హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై రాజకీయలేల

 

 

హైదరాబాద్ మెట్రో రైలుపై చెలరేగుతున్న దుమారం ఇప్పుడు అందరికీ చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాజెక్టు చేప్పట్టిన యల్.యండ్.టీ.సంస్థ, వివిధ కారణాలచేత దానిని మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోతామంటూ తెలంగాణా ప్రభుత్వానికి వ్రాసిన లేఖ మీడియా ద్వారా బహిర్గతం కావడంతో తెలంగాణా ప్రభుత్వానికి ఊహించని తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇది తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని ఆంధ్రా పత్రికలూ, పార్టీలు చేస్తున్న కుట్ర అని అభివర్ణించడం ద్వారా తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేసింది.

 

అయితే తెదేపా తెలంగాణా నేత రేవంత్ రెడ్డి దానిని త్రిప్పికొట్టే ప్రయత్నంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రామేశ్వరరావు (నందగిరి హిల్స్ దొర) మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రామేశ్వర రావుకు మేలు చేకూర్చేందుకే కేసీఆర్ ప్రభుత్వం మెట్రో రైలు మార్గం మార్చమని యల్.యండ్.టీ.సంస్థపై ఒత్తిడి చేసిందని, అందుకే ఆ సంస్థ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాలనుకొంటోందని ఆయన ఆరోపించారు. అయితే ఆయన చేసిన ఆరోపణలతో తెరాస ప్రభుత్వానికి జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ, ఈ వ్యవహారం తిరిగి తిరిగి తెదేపా తెలంగాణా నేతల మధ్య చిచ్చుపెడుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న నందగిరి హిల్స్ దొర, తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. కనుక సహజంగానే ఎర్రబెల్లికి కూడా ఇది ఇబ్బందికరమయిన అంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం నుండి ఈ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి మధ్య ప్రచ్చన్నయుద్దానికి తెరలేపినట్లయింది. ఇది చివరికి ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికీ తెలియదు.

 

ఇక ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎన్ని ఇబ్బందులు ఎదురయినప్పటికీ యల్.యండ్.టీ.సంస్థ సకాలంలో పూర్తి చేయకపోయినా, దానినుండి అర్దాంతరంగా వైదొలగినా అది ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బ తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాక ఆ ప్రభావంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, తిరుపతి నగరాలలో నిర్మించనున్న మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆ సంస్థ అనర్హురాలు అయ్యే ప్రమాదం కూడా ఉంది.

 

ఏమయినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదు. కనుక ఇందులో ఎవరు తప్పులు చేసినా వాటిని వెంటనే వాటిని సరిద్దికోవడం విజ్ఞతగా ఉంటుంది. లేకుంటే ప్రజలలో చులకనవడం తధ్యం.