హైదరాబాద్ ను  యూటీ చేస్తారా ? కేసీఆర్ కొత్త డ్రామానా? 

ఇప్పుడే కాదు  గతంలో కూడా ఇలాంటి పుకార్లు చాలానే షికారు చేశాయి. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కేంద్ర మంత్రి, సినిమా హీరో చిరంజీవి, హైదరాబాద్’ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ఇదే విధయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ప్రతిపాదనను పట్టించుకోలేదు. అలాగే, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా ‘తాము  పట్టిన కుందేటికి మూడే కాళ్ళు’అన్నట్లుగా సమైక్యాంధ్ర రాష్ట్రం డిమాండ్ నుంచి ఒక్క అంగుళం అయినా కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు.మరో వంక తెలంగాణ ప్రాంత నాయకత్వం సహజంగానే ఆ ప్రతిపాదనను నిర్ద్విధంగా తిరస్కరించారు.ఆ విధంగా, చిరంజీవి  ప్రతిపాదన రిలీజ్’కు నోచుకోని సినిమాలా తెరచాటుకు వెళ్లి పోయింది. 

ఆ తర్వాత కూడా అడపాతడపా హైదరాబాద్’ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలనే డిమాండ్, ఆకాంక్ష అక్కడా ఇక్కడా వినవస్తూనే ఉంది. అలాగే, ఇందుకు సంబంధించి మీడియాలో ఉహాగానాలు, వ్యూహాగానాలు,  కూడా అప్పడప్పుడు వినవస్తున్నాయి. ఇప్పుడు ఇదే క్రమంలో, అధికార తెరాస మిత్ర పక్షం ఎంఐఎం అధ్యక్షుడు, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిన్న లోక్ సభలో, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్’ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రమాదం ఉందని, ఒక పాసింగ్ కామెంట్ చేశారు. అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్’లో స్పష్టం చేశారు.

అయితే అంత సీరియస్ కామెంట్ లేదా ఆరోపణ చేసిన అసదుద్దీన్’ ప్రభుత్వం సమాధానం చెప్పేవరకు ఆగకుండా సభలోంచి వెళ్ళిపోయారు. అంటే, అసదుద్దీన్ ప్రభుత్వం నుంచి సమాధానం ఆశించి యూటీ అంశాన్ని ప్రస్తావించే లేదనే విషయం తేలిపోయింది. మరి ఎందుకు ఈ అసందర్భ ప్రస్తావన చేశారు, అని చూస్తే, కొత్తగా మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కిన తెరాస, ఎంఐఎం కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే అసదుద్దీన్ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారని అనుకోవచ్చునని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.  

రాష్ట్రంలో దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోతున్న పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అధికార తెరాస నాయకత్వం తెలంగాణా సెంటిమెంట్’ను మరో మారు నిద్ర లేపే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల పలు సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతర నాయకులు, మంత్రులు, తరిమి కొడతాం, ఆప్టి పెడతాం, ఆంధ్రా పాలకులు అవీఇవీ అనే   సెంటిమెంటును రగిల్చే ఉద్యమకాలం నాటి బాషను వాడుతున్నారు. ఇందులో భాగంగానే వరసగా నిలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక,అదే విధంగా ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెంటిమెంట్’ ప్రయత్నాలను అధికార పార్టీ ముమ్మరం చేసింది. ఆ వ్యూహంలో భాగంగానే అసదుద్దీన్ అసందర్భ ప్రస్తావన చేశారని అంటున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయిన తర్వాత ఇంకా  సెంటిమెంట్  ఏ మేరకు పనిచేస్తుంది .. అనేది చూడవలసి ఉంది..