్ధికి, సంబంధాలు మెరుగుపడటానికి ఇటువంటివన్నీ చాలా ఉపయోగపడతాయి. కానీ సరిగ్గా ఇదే సమయంలో జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో లఢక్‌లోని చుమర్‌ అనే సరిహద్దు ప్రాంతంలోకి చైనా సైనిక దళాలు దాదాపు 4-5కి.మీ చొచ్చుకు వచ్చి గత రెండు మూడు రోజులుగా అక్కడే తిష్ట వేసాయి. వారిని వెనక్కు వెళ్లిపొమ్మని భారత సైనికదళాల హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. పైగా చైనాకు చెందిన కొన్ని సంచార జాతుల వారిని భారత్ భూభాగంలో శిబిరాలు వేసుకొనేందుకు తోడ్పడుతున్నారు. పాకిస్తాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే, చైనా సంచార జాతులను భారత భూభాగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తోంది. రెంటికీ తేడా ఏమిటంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లో బాంబు ప్రేలుళ్ళకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీస్తుంటే, చైనా సంచార జాతులను భారత భూభాగంలో ప్రవేశపెట్టి వారిని అక్కడ స్థిరపడేలా చేయడం ద్వారా ఆ భూభాగంపై తన హక్కును ప్రకటించుకొనే ప్రయత్నం చేస్తోంది.

 

మోడీ ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆదేశంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని భారత ప్రభుత్వం భావించింది. కానీ పాకిస్తాన్ అనుసరించిన భారత వ్యతిరేఖ వైఖరి వల్ల, మళ్ళీ రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ తో స్నేహ సంబంధాలు పెంపొందించుకొనే ప్రయత్నంలో భారత్ లో పర్యటిస్తుంటే, మరో పక్క సరిహద్దుల వద్ద చైనా సైనిక దళాలు ఈవిధంగా చొరబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు, ఒకరిపట్ల మరొకరిని నమ్మకం ఏర్పడటం సాధ్యమయ్యే పనేనా? చైనా అనుసరిస్తున్న ద్వంద వైఖరి చూస్తుంటే మళ్ళీ పాక్ తో ఎదురయిన చేదు అనుభవమే పునరావృతం అయ్యేలా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం రెండు దేశాల నేతల మధ్య జరుగుతున్న సమావేశాలకి, చర్చలకు అర్ధం ఉండదు.