ఒత్తిడిని ఎదుర్కోవడం తేలికే!

కాలం మారిపోయింది. జీవన విధానాలూ మారిపోతున్నాయి. కానీ మన అవసరాలను తీర్చడం కోసం ఏర్పరుచుకున్న జీవనశైలే ఇప్పుడు మన ఒత్తిడికి కారణం అవుతోంది. ఇంట్లో గొడవల దగ్గర్నుంచీ, ఆఫీసులో చేరుకోవల్సిన లక్ష్యాల వరకూ... పొద్దున లేచిన దగ్గర్నుంచీ వేల సమస్యలు. మరి ఇన్ని సమస్యలనీ ప్రశాంతంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాలంటే... ఒత్తిడిని ఎదుర్కోవలసిందే! అందుకోసం కొన్ని చిట్కాలు...

 

నిశ్చయం:  ఏదన్నా సమస్య ఏర్పడగానే ముందుగా కంగారుపడిపోవడం మనకు అలవాటు. కానీ నిజానికి సమస్య ఏమిటి, దాన్ని పరిష్కరించడం ఎలా అన్న విషయం మీద ఒక స్థిరాభిప్రాయానికి వచ్చి... ఆ అభిప్రాయానికే కట్టుబడి ఉందాము, ఏదైతే అదవుతుంది అనుకున్నప్పుడు ఒత్తిడి ఉండదు. చేయాల్సింది చేద్దాము, ఫలితం ఎలాగూ మన చేతుల్లో ఉండదు కదా అన్న ఎరుక ఉన్నప్పుడు ఎప్పుడో, ఏదో జరిగే ‘అవకాశం’ ఉందన్న భయం ఉండదు. దాంతోపాటు ఏర్పడే ఒత్తిడీ ఉండదు!

 

శరీరాన్ని గమనించండి: ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం మన అదుపులో ఉన్నట్లు కనిపించదు. భుజాలు జారిపోతాయి, ఊపిరి త్వరత్వరగా పీల్చుకుంటాము, భృకుటి ముడిపడుతుంది. ఇవన్నీ కూడా మనలోని ఒత్తిడిని పెంచేవే. ఈ విషవలయాన్ని ఛేదించడం చాలా ముఖ్యం. ఒత్తిడి సమయాలలో వీలైనంత నిదానంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల మన గుండెవేగం తగ్గుతుందనీ, రక్తానికి కూడా తగినంత ప్రాణవాయువు లభిస్తుందనీ తేలింది. తద్వారా మన మెదడులోని ఒత్తిడి స్థానంలో ప్రశాంతత చేకూరుతుంది. భుజాలను నిటారుగా ఉంచడం వల్ల కూడా ఊపిరి గుండెల నిండా పీల్చుకునేందుకు, కండరాల మీద నుంచి ఒత్తిడి తగ్గించేందుకు దోహదపడుతుంది.

 

నవ్వు ఓ దివ్వౌషదం:  ఒత్తిడిలో ఉన్న మనిషి మొహంలో ఎక్కడలేని చిరాకూ తాండవిస్తూ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే శరీరంలోని ఒత్తిడి అంతా మొహంలో కేంద్రీకృతమవుతుంది. ఆ చిరాకుని కనుక చిరునవ్వుతో తోలిపారేస్తే సగం ఒత్తిడి దూరమవుతుంది. అంతేకాదు! నవ్వడం వల్ల మనం అంత ఒత్తిడితో ఉండాల్సిన అవసరం లేదన్న సూచన కూడా మెదడుకి చేరుతుంది. అలాగని మరీ తెచ్చిపెట్టుకుని పగలబడి... వింతగా నవ్వాలని కాదు కానీ మొహంలోని కండరాల బిగువు కాస్త సడలేలా చిన్న చిరునవ్వు వెల్లివిరిస్తే చాలు.

 

వ్యాయామం: వ్యామాయం చేసేవారిలో ఒత్తిడిని తట్టుకునే శక్తి కూడా పెరుగుతుందని తేలింది. నడక, ఈత, టెన్నిస్‌ వంటి ఆటలాడటం... ఇలా రోజూ ఏదో ఒక శారీరిక వ్యాయామం చేసేవారిలో మనసు కూడా దృఢంగా ఉంటుంది. అంతేకాదు! ఏదన్నా ఒత్తిడితో కూడిన పరిస్థితిలో ఉన్నప్పుడు కాసేపు అలా వాహ్యాలికి వెళ్లడమో, కనీసం ఆ వాతావరణం నుంచి బయటపడి ప్రకృతిని గమనించడమో చేసినప్పుడు ఒత్తిడి నుంచి చాలావరకూ ఉపశమనం లభించడాన్ని గమనించవచ్చు.

 

పరిమితులు గ్రహించడం:  అవసరానికి మించిన బాధ్యతలను నెత్తిన వేసుకోవడం, ‘కాదు, కుదరదు’ అని చెప్పడానికి భయపడి అదనపు బరువును మోయడమూ చాలా సందర్భాలలో ఒత్తిడికి కారణం అవుతుంది. ఇలాంటి పనుల మీద మనసు ఎలాగూ లగ్నం కాదు కాబట్టి.... లక్ష్యాలు మరింత భారంగా తోస్తాయి. ఒకో రోజూ గడిచే కొద్దీ మన గుండెల మీద కుంపట్లలాగా మారిపోతాయి. కొన్నాళ్లకి వాటిని వదిలించుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి బాధ్యతల విషయంలో భేషజాలకు పోకపోవడం అంటే... రాబోయే ఒత్తిడి నుంచి ముందుగానే తప్పుకోవడం అన్నమాట!

 

ఇవే కాకుండా ధ్యానం, యోగా, పోషకాహారం తీసుకోవడం, మత్తుపదార్థాలకు దూరంగా ఉండటం, సానుకూల దృక్పథం, తాత్విక చింతన, సామాజిక సంబంధాలు.... ఇవన్నీ కూడా ఒత్తిడి నుంచి దూరం చేసే సాధనాలే!