నెక్లెస్‌రోడ్‌లో కూలిన హెలీకాఫ్టర్.. టీ.గవర్నమెంట్‌కు జర్క్

నవాబుల అడ్డాగా..చారిత్రక సంపదకు పట్టుకొమ్మగా భాసిల్లుతున్న భాగ్యనగరంలో పర్యాటకులు మెచ్చే ఎన్నో ప్రదేశాలున్నాయి. అయితే నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయే హైదరాబాద్‌లో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లడం అంత సులభం కాదు. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు..పర్యాటకులను ఆకర్షించేందుకు హెలీ టూరిజంకు శ్రీకారం చుట్టింది తెలంగాణ పర్యాటక శాఖ. కేవలం రూ.2,495లకే హైదరాబాద్ నగర అందాలను వీక్షించే జాయ్ రైడ్‌ను గత ఏడాది మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హుస్సేన్ సాగర్‌ తీరంలోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా హెలికాఫ్టర్ ఎక్కి ఒకేసారి 12 మంది నగర అందాలను తిలకించేందుకు వీలు కలుగుతుంది.

 

దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో పర్యాటకశాఖ కూడా దీనిని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.. అలా పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్న జాయ్ రైడ్‌కు చిన్న షాక్ తగిలింది. నిన్న మధ్యాహ్నం 1.15 గంటలకు పర్యాటకులతో టేకాఫ్ తీసుకున్న తుంబి ఏవియేషన్‌కు చెందిన ఛాపర్‌ అంతలోనే తడబడి సాగర్‌వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళన చెందారు. అయితే పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

 

నాలుగుసార్లు పర్యాటకులను తీసుకువెళ్లి వచ్చిన హెలికాఫ్టర్...మరో రైడ్‌కు కోసం సిద్ధమైంది..టేకాఫ్ తీసుకుని 10 అడుగుల మేరకు పైకి ఎగిరి వెంటనే కిందకి దిగింది. భూమికి ఐదు అడుగుల ఎత్తులోనే పైలెట్ కొద్దిసేపు గాలిలో నిలిపి ఉంచి..తర్వాత మళ్లీ పైకి లేపి యధావిధిగా పర్యాటకులకు సిటీ అందాలు చూపించాడు. అయితే హెలికాఫ్టర్ ఎక్కేందుకు పర్యాటకులు సిద్ధంగా ఉండగానే ఇవాళ్టీకి రైడ్ లేదని..వారికి డబ్బులు వాపస్ ఇచ్చేసి హెలికాఫ్టర్‌ను బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. ప్రమాదం జరగలేదని ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నా కానీ నగరవాసులు ఆ హెలికాఫ్టర్ ఎక్కాలంటే భయపడిపోతున్నారు.