ఇలా చేస్తే ..అన్ని కలిసొస్తాయి

 

 

కొందరిని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఆనందంగా వుంటారు, జరిగే పొరపాట్లని హుందాగా ఒప్పుకుంటారు. ఏదీ కలిసి రాని సమయంలో కూడా నమ్మకంతో వుంటారు. ఇవన్నీ వాళ్ళని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఏంటి వాళ్ళ సీక్రెట్ ? అంటే జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బ్లాకేమన్ ఏం చెబుతున్నారో తెలుసా? పాజిటివ్ మైండ్ సెట్... తో జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనని చూడటం. ఆఒక్క అలవాటే వారిని అందరి నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది, అంతే కాదు అలాంటి వారికే అన్ని కలిసివస్తాయి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎదురయ్యే ప్రతిదానిలో ఒక అవకాశం కనిపిస్తుంది అంటున్నారు ఆయన. మరి అలాంటి మ్యాజిక్ మన జీవితాలలో కూడా జరగాలంటే? ఆయన చెబుతున్న ఈక్రింది వాటిని ఫాలో అవ్వటమే.

 

లోపలినుంచి మొదలు కావలి...
మన లోపలి నుంచి మనం ఎంత ప్రశాంతంగా, ఉంటామో మనలో ఆందోళన అంత తక్కువ వుంటుంది. అంటే ఆందోళనగా వున్నప్పుడు అప్పటికప్పుడు మనసుని ప్రశాంతం కమ్మని చెబితే మాట వినదు. మొదటి నుంచి దానికి ఆప్రశాంతతని  అలవాటు చేయాలి. దానికోసం రోజూ ధ్యానం, మెడిటేషన్ వంటి ఆరోగ్యకర అలవాట్లని చేసుకోవాలి. ఒక్క అరగంట అయినా చాలు. ఆరోజులో మనకి ఎదురయ్యే ఎన్నో సంఘటనలని ఆందోళన పడకుండా దాటగలుగుతాము. ఆందోళన లేనప్పుడు మెదడు చురుకుగా పని చేస్తుంది. సమస్యలకి పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. అలా ఆడుతూ పాడుతూ వాటిని దాటుతుంటే అందరు వీళ్ళకి అన్ని కలిసివస్తాయి అంటారు. అది కేవలం మీరు ప్రశాంతంగా వుండటం వల్లే సాధ్యమవుతుంది.

 

ఓ చిన్న మంత్రం... 
ఇది కూడా గడిచిపోతుంది... ఇదే మంత్రం చాలా మందిని ఎన్నో గడ్డు సమయాలని దాటేలా చేసింది. చేస్తోంది. చాలాసార్లు కాలం పరీక్ష పెడుతుంది. ఒకదాని వెనుక ఒకటి మన సహనాన్ని పరీక్షిస్తాయి. అప్పుడే నిటారుగా నిలబడాలి. ఎదురైన గాలికెరటం మనలని దాటి పోయేదాకా ఎదురు చూడాలి. అది దాటిపోతుందని, మంచి రోజులు ఎదురవుతాయని నమ్మాలి. జీవిత చక్రంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో తెలిసి కూడా క్రుంగిపోవటంలో అర్ధం లేదుకదా ?

 

నీకు నీవే శత్రువు కావద్దు...
ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు...నేనింతే... అనుకుంటూ నిందించుకోవటం మానేయాలి. ఎదుట వుండే శత్రువుతో పోరాడటం సులువు, కాని మన లోపలి శత్రువుతో పోరాడలేము, గెలవలేము. పొరపాట్లు చేయటం నేరం కాదు. వాటిని ఎలా సరిదిద్దు కోవాలో ఆలోచించాలి. అంతే సగం బాధ తీరిపోతుంది. చాలాసార్ల జరిగిన విషయాన్నే తలుచుకుని, తలుచుకుని బాధ పడుతుంటారు. దానివల్ల ఆత్మ విశ్వాసం తగ్గటం తప్ప వేరే లాభం ఏమి ఉండదు.

 

చుట్టువైఫైలా వుండాలి... 
మంచి ఆలోచనలతో, ఉత్సాహంగా వుండే స్నేహితులని చుట్టూ ఉంచు కుంటే చాలు. చాలావరకు సమస్యలు ఎదురే కావు.. మన స్వభావం మూలంగా మనం కొనితెచ్చుకునే సమస్యలు ఎన్నో వుంటాయి. అవి మన స్నేహితుల వల్ల మన దగ్గరకి రాకుండా వుంటాయి. ఎప్పడు మంచి ఆలోచనలు కలిగి వుండటం ఒక్కటి చాలు ఎన్నో విజయాలు పొందటానికి.

 

ప్రతి చిన్న విజయం విలువైనదే...
ప్రతి రోజు చిన్నదో, పెద్దదో ఒక విజయాన్ని అయితే సెలెబ్రేట్ చేసుకోవాలి. నచ్చిన పని చేయటం, ఇష్టమైన పుస్తకం చదవటం, నుంచి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం వరకు అన్ని విలువైనవే. ఆ విజయాల్ని మననం చేసిన కొద్ది ఉత్శాహం కలుగుతుంటుంది. దానితో తృప్తి కలుగుతుంది.

-రమ