కొడుకుల మోజులో కొంపలు మునుగుతున్నాయ్!

రాముడి కోసం దశరథుడు పుత్రకామేష్ఠి చేశాడు. అలాగే, కృష్ణుడ్ని తమ కొడుకుగా పొందేందు కోసం దేవకీ, వసుదేవులు అంతకు ముందు జన్మలో తీక్షణమైన తపస్సులు చేశారు. ఇలా మన పురాణాల్లో పూజలు, పునస్కారాలు అన్నీ కొడుకుల్ని కనేందుకే చేస్తుంటారు? మరి కూతుళ్లు వద్దా? కాస్త ఓపిక చేసుకుని  చదివితే మన పురాణాల్లో, ఇతిహాసాల్లో కూతుళ్ల కోసం తపస్సు చేసిన వారు కూడా కనిపిస్తారు. అలా ఎందరికో పార్వతీ, లక్ష్మీ వంటి అమ్మవార్లు వరమిచ్చి తామే స్వయంగా బిడ్డలుగా పుట్టారు కూడా! 


ఇక భారతీయ సంస్కృతిలో పుత్రులకు మరీ ఎక్కువ ప్రాధాన్యం వుంది. అమ్మాయిలకు లేదనే అపవాదు కూడా వుంది. ఇది కూడా తప్పుడు ప్రచారమే. పుత్రుడు లేకపోతే పున్నమ నరకం వస్తుందని చెప్పిన మన శాస్త్రాలే కన్యా దానం చేస్తే కోటి అశ్వమేధ యాగాలు చేసినంత అని చెప్పాయి. అంటే పున్నమ నరకం కోసం పుత్రుడు, కన్యాదానం కోసం కూతురు అన్నమాట!. ఒకప్పుడు ఇప్పుడున్న ఫ్యామిలీ ప్లానింగ్స్ వంటివి లేకపోవటంతో కొడుకైనా, బిడ్డైనా దేవుడిచ్చిన వరంగా స్వీకరించే వారు మన వాళ్లు. కాని, ఇప్పుడు ఒకరు లేదంటే ఇద్దరు అన్న రూల్ కి లోబడి కొడుకుల కోసం తహతహలాడుతున్నారు. కడుపులో వున్నది ఆడ బిడ్డైతే అబర్షాన్ చేయించే దాకా వెళుతున్నారు. ఈ భ్రూణ హత్యల పర్వం ఎన్నో ఏళ్లుగా సాగుతూ దేశ భవిష్యత్ కే ప్రమాదంగా మారింది. 

 


భారతదేశంలో కూతుళ్లపై వివక్ష ఎప్పుడూ వుంది. కాని, రోజు రోజుకి చదువుకున్న వాళ్లు పెరుగుతోన్న ఈ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్ యుగంలో కూడా లింగ వివక్ష అధికమవుతూ వుండటం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికే మన దేశంలో అబ్బాయిల పెళ్లిల్లు అగ్ని పరీక్షగా మారుతున్నాయి. ఇందుకు కారణం కొన్నేళ్లుగా చేసుకుంటూ వస్తోన్న భ్రూణ హత్యలే. ఇంత ఇబ్బంది పడుతూ కూడా మన వాళ్లు గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. అందుకు తాజా గణాంకాలే నిదర్శనం... 

 


2011 నుంచి 2013 వరకూ తీసిన లెక్కల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మంది అబ్బాయిలకు 909 మంది అమ్మాయిలు మాత్రమే పుట్టారు. కాని, అదే నిష్పత్తి 2012 నుంచి 2014 మధ్య కాలంలోకి వచ్చే సరికి 906కి పడిపోయింది. ఇది పైకి చూడటానికి మామూలుగా కనిపించినా భవిష్యత్ లో చాలా పెద్ద సంకటం తెచ్చిపెడుతుంది. ముందు ముందు అబ్బాయిలు వున్నా అమ్మాయిలు లేక పెళ్లిల్లు అవ్వటం దుర్భరం అవుతుంది. పెళ్లిల్లు కాకపోతే దానికి అనుబందంగా బోలెడన్ని సమస్యలు పుట్టుకొస్తాయి. మొత్తం సమాజమే కుదుపుకు గురికావచ్చు.. 


అమ్మాయిల పట్ల వివక్ష చూపటంలో ఉత్తరాది కన్నా దక్షిణాది కాస్త బెటర్. ఇక్కడ జననాల్లో అమ్మాయిల సంఖ్య కాస్త మెరుగ్గా వుంది. అయినా కూడా ఆందోళనకరంగానే వుంది. ఇక నార్త్ ఇండియాలో అయితే ఢిల్లీ లాంటి మహా నగరాలు సహా హర్యానా లాంటి రాష్ట్రాల మారు మూల గ్రామాల దాకా అంతటా ఆడపిల్లల పట్ల విముఖతే. అందుకే, ఉత్తరాదిలో రోజు రోజుకి అమ్మాయిల జననం తగ్గిపోతోంది. ప్రపంచంలో అమ్మాయిలు, అబ్బాయిల సగటు నిష్పత్తి వెయ్యికి 950గా వుంది. భారతదేశంలో ఏ రాష్ట్రమూ దీన్ని మించి లేదు. అంతటా ఆడపిల్లల సంఖ్య తక్కువగానే వుంటూ వస్తోంది.


యేటేటా తగ్గుతోన్న ఆడపిల్లల జననాల సంఖ్య చూస్తుంటే మోదీ స్వయంగా ఇచ్చిన బేటీ బచావ్ లాంటి నినాదాలు కూడా ఏం ప్రయోజనం చూపుతున్నట్టు లేదు. అందుకే, ప్రభుత్వం, మేధావులు, సినిమా, టీవీ రంగాలు ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. జనంలో చైతన్యం తేవాలి. స్త్రీని ఆది పరాశక్తి అంటూ పూజలు చేసే మనం అమ్మాయిలు లేకుండా బతికే ఒంటరి రోజులు రాకూడదని వాళ్లకి అర్థం అయ్యేలా తెల్పాలి...