హైదరాబాద్ మెట్రో రైలుకు బ్రేకులెన్నో

 

 

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఇంకా గొడవ సద్దుమణగక ముందే, అంతకంటే మరో గంభీరమయిన సమస్య తలెత్తింది. రెండు దశలుగా చేప్పట్టిన ఈ ప్రాజెక్టులో మొదటి దశలో పెద్దగా ఇబ్బందులు లేకుండానే పూర్తవుతోంది. కానీ రెండవ దశ పనులలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం దారుల్-షిఫా నుండి ఫలక్ నూమా వరకు సాగే ఈ రెండవ దశ మెట్రో రైల్ ప్రాజెక్టు హైదరాబాద్ పాతబస్తీ గుండా సాగవలసిరావడమే.

 

మెట్రో ప్రాజెక్టు చేప్పట్టవలసిన ఈ ప్రాంతంలో అనేక మశీదులు, దర్గాలు, అశూర్ ఖానాలు, అనేక వేల భవనాలు ఉన్నందున వాటినన్నిటినీ తొలగిస్తే తప్ప ప్రాజెక్టు పనులు చెప్పట్టడం సాధ్యం కాదు. అయితే మశీదులను దర్గాలను కూల్చడం అసాధ్యమనే సంగతి అందరికీ తెలుసు. అందుకే మజ్లిస్ పార్టీ ఈ రెండవ దశ ప్రాజెక్టు దారుల్-షిఫా నుండి పక్కకు మరల్చి మూసీ నది ఒడ్డు పక్కగా పురానా ఫూల్ వరకు సాగేలా మార్చమని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. అయితే దాని గోడు, అభ్యంతరాలను రాష్ట్ర విభజన హడావుడిలో పడి ఇంతకాలం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మొదటి దశ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి కనుక త్వరలోనే రెండవ దశ పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. కనుక మజ్లిస్ పార్టీ మళ్ళీ మరోసారి తెలంగాణా ప్రభుత్వానికి తన అభ్యంతరాలను గట్టిగా తెలియజేసి ప్రాజెక్టు డిజైన్ మార్చాలని కోరింది.

 

అయితే ఇప్పటికే ఒకసారి ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు చేసినందుకు ఈ ప్రాజెక్టును వదులుకొని వెళ్లిపోతామని యల్.యండ్.టీ. సంస్థ ప్రభుత్వానికి వ్రాసిన లేఖ మీడియాలో బహిర్గతం అవడంతో జరుగుతున్నరభసతో తలపట్టుకొన్న ప్రభుత్వానికి మజ్లిస్ ప్రతిపాదనకు ఊ కొట్టడం సాధ్యం కాదు. కానీ మజ్లిస్ పార్టీ చేస్తున్న అభ్యర్ధన అభ్యర్ధనలా కాక దానిని ఒక ఆజ్ఞగా భావించక తప్పనిసరి పరిస్థతి ఏర్పడింది.

 

ఎందుకంటే వచ్చే డిశంబరు నెలలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాదులో జరిగే ఆ ఎన్నికలలో తెరాస గెలవాలంటే మజ్లిస్ సహకారం తప్పనిసరి. కానీ అందుకోసం మజ్లిస్ పార్టీ నేతలు కోరిన విధంగా రెండవ దశ ప్రాజెక్టు డిజైన్ మార్చాలంటే యల్.యండ్.టీ. సంస్థ తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాగని మొండిగా పనులు మొదలు పెట్టి పాతబస్తీలో మశీదులు, దర్గాల జోలికి వచ్చినట్లయితే ఏమవుతుందో ఎవరయినా తేలికగానే ఊహించగలరు.

 

మొదటి నుండి ఈ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా పోరాడుతున్న ఒక ప్రజాసంఘం అందుకు ఒక గొప్ప తరుణోపాయం చెప్పింది. రెండవ దశ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయడమే దీనికి మంచి పరిష్కారమని ఆ సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఆవిధంగా చేసినట్లయితే ప్రభుత్వం రాజకీయ సమస్యలను అధిగమించడమే కాక, పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఒక పెద్ద ఆర్.టీ.సి. బస్సు కాంప్లెక్స్ నిర్మించాలనే ప్రభుత్వ ఆశయం కూడా నెరవేరుతుందని వారి వాదన.

 

ఈ ప్రతిపాదన వినడానికి బాగానే ఉంది. కానీ, ఈ మెట్రో ప్రాజెక్టుపై రభస జరిగినప్పుడు, రెండు రోజుల క్రితమే తెలంగాణా ప్రభుత్వం, యల్.యండ్.టీ.సంస్థ రెండూ కూడా మీడియా ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా సకాలంలో పూర్తి చేసి తీరుతామని భీషణ ప్రతిజ్ఞ చేసారు కనుక ఇప్పుడు ఆ ప్రతిజ్ఞని ఉపసంహరించుకోవడం కష్టమే. అలాగని ముందుకు వెళ్ళినా కష్టమే. డిజైన్ మార్చడమూ కష్టమే. ఈ ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణా ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షగా తయారయినట్లు కనిపిస్తోంది.

 

అయితే దీనికి మెట్రో గరువుగారు శ్రీధరన్ గారే సరయిన పరిష్కారం చూపవచ్చును. ఎందుకంటే ఆయన ఇంతకంటే క్లిష్టమయిన పరిస్థితుల్లో డిల్లీలో మెట్రో రైలు ప్రాజెక్టును అనుకొన్న సమయం కంటే ముందుగానే విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించారు. బహుశః అందుకే తెలంగాణా ప్రభుత్వం ఛలో డిల్లీ అంటోందిపుడు.