పట్టాలు తప్పుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు

 

ఇంతవరకు శరవేగంతో సాగిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు తీరాచేసి పట్టాలెక్కే సమయానికి ఇక ముందుకు కదలనని మొరాయిస్తోంది. రాష్ట్ర విభజన, ఆ కారణంగా హైదరాబాదులో మారిన ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక మార్పులు, తెలంగాణాలో కొత్తగా అధికారం చేప్పట్టిన తెరాస ప్రభుత్వం మెట్రో రైలు మార్గంలో సూచిస్తున్న కొన్ని మార్పులు తదితర అంశాల కారణంగా తాము తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న యల్.యండ్.టీ. సంస్థ డైరక్టర్ వివేక్.బీ.గాడ్గిల్ హైదరాబాద్ మెట్రో రైల్ యండీ యాన్.బీ.యస్. రెడ్డికి ఒక పెద్ద లేఖ వ్రాశారు. ప్రభుత్వం తరపున ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా నిర్ణీత సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసే పరిస్థితులు లేవని, దానివలన నిర్మాణ వ్యయం ఊహించిన దానికంటే చాలా పెరిగిపోయిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

 

ఇంతవరకు హైదరాబాద్ తో అనుసంధానమయిన 23జిల్లాలలో ప్రజలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, పోర్టులు తదితరాలన్నిటినీ రాష్ట్ర విభజన కారణంగా హైదరాబాద్ పోగొట్టుకొని ఒక అతి చిన్న రాష్ట్రానికి రాజధానిగా మిగిలిపోయిందని, అదే నిష్పత్తిలో ఈ మెట్రో ప్రాజెక్టుపై ఆదాయం కూడా తగ్గిపోతుందని, అందువల్ల మెట్రో నిర్వహణ లాభసాటి కాదని భావిస్తున్నందున తాము ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాలనుకొంటున్నామని వ్రాసారు. ఇవి కాక అనేక ఇతర అంశాలను తమ ఈ నిర్ణయానికి కారణాలుగా లేఖలో పేర్కొన్నారు.

 

తాము రాష్ట్ర విభజన జరుగుతుందని ఊహించలేదని, ఒకవేళ జరిగినా హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని భావించామని, కానీ ఆవిధంగా జరగకపోవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మించి, కేవలం టికెట్ల అమ్మకాలపైనే పూర్తిగా ఆధారపడి దానిని నడపడం తమ వల్ల కాదని యల్.యండ్.టీ. సంస్థ వ్రాయడం చాలా వివాదస్పదం కానుంది. ఇంతకాలం శరవేగంతో సాగిన ప్రతిష్టాత్మకమయిన మెట్రో ప్రాజెక్టు ఈవిధంగా అర్దాంతరంగా ముగిస్తే, తెరాస అధికారం చేప్పట్టిన తరువాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని అనే ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూరుస్తున్నట్లవుతుంది. పైగా యల్.యండ్.టీ. సంస్థ రాష్ట్ర విభజన, దాని వలన నష్టాల గురించి మాట్లాడటం, రాష్ట్రంపై తీవ్ర వ్యతిరేఖ ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

 

సహజంగానే తెరాస ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించవచ్చును. బహుశః ప్రభుత్వం కూడా దీనిపై అంతే ఘాటుగా స్పందించవచ్చును. ఇంత భారీ ప్రాజెక్టుని నిర్మిస్తున్న యల్.యండ్.టీ.సంస్థ ఈ ప్రాజెక్టు ద్వారా లాభాలు ఆశించడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ అందుకోసం అది చెపుతున్న కారణాలు, వాటి పరిష్కారాలు తెలంగాణా ప్రభుత్వం చేతిలో కూడా లేవనే సంగతి ఎవరయినా అంగీకరిస్తారు.

 

రాష్ట్ర విభజన జరుగుతుందని తాము ఊహించలేదని, ఒకవేళ జరిగినా హైదరాబాద్ కేంద్రపాలితంగా ఉంటుందని భావించామని ఆ సంస్థ చెప్పడం కూడా చాలా ఆహేతుకంగా ఉంది. లాభార్జనతో పనిచేసే వ్యాపార సంస్థ-యల్.యండ్.టీ. ఎటువంటి ముందు చూపు లేకుండా ఈ ప్రాజెక్టు చేసేందుకు గుడ్డిగా ఒప్పుకొందని భావించడం చాలా అసంబద్ధంగా ఉంది. అంటే తన నిర్ణయానికి ఆ సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు.

 

ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ పరంగా అడ్డంకులు ఎదురయితే వాటిని ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించు కోవలసి ఉంటుంది. మారిన పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు లాభదాయకం కాదని భావిస్తే, ప్రభుత్వం సహాయ, సహకారాలు కోరవచ్చును. కానీ ఇటువంటి భారీ ప్రతిష్టాత్మకమయిన ప్రాజెక్టు నుండి అర్ధాంతరంగా తప్పుకొంటే అది ఆ సంస్థకే కాదు తెలంగాణా రాష్ట్రానికి, ప్రభుత్వానికీ కూడా చాలా నష్టం కలిగిస్తుంది. ఆ సంస్థపై, రాష్ట్ర ప్రభుత్వంపై కూడా వ్యతిరేఖ ప్రభావం తప్పక ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం, యల్.యండ్.టీ. సంస్థ రెండూ కూడా ఈ విషయంలో పట్టువిడుపులు కనబరుస్తూ, ఈ సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు కనుగొని ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అన్నివిధాల అందరికీ మంచిది.