సంస్కారమే ముఖ్యమని తేల్చిన పరిశోధన


కాలం మారిపోయింది. జీవితం ఉరుకులపరుగుల వేగంతో నడిచిపోతోంది. ఇలాంటి పోటీ ప్రపంచంలో తన పిల్లవాడు ఎక్కడ వెనబడిపోతాడో అని తల్లిదండ్రులు కంగారుపడటం సహజమే! కానీ పిల్లవాడిని ఎలాగైనే పరుగులెత్తించాలనే తపనతో అతడి మీద తమ ఆశలని అద్ది... తమవైన లక్ష్యాలను నిర్దేశిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది! మొదటికే మోసం వస్తుందని తేలుస్తోంది ఓ పరిశోధన.

 

చదువా- సంస్కారమా!

అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఆరోతరగతి చదువుకుంటున్న ఓ 506 మంది పిల్లల ముందు ఓ ప్రశ్నని ఉంచారు. మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తుంటారు? అన్నదే ఆ ప్రశ్న. ఇందుకోసం వారు ఒక ఆరు అంశాలతో కూడిన ఓ జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో మంచి మార్కులు సాధించడం, ఆటపాటల్లో ముందుండటంలాంటి వ్యక్తిగత విజయాలకి సంబంధించిన ఓ మూడు అంశాలు ఉంటే... ఇతరులకి సాయపడటం, మర్యాదగా ప్రవర్తించడం వంటి వ్యక్తిత్వపరమైన అంశాలు ఓ మూడు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు తమ పిల్లవాడు వ్యక్తిగత విజయాలను సాధించాలని అనుకుంటున్నారా? లేకపోతే వారు మంచి వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలని అనుకుంటున్నారా? అని తేల్చేందుకు ఈ జాబితాను రూపొందించారన్నమాట.

 

సంస్కారవంతులదే విజయం

తమ తల్లిదండ్రుల అభీష్టానికి అనుగుణంగా వ్యక్తిగత విజయాలు సాధించాలనుకునేవారు అనేకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఆందోళన, ఉద్వేగం, క్రుంగుబాటు వంటి సమస్యలతో వీరు సతమతమవడాన్ని గమనించారు. పైగా వీరి ప్రవర్తన గురించి కూడా ఉపాధ్యాయులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని తేలింది. అన్నింటికంటే చిత్రమైన విషయం ఏమిటంటే చదువులో కూడా వీరు వెనకబడుతున్నారని బయటపడింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా సంస్కారానికి అధిక ప్రాధాన్యతని ఇచ్చిన కుటుంబాలలోని పిల్లలు... ఇటు చదువులోనూ, అటు ప్రవర్తనలోనూ అందరికంటే ఓ అడుగు ముందున్నారట!

 

విలువలే ముఖ్యం

ర్యాంకులు, బహుమతులు వంటి బాహ్యమైన విషయాలతో తనని తాను కొలిచి చూసుకునే పిల్లవాడికి తన మీద తనకు నమ్మకం కలగదు. వ్యక్తిగత విజయాలు సాధిస్తేనే తనకు విలువ అన్న అభిప్రాయం అతని మనసు మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా అటు చదువులోనూ రాణించలేకపోతాడు, ఇటు తనదైన వ్యక్తిత్వాన్నీ రూపొందించుకోలేకపోతాడు. అన్నింటికీ మించి జీవితాన్ని ఆస్వాదించలేకపోతాడు.

 

అలాగని పిల్లల్ని వాళ్ల మానానా వాళ్లని వదిలేయమనో, నిరంతరం నీతిబోధలు చేస్తూ ఉండమనో పరిశోధకులు ఉద్దేశం కాదట! అటు చక్కగా చదువుకోమని ప్రోత్సహిస్తూనే, ఇటు వారిలో మంచి విలువలని కూడా పెంపొందించే ప్రయత్నం చేయాలంటున్నారు. ఇటు వ్యక్తిగత విజయాలకీ, అటు వ్యక్తిత్వానికీ సరసమానంగా ప్రాధాన్యతని ఇవ్వమని సూచిస్తున్నారు.

 

- నిర్జర.