TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కు హాండివ్వనున్న టీ-కాంగ్రెస్ ఎంపీలు?

Published on: Wed Mar 28, 2012 10:06AM

హైదరాబాద్: తెలంగాణపై అధిష్ఠానం అటో ఇటో తేల్చకుండా... నాన్చుడు వైఖరి ప్రదర్శిస్తుండటంతో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించినట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం తీవ్రంగా ఉండడం, కాంగ్రెస్ అభ్యర్థులకు వరుసగా ఘోర పరాజయాలు ఎదురవుతుండటంతో ఆ పార్టీ నేతలకు ఎటూ పాలుపోవడంలేదు. ఆత్మహత్యల నేపథ్యంలో తమ చిత్రాలను, దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నా... రాజీవ్, ఇందిర విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా ఖండించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తమతమ నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేక పోతున్నారు. ఈ అవమానాలన్నింటినీ భరించినా అధిష్ఠానాన్ని తెలంగాణ విషయంలో ఒప్పిస్తే మళ్లీ హీరోలుగా చలామణి కావచ్చన్న ధీమా కూడా వీరిలో నెమ్మదిగా కరిగిపోతోంది. యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం వారిలో బలపడుతోంది. ఎందుకంటే... యూపీఏలో కీలక భాగస్వాములైన ఎన్సీపీ, తృణమూల్ నేతలు శరద్ పవార్, మమతా బెనర్జీ 'విభజన'కు వ్యతిరేకమనే వాదనలున్నాయి. ఇక... చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకమని సమాజ్‌వాది నేత ములాయం బహిరంగంగానే చెప్పారు.

తెలంగాణకు సానుకూలతను వ్యక్తం చేస్తే... తమ సొంత రాష్ట్రాల్లో సమస్యలు ఎదురవుతాయనే ఆందోళనే దీనికి కారణం. ఈ 3 పార్టీల మాట కాదని కాంగ్రెస్ అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఇది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా మారింది. 'తెలంగాణ తెచ్చేది - ఇచ్చేది మేమే' అని... 'మమ్మల్ని గెలిపిస్తే బంగారు పళ్లెంలో తెలంగాణ తెస్తాం' అని చేసే నినాదాలకు జనం స్పందించే పరిస్థితి కూడా కనిపించడంలేదు. పైగా... తమను తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించడం, భావోద్వేగాలు తీవ్రమైన ప్రతిసారీ తమ ఇళ్లపై రాళ్ల దాడులు చేయడం, నాయకులను అడ్డుకోవడంవంటి చర్యలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయంగా తమకు మనుగడ ఉండదని వీరు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక పార్టీ స్థాపించడమొక్కటే తమ సమస్యలకు పరిష్కారమని వీరు భావిస్తున్నారు.

కాగా, అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తామంతా ఒకసారి సమావేశం కావాలని... ఆ తర్వాత విడతల వారీగా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అధిష్ఠానం సానుకూలంగా స్పందించకుండా అవమానకర రీతిలో వ్యవహరిస్తే... ఇక ఏమాత్రం ఉపేక్షించకుం డా పార్టీకి గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకోవాలనే దిశగా నేతలు ఆలోచిస్తున్నారు.