పరకాలపై కన్నేసిన నళిని
Published on: Mon Apr 2, 2012 11:34AM
హైదరాబాద్: వచ్చే ఉప ఎన్నికల్లో తాను పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ డిఎస్పీ నళిని ఆదివారం తెలిపారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌ను కలిసి తనకు మద్దతివ్వాలని తాను ఇప్పటికే విజ్ఞప్తి చేశానని ఆమె చెప్పారు. కాగా ఇటీవల ఆమె జెఏసి నేతలను కలిసి తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత కొండా సురేఖ ఇటీవల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థలం ఖాళీ అయింది. అక్కడ నుండి పోటీ చేసేందుకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గెలుపొందారు. అదే ఉత్సాహంలో పరకాలను కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.


